close

తాజా వార్తలు

Published : 05/12/2020 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలాంటి పైపులలో క్యాన్సర్‌ కారకాలు..!

తాగునీటి సరఫరా పైపుల నాణ్యతపై శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాగునీటి సరఫరాకు ఉపయోగించే కొన్నిరకాల పైపుల్లో రసాయన చర్యతో క్యాన్సర్‌ కారకాలు ఉత్పన్నం అవుతున్నట్లు తాజా అధ్యయనం నివేదించింది. ముఖ్యంగా ఇనుప పైపులలోని తుప్పులో ఉండే కొన్ని రకాల అణువులతో నీటిశుద్ధిరసాయనాలు జరిపే రసాయన చర్య వల్ల క్యాన్సర్‌ కారకాలు విడుదల అవుతున్నట్లు వెల్లడించింది. క్యాన్సర్‌ కారకమైన హెక్సావాలెంట్‌ క్రోమియం సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇంజినీర్లు తాజా పరిశోధనల్లో గుర్తించారు.

సాధారణంగా నేల, భూగర్భజలాలలో ఉండే క్రోమియాన్ని తుప్పు నిరోధకంగా ఇనుముతో కలుపుతారు. ఇలా చాలా ఏళ్లపాటు వాడిన ఇనుము పైపుల్లో వచ్చిన తాగునీరు నుంచి లేదా ఇతర ఆహార పదార్థాల ద్వారా ఈ క్రోమియం అణువులు ఒక్కోసారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే సాధారణ క్రోమియం అణువులు శరీరంలో పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించవు. కానీ, తుప్పుపట్టిన ఇనుము అవశేషాలతో క్లోరిన్‌ వంటి నీటిశుద్ధిరసాయనాలతో చర్య జరిగినప్పుడు అవి హానికరమైన హెక్సావాలెంట్‌ క్రోమియం అణువులుగా మారుతాయి.

పరిశోధనల్లో భాగంగా, క్యాన్సర్‌ కారక జన్యు ఉత్పరివర్తనాలకు కారణమయ్యే ఈ అణువులు శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయనే విషయంపై తొలుత శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. నీటి సరఫరాలో వినియోగించే పైపుల వల్ల ఇవి శరీరంలోకి చేరే అవకాశం ఉందని భావించారు. చివరకు పైపుల్లో ఉండే తుప్పుపట్టిన క్రోమియంతో నీటిశుద్ధి రసాయనాలులు జరిపే చర్యల వల్లే కాన్సర్‌ కారక రసాయనాలు విడుదల అవుతున్నట్లు గుర్తించారు. పరిశోధనలో భాగంగా, 5, 70 సంవత్సరాలు వాడుకలో ఉన్న రెండు పైపులను తీసుకొన్నారు. వాటి తుప్పును తొలగించి క్రోమియం పరిమాణాన్ని కొలిచారు. అనంతరం వీటిని హైపోక్లోరస్‌ యాసిడ్‌ ద్రావణంలో ఉంచి రసాయన చర్యను పరీక్షించారు. అప్పుడు నీటి శుద్ధిరసాయనాలతో క్రోమియం చర్యవల్లే హానికరమైన హెక్సావాలెంట్‌ అణువులు ఉత్పన్నం అవుతున్నట్లు నిర్థారణకు వచ్చారు. అయితే, గతంలో ఇలాంటి ప్రయోగాలను జరిపినప్పటికీ..తుప్పుపట్టిన ఇనుములోని జీరోవాలెంట్‌ క్రోమియం అత్యంత తొందరగా హానికర రూపంలోకి మారుతున్నట్లు తాజా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గ్రహించారు.

అయితే, తాజా పరిశోధనలు తాగునీటిలో ఉండే హెక్సావాలెంట్‌ క్రోమియంపై ఇప్పటివరకు తమకున్న అంచనాలను మార్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాగునీటి పైపుల నాణ్యత ప్రాముఖ్యాన్ని, క్రోమియం కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇవి మరోసారి గుర్తుచేశాయని అంటున్నారు. అందుకే తాగునీటిలో విష అణువులను తగ్గించే విధంగా మౌలికసదుపాయాలను మెరుగుపరచుకోవాలని అమెరికా పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అధిక క్రోమియం మిశ్రమమున్న పైపుల వాడకాన్ని తగ్గించడంతో పాటు క్రోమియంతో తక్కువ చర్య జరిపే నీటిశుద్ధిరసాయనాలను వినియోగించాలని తాజా నివేదిక ద్వారా సిఫార్సు చేస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన