close

తాజా వార్తలు

20న అసెంబ్లీ ముట్టడి: చంద్రబాబు

భీమవరం ఐకాస ర్యాలీలో ప్రకటించిన తెదేపా అధినేత

భీమవరం: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వెన్నుపోటు పొడిచారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని సీఎం జగన్‌ ధ్వంసం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఐకాస నేతలు జోలె పట్టి విరాళాలు సేకరించారు. రాజధాని అంశం కేవలం రైతులకు మాత్రమే సంబంధించింది కాదని.. రాష్ట్ర ప్రజలందరికి, భవిష్యత్‌ తరానికి సంబంధించిన అంశమని చంద్రబాబు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 32 రోజులుగా రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేస్తూ వారిని బూటుకాలుతో తన్నడం దారుణని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపై దాడికి పాల్పడుతూ సీఎం జగన్‌ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ను సంతోషపెట్టేందుకు పోలీసులు బలిపశువులు అవుతున్నారని పేర్కొన్నారు. అధికారం ఉంటే తెదేపా కన్నా మెరుగ్గా పనిచేయాలని హితవు పలికారు. తెదేపా హయాంలో ఎవరైనా స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించామని.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. విశాఖ అంటే తనకూ ఇష్టమని.. అక్కడి ప్రజలపై అభిమానం ఉందన్నారు. ఈరోజు రాజధాని రైతులను మోసం చేసిన వ్యక్తులు భవిష్యత్‌లో విశాఖ వాసులను మోసం చేయరని నమ్మకం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రాంతం మీద వారికి ఎలాంటి అభిమానం లేదని.. అక్కడి భూముల మీద వైకాపా కన్నుపడిందని చంద్రబాబు విమర్శించారు.

అమరావతిని కాపాడుకునే బాధ్యత యువతపై ఉందన్నారు. అమరావతిని తరలిస్తే ప్రజలు వైకాపాను బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములను దోచుకునేందుకే రాజధాని మార్పును వైకాపా చేపట్టిందని ఆరోపించారు. మద్రాస్‌ ఐఐటీ నివేదిక అన్నారు.. వాళ్లు నివేదికే ఇవ్వలేదని రుజువైందని తెలిపారు. ఈ నెల 20న అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

ఇదీ చదవండి..

అమరావతి విధ్వంసానికి కుట్ర



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.