మావోయిస్టులకు ట్రాక్టర్లు.. భాజపా నేత అరెస్ట్‌
close

తాజా వార్తలు

Published : 15/06/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మావోయిస్టులకు ట్రాక్టర్లు.. భాజపా నేత అరెస్ట్‌

దంతెవాడ: మావోయిస్టులకు ట్రాక్టర్లు కొని సమకూరుస్తున్న దంతెవాడ జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు జగత్‌ పుజారిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దశాబ్ద కాలంగా నిత్యావసరాలతోపాటు వివిధ రకాల వస్తువులను మావోయిస్టులకు చేరవేయడంలో జగత్‌ పుజారి ప్రమేయమున్నట్లు విచారణలో గుర్తించారు. మావోయిస్టు నేత అజయ్‌ అలామీ కోసమే రూ.9.10 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అజయ్‌ అలామీపై ఇది వరకే రూ.5 లక్షల పోలీసు రివార్డు ఉంది. 

అరెస్టు వివరాలను ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడిస్తూ..‘గత కొద్ది నెలలుగా మావోయిస్టు నేతల ఫోన్లపై నిఘా ఉంచాం. ఈ క్రమంలో అలామీ, పుజారి మధ్య వస్తువుల సరఫరాకు సంబంధించిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్‌ కొనుగోలు చేసివ్వాలని అలామీ కోరగా.. అందుకు పుజారి అంగీకరించాడు. కొనుగోలు చేసేందుకు కావాల్సిన పత్రాల్ని అలామీ స్వగ్రామానికి చెందిన రమేశ్‌ ఉసెంది నుంచి సేకరించారు’ అని ఎస్పీ తెలిపారు.

ముందస్తు సమాచారంతో కొత్త ట్రాక్టర్‌ తీసుకొని వస్తున్న రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. జగత్‌ కోసమే ఈ వాహనాన్ని తీసుకొస్తున్నట్లు రమేశ్‌ తెలిపాడని ఎస్పీ వివరించారు. దీంతో జగత్‌ పుజారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పదేళ్లుగా మావోయిస్టులకు కావాల్సిన వస్తువులను సరఫరా చేసినట్లు అంగీరించాడని పోలీసులు తెలిపారు.  కొద్ది నెలలుగా నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగానే ఈ అరెస్టులు చేశామని ఎస్పీ వెల్లడించారు. పుజారి గతంలో మావోయిస్టులకు కావాల్సిన దుస్తులు, బూట్లు, పేపర్లు, ప్రింటర్లు, కాట్రేజిలు, బ్యాటరీలు, రేడియో సెట్లు పంపిణీ చేసినట్లు తెలిసిందని, అయితే వీటికి సంబంధించి సరైన ఆధారాలేవీ లభ్యం కాలేదన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని