ఇంజినీరింగ్‌ తరగతులకు గ్రీన్‌ సిగ్నల్‌
close

తాజా వార్తలు

Published : 20/10/2020 00:48 IST

ఇంజినీరింగ్‌ తరగతులకు గ్రీన్‌ సిగ్నల్‌

ప్రకటించిన ఏఐసీటీఈ

దిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితి వల్ల ఇంజినీరింగ్‌ విద్య ప్రవేశాలు, తరగతుల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ సాంకేతిక విద్య సాధికార సంస్థ ‘ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌’ (ఏఐసీటీఈ) సాంకేతిక విద్యకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సవరించిన క్యాలెండర్‌ను సంస్థ ఇటీవల ప్రకటించింది.

ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నట్టు ఏఐసీటీఈ తెలిపింది. ఇందుకు అనుగుణంగా తమ పరిధిలోకి వచ్చే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు తుది గడువును నవంబర్‌ 30కి పొడిగించినట్టు తెలిపింది. డిప్లమో లేటరల్‌ ఎంట్రీ కోర్సుల నియామకాలకు కూడా ఇదే తుది గడువని సంస్థ వెల్లడించింది. కాగా ఈ గడువు గతంలో అక్టోబరు 20గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయా సంస్థల్లో మొదటి సంవత్సరం తరగతులు డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమవుతాయని కౌన్సిల్‌ ప్రకటించింది.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, లేదా సంయుక్త విధానంలో తరగతుల నిర్వహణలో కొవిడ్-19 నియమ నిబంధనలను పాటించాల్సిందిగా ఏఐసీటీఈ విద్యాసంస్థలకు సూచించింది. గతంలో ప్రకటించిన తేదీకి అనుగుణంగా తరగతులు ప్రారంభించిన విద్యాసంస్థలు.. వాటిని వెంటనే రద్దు చేయాలంటూ ఆదేశించింది. ఇక తొలి, చివరి సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవ్వాల్సిన విద్యార్థులు సన్నద్ధమయేందుకు అనువుగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలియచేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని