చైనీయుల ప్రవర్తన అస్సలు బాలేదు: కేంద్రం
close

తాజా వార్తలు

Published : 25/06/2020 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనీయుల ప్రవర్తన అస్సలు బాలేదు: కేంద్రం

ద్వైపాక్షిక ఒప్పందాల్ని పూర్తిగా ఉల్లంఘించిందన్న విదేశాంగ శాఖ

డ్రాగన్‌ తీరును ఎండగట్టిన భారత్‌

ముంబయి: గల్వాన్‌ లోయలో చైనా సైనిక బలగాల మోహరింపు, నిర్మాణాలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్య అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నొక్కిచెప్పింది. చైనీయుల మోహరింపు, దుందుడుకు స్వభావం జూన్‌6న చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని పేర్కొంది. వాస్తవ నియంత్రణ రేఖ వద్ధ యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని, మార్పులు చేయకూడదని రెండు దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని డ్రాగన్‌ ఎప్పుడూ లక్ష్యపెట్టలేదని కఠినంగా వ్యాఖ్యానించింది.

లద్దాఖ్‌ సమీపంలోని గల్వాన్‌‌ లోయలో వారం క్రితం భారత్‌, చైనా సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ తీవ్ర ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 70 మందికిపైగా గాయపడ్డారు. తమ కమాండర్ ‌మృతిచెందాడని అంగీకరించిన డ్రాగన్‌ మొత్తం ఎంతమంది సైనికులు చనిపోయారో లెక్క చెప్పలేదు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 35-40 మంది చైనీయులు హతమయ్యారని తెలుస్తోంది.

ఈ ఘర్షణ తర్వాత ఉద్రికత్తలు తగ్గించేందుకు రెండు దేశాలు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో విదేశాంగ శాఖలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఒక పక్క చర్చలు జరుపుతున్న చైనా మరోవైపు తప్పంతా భారత్‌దే అన్నట్టు తొండివాదనకు దిగుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ సైతం ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘గతంలో సందర్భానుసారం వెనక్కి తగ్గినప్పటికీ ఈ ఏడాది మాత్రం చైనా బలగాల ప్రవర్తన పరస్పరం చేసుకున్న అంగీకార నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది’ అని భారత విదేశాంగ శాఖ గురువారం ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘మే ఆరంభం నుంచీ ఇలాగే జరుగుతోంది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా భారీ స్థాయిలో బలగాలు, యుద్ధ సామగ్రిని మోహరించడం మొదలుపెట్టింది. గతంలో జరిగిన ద్వైపాక్షిక అంగీకారానికి ఇది పూర్తి విరుద్ధం. ప్రత్యేకించి భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద శాంతి, సామరస్యంగా ఉండాలన్న 1993 ఒప్పందానికి వ్యతిరేకం’ అని తెలిపింది.

అప్పటి ఒప్పందం ప్రకారం వాస్తవ నియంత్రణ రేఖ వద్ద తమ అధీనంలోని భూభాగంలో ప్రతి వైపు పరిమిత స్థాయిలో, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరిచేలా సైనిక బలగాలు ఉండాలని విదేశాంగ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు తీవ్రంగా మారడంతో చైనాతో ఉన్న సుదీర్ఘ సరిహద్దుల్లో అన్ని రకాల సైనిక బలగాలను మోహరించాలని భారత్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని