పోలవరంపై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు
close

తాజా వార్తలు

Published : 19/01/2020 00:29 IST

పోలవరంపై ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు

అమరావతి: పోలవరం ప్రాజక్టుపై ఒడిశా ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్లో ఒక్కటి కూడా నిజం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. పోలవరం ప్రాజక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 20న దాఖలు చేసిన అఫిడవిట్‌కు ఏపీ కౌంటర్‌ దాఖలు చేసింది. ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు కౌంటర్‌లో వివరణ ఇచ్చింది. ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు అధికారిక రికార్డులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కౌంటర్‌లో పేర్కొంది. 2009 మార్చి 9న జారీ చేసిన పర్యావరణ అనుమతుల ప్రకారం ప్రజాభిప్రాయసేకరణ చేపట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అసంబద్ధ కోణాలను ప్రస్తావిస్తూ ప్రజాభిప్రాయసేకరణ పరిధిని పెంచాలని కోరుతోందని.. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదని ఏపీ తన అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది.

1980ల నాటి గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ తీర్పుతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలకు చెందిన రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 150 అడుగుల పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించేందుకు అప్పటి ఒడిశా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేసినట్లు గుర్తు చేసింది. తమ రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే వారికి పరిహారం చెల్లింపు.. లేదంటే ముంపు సమస్య తలెత్తకుండా రక్షణ గోడ నిర్మించడానికి అంగీకారం కూడా ఆ ఒప్పందంలో భాగమేనని ప్రభుత్వం తన కౌంటర్‌లో వివరించింది. ఆ రాష్ట్రాల్లో ముంపు తలెత్తకుండా శబరి, సీలేరు నదుల పొడవునా రక్షణ గోడ నిర్మించడానికి 2009 ఫిబ్రవరి 17న నిపుణుల కమిటీ అనుమతించినట్లు ప్రభుత్వం అఫిడవిట్‌లో పొందుపర్చింది. దీనికి ముందు కమిటీ సూచనల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సూచించినా.. ఎలాంటి ఫలితం లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. ప్రాజక్టుకు గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతోనే కేంద్ర జలసంఘం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఐదు వందల ఏళ్లకు ఒకసారి వచ్చే వరదను దృష్టిలో పెట్టుకునే 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో స్పిల్‌వే నిర్మాణానికి జల సంఘం సిఫారసు చేసినట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. పోలవరం ప్రాజక్టుపై మళ్లీ అధ్యయనాలు అవసరం లేదని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని