ఆర్‌సీబీతో రోహిత్‌ టైటిళ్లు సాధిస్తాడా?
close

తాజా వార్తలు

Published : 15/11/2020 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌సీబీతో రోహిత్‌ టైటిళ్లు సాధిస్తాడా?

టీమిండియా కెప్టెన్సీ మార్పులపై మాజీల మిశ్రమ స్పందన

ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్‌లో అయిదు టైటిళ్లు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్‌ కొనసాగుతున్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్‌ గెలవలేదు. కానీ అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వైస్‌కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అందుకే కోహ్లీని టెస్టులకు సారథిగా పరిమితం చేసి, హిట్‌మ్యాన్‌కు వైట్‌బాల్ ఫార్మాట్‌లో కెప్టెన్సీ ఇవ్వాలి.... గత కొన్నిరోజులుగా కొందరు మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాటలు ఇవి. అయితే వీటిని కొందరు మాజీలు ఖండిస్తున్నారు. బలమైన జట్టు ఉంది కాబట్టి రోహిత్‌ విజయాలు సాధిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆకాశ్‌ చోప్రా కూడా కోహ్లీకి మద్దతు నిలిచాడు. ఈ నేపథ్యంలో మాజీల అభిప్రాయాలను ఓ సారి చూద్దాం.

‘‘రోహిత్‌ శర్మ సారథి కాకపోతే టీమిండియాకే నష్టం. ఇంకా చెప్పాలంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌ లేదా పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అతడికి అప్పజెప్పకుంటే అది సిగ్గుచేటే. ఐపీఎల్‌ చరిత్రలోనే అతడు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. 13 సీజన్లలో ఒక ఆటగాడు ఐదు టైటిళ్లు అందిస్తే మరొకరు ఏమీ చేయలేదు. రోహిత్‌, కోహ్లీ ఒకే వేదికపై నాయకత్వం వహించారు. ఒకే సమయంలో సారథులుగా ఉన్నారు. రోహిత్‌ విజయవంతమయ్యాడు’’ - గౌతం గంభీర్

‘‘ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌ రోహిత్‌శర్మకు భారత టీ20 జట్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించకపోతే దేశానికి నష్టమని గౌతం గంభీర్‌ అభిప్రాయపడుతున్నాడు. కానీ నాదో ప్రశ్న. ఆర్‌సీబీ జట్టు బాధ్యతలు రోహిత్‌శర్మకు ఇస్తే.. ముంబయి తరఫున సాధించినట్లు అయిదు టైటిళ్లు సాధిస్తాడా? పోనీ రెండు, మూడు, లేదా నాలుగు ట్రోఫీలను అందుకుంటాడా? రోహిత్‌ కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుంది. అతడి ఆటతీరు నాకిష్టం. కానీ ముంబయి జట్టు విజయాలని భారత్‌ జట్టుతో పోల్చడం ఏంటి? కోహ్లీ జట్టు సరిగా ఆడలేదు కాబట్టి ట్రోఫీలు సాధించలేదు. అది కోహ్లీ పొరపాటు కాదు. టీమిండియాలో కెప్టెన్సీ మార్చాలని నేను భావించట్లేదు’’ - ఆకాశ్‌ చోప్రా

‘‘కోహ్లీ టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అతడి నుంచి గొప్ప విజయాలు చూశాం. అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచులను గెలపించగలడు. లీగ్‌లో తను సారథ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు ఆశించిన మేర రాణించట్లేదు. ఓ కెప్టెన్‌కు మంచి జట్టు ఉండటం అవసరం. బెంగళూరు జట్టు యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై కాకుండా జట్టు కూర్పుపై ఆలోచించాలి’’ - వీరేంద్ర సెహ్వాగ్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని