
తాజా వార్తలు
‘టిడ్కో’ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘం పరిధిలోని టిడ్కో ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అప్పటి పురపాలక సంఘం ఛైర్మన్ గంజి చిరంజీవితో పాటు మరో ఏడుగురు కౌన్సిలర్లు, ఎనిమిది మంది అధికారులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గతేడాది విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన విజిలెన్స్ అధికారులు ఈ ఏడాది జనవరిలో విచారణ చేపట్టారు.
ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డ ఎనిమిది మంది కౌన్సిలర్లు గంజి చిరంజీవి, నరేంద్ర, రమణ, శ్రీనివాసరావు, నాగలక్ష్మి, రమాదేవి, మల్లేశ్వరి, అప్పటి కమిషనర్లు రంగారావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శివారెడ్డితోపాటు మరో నలుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళగిరి పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.