close

తాజా వార్తలు

Published : 25/07/2020 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తప్పుని అంగీకరించిన బోరిస్‌ జాన్సన్‌!

కరోనా కట్టడిలో సమర్థంగా పనిచేయలేకపోయామన్న బ్రిటన్‌ ప్రధాని

లండన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బ్రిటన్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో బ్రిటన్‌ ముందువరుసలో ఉంది. దీనికి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వ విధానాలే కారణమని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా బోరిస్‌ జాన్సన్‌ కూడా అంగీకరించారు. తొలినాళ్లలో వైరస్‌ కట్టడిలో తాము సమర్థంగా పనిచేయలేకపోయామని తెలిపారు. ఇంకా మెరుగైన చర్యలు తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆయన అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థ బీబీసీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లాక్‌డౌన్‌ విధింపులో ఆలస్యం చేశామన్న ఆరోపణలు ఉన్నాయని.. ఆ విషయంలో తన పాలకవర్గం ఇంకా ముందు చూపుతో వ్యవహరించి ఉండాల్సిందని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నింటిన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  లక్షణాలు లేని వారి నుంచి కూడా వైరస్‌ ఈ స్థాయిలో వ్యాపిస్తుందని తొలినాళ్లలో అంచనా వేయలేకపోయామన్నారు. మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈసారి దాన్ని సమర్థంగా కట్టడి చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని ప్రజలు తమ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. 

మహమ్మారితో మరణించిన ప్రతి ఒక్కరికి జాన్సన్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని చర్యలకు తానే బాధ్యత వహిస్తున్నానన్నారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2,97,914 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 45,677 మంది మరణించారు. కొత్త కేసుల సంఖ్య మే నెల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. అయితే, మరోసారి విజృంభించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. 

స్వయంగా బోరిస్‌ జాన్సన్‌ మహమ్మారి బారిన పడ్డ విషయం తెలిసిందే. పది రోజుల చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఓ దశలో ఆయనకు వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందించాల్సిన అవసరం వచ్చింది. తొలినాళ్లలో వైరస్‌ కట్టడిని ఆయన నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సామూహిక నిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ) వస్తుందన్న అంచనాతో లాక్‌డౌన్‌ను సైతం నిర్లక్ష్యం చేశారన్న వాదన వినిపించింది. దీనివల్లే ఎక్కవ మంది మరణించారన్న ఆరోపణలు ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.