close

తాజా వార్తలు

Updated : 01/07/2020 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్‌

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో దుశ్చర్యకు పాల్పడ్డాయి. గస్తీ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బృందంపై దాడి చేశాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ అమరుడయ్యారు. మరో పౌరుడు సైతం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. బారాముల్లా జిల్లా సోపోర్‌ పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ దళాలపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే స్పందిందిన బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపాయి. కానీ, ముష్కరులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కంటతడి పెట్టిస్తున్న చిన్నారి రోదన..

మరోవైపు రోడ్డుపై ఓ కారులో మూడేళ్ల బాలుడితో ఉన్న ఓ పౌరుడిపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఉలిక్కిపడ్డ ఆ బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అతన్ని లేపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన అక్కడ ఉన్నవారి హృదయాల్ని ద్రవింపజేసింది. సైనికులు ఎంత ఓదార్చినా ఆ బాలుడు ఏడ్పు ఆపలేదు. మమ్మీ దగ్గరికి తీసుకెళ్లాలంటూ ప్రాధేయపడ్డాడు. బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకొచ్చామంటూ సైనికులు బుజ్జగించే ప్రయత్నం చేసినా అక్కడి నుంచి కదల్లేదు. మృతదేహంపై కూర్చుని ఏడుస్తూ లేపేందుకు చేసిన ప్రయత్నం అందరినీ కంటతడి పెట్టించింది. బహుశా ఆ బాలుడు చనిపోయిన వ్యక్తి కుమారుడు అయి ఉంటాడని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సోపోర్‌ పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు జమ్మూ-కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 100 మందికిపైగా ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు దిల్‌బాగ్‌ సింగ్‌ ఇటీవలే తెలిపారు. వీరిలో 50 మందికి పైగా హిజ్బుల్‌ ముజాహిదీన్‌, 20 మంది లష్కరే తోయిబా, 20 మంది జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన వారిగా పేర్కొన్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని