close

తాజా వార్తలు

Updated : 29/10/2020 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులు: కేసీఆర్‌

మేడ్చల్‌‌: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... ధరణిపోర్టల్‌ భారతదేశానికి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. ‘‘ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే. సాగువిధానంలో అధునాతన మార్పులు వచ్చి ఆస్తిగా మారింది. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్‌ రూపకల్పన చేశాం. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా వారి భూముల వివరాలు ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. ధరణి పోర్టల్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదు. తప్పు చేసే అధికారం నాకులేదు. ఒక తప్పు జరిగితే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడతాయి. తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. మీ-సేవ, ధరణి పోర్టల్‌, వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ధరణి పోర్టల్‌ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నమూనా పత్రాల ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేసుకోవచ్చు’’ అని సీఎం వివరించారు.

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచలేదు

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని సీఎం స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ రూపకల్పన కోసం దాదాపు 200 సమావేశాలు నిర్వహించామని గుర్తు చేశారు. ‘‘కొత్తగా జరిగే క్రయ,విక్రయాల నమోదు 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. . కార్యాలయాల చుట్టూ తిరిగే కర్మ ఇకపై ఉండదు. రిజిస్ట్రేషన్ల కోసం పైరవీలు చేసే అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో ఒక్క పైసా కూడా పెంచలేదు. పాత రిజిస్ట్రేషన్‌ ఛార్జీలే వర్తిస్తాయి. ధరణి పోర్టల్‌లో 99శాతం సాంకేతిక సమస్యలు రాకుండా రూపకల్పన చేశాం. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించే బృందాలు అందుబాటులో ఉంటాయి. ఒక వేళ డాక్యుమెంట్‌ రైటర్ల సహాయం కావాలంటే వాళ్లు కూడా అందుబాటులో ఉంటారు. డాక్యుమెంట్‌ రైటర్లు గతంలో లాగా ఎలాపడితే అలా రుసుం వసూలు చేసేందుకు వీల్లేదు’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

సాదాబైనామాల గడువు మరో వారం పొడిగింపు
కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతుబంధు ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతు బంధు కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదని, ఆర్థిక శాఖ కార్యదర్శి ఒక్క క్లిక్‌ చేస్తే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయన్నారు. సాదాబైనామాలకు చిట్టచివరి అవకాశం ఇస్తే.. 1.64లక్షల దరఖాస్తులు వచ్చాయని సీఎం తెలిపారు. సాదాబైనామాల గడువు మరో వారం పొడిగించినట్టు చెప్పారు. అతి త్వరలో వీఆర్వోల సమస్యను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వివిధశాఖల్లో ఉన్న ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేస్తామని తెలిపారు. మూడుచింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ వీరారెడ్డి 1969లో రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారిలో అగ్రణ్యులని గుర్తు చేశారు. ఆ మహనీయుడు పుట్టిన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి జైలుపాలైన వ్యక్తుల్లో వీరారెడ్డి ఒకరు అని కేసీఆర్ వివరించారు.  

కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. భూ రికార్డుల ప్రక్షాళన చేపడతామని మూడేళ్ల క్రితం మూడుచింతలపల్లిలోనే సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ధరణి పోర్టల్‌ ప్రారంభించండం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తం



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.