close

తాజా వార్తలు

Published : 24/09/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. అమరావతికే నా మద్దతు: కేంద్రమంత్రి అథవాలే

రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్‌ న్యాయమైందని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. గురువారం ఉదయం ఐకాస మహిళా నేతలు, రైతులు కేంద్రమంత్రిని కలిసి అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయన్ని వివరించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారన్న ఆయన... ఈ అంశంపై  ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు. అమరావతి గొప్ప చారిత్రక ప్రాంతమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శ్రీవారి సేవలో జగన్‌, యడియూరప్ప

తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం ఏపీ సీఎం జగన్‌, కర్ణాకట ముఖ్యమంత్రి యడియూరప్ప దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న జగన్‌ మహాద్వారం వద్ద యడియూరప్పకు స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఇరు రాష్ట్రాల సీఎంలకు ఆశీర్వచనం పలికారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం కర్ణాటక నుంచి వచ్చే తిరుమల భక్తుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తిరుమలలో జరిగిన భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘జగన్‌ మాస్కు పెట్టుకోరు..పెట్టుకోనివ్వరు’

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. మూర్ఖత్వానికి ప్రతి రూపంగా జగన్‌ మిగిలిపోయారని ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు, వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. సీఎం జగన్‌ మాస్కు పెట్టుకోకపోగా వేరే వాళ్లు పెట్టుకుంటే ఊరుకోరని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ మాస్క్‌ పెట్టుకోలేదన్న కారణంతో పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి చంపడమెందుకని ప్రశ్నించారు.   కిరణ్‌ మృతి ఘటన.. మాస్క్‌ పెట్టుకోనందుకా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అని లోకేశ్‌ నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రైతులను కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టిస్తోంది:తోమర్‌

పార్లమెంట్‌ ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వారికి మద్దతుగా కాంగ్రెస్ గురువారం నుంచి దేశ వ్యాప్తంగా రెండు నెలల కాలానికి సుదీర్ఘ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ బిల్లులను రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బిల్లులుగా అభివర్ణిస్తూ కేంద్రం చర్యలను విమర్శించింది. ప్రస్తుతం ఆ బిల్లుల చట్టాలుగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో పంజాబ్ వ్యాప్తంగా రైతులు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్‌ కమిటీ నేతృత్వంలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రైలు రోకో నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేను మాస్క్‌ వేసుకోను.. ఏమౌతుంది?

మధ్యప్రదేశ్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతున్నప్పటికీ ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తను ఏ కార్యక్రమంలోనూ మాస్క్ ధరించనని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయన తీరుపై విమర్శలు చెలరేగడంతో.. ఆనారోగ్య సమస్య వల్లే  తాను మాస్క్‌ ధరించడంలేదని ఆయన వివరణ ఇచ్చారు. పేద, వెనుక బడిన వర్గాలకు సహాయాన్ని అందించే సంబాల్ యోజన పంపిణీ కార్యక్రమంలో ఆయన బుధవారం పాల్గొన్నారు.  అనంతరం పలువురి ప్రాణాలను కాపాడిన ఇండోర్‌ పోలీసు సిబ్బందికి సన్మానం చేయడంతోపాటు పలు కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికన్‌ ఓటర్లకు ట్విటర్‌ అవగాహన

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ దేశ ఓటర్లకు ఎన్నికల అవగాహన పెంపొందించేందుకు ఓ భారీ ప్రయత్నాన్ని ప్రారంభించినట్టు సామాజిక మాధ్యమం ట్విటర్‌ ప్రకటించింది. మంగళవారం అమెరికా జాతీయ ఓటరు నమోదు దినోత్సవం సందర్భంగా @TwitterGov పేరుతో ఓ ఆన్‌లైన్‌ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఆ దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, నిబంధనలను గురించిన పూర్తి సమాచారం ఓటర్లకు అందుతుందని సంస్థ వెల్లడించింది. దీనికోసం తాము అధికారిక ‘నేషనల్‌ ఓటర్ రిజిస్ట్రేషన్‌ డే’ కార్యక్రమంతో సంయుక్తంగా కృషి చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కంగనకు సమన్లు ఎందుకివ్వలేదు..?

ఒకప్పుడు తాను డ్రగ్స్‌కి బానిసయ్యానని బాలీవుడ్‌ నటి కంగన రనౌతే స్వయంగా చెప్పినప్పటికీ ఎన్సీబీ అధికారులు ఆమెకు సమన్లు ఎందుకు ఇవ్వలేదని నటి, కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితోపాటు డ్రగ్స్‌ సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వాట్సాప్‌ సందేశాల ఆధారంగా నటీమణులు దీపికా పదుకొణె, సారాఅలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, రకుల్‌కు ఎన్సీబీ అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు అదే బాటలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నంలోపు పుంజుకుంటాయని ఆశించిన మదుపర్లకు నిరాశే ఎదురవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతోందని అక్కడి అధికారులు ప్రకటించడం మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటితోపాటు యూరప్‌లో కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేయడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ నష్టాల్లోనే పయణిస్తున్నాయి. ఈ ఉదయం నష్టాలతోనే మొదలైన సెన్సెక్స్‌, ప్రస్తుతం మరో 700 పాయింట్లు నష్టపోయి 36,950 పాయింట్లకు పడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 24 గంటల్లో 86వేల కేసులు, 1129 మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,56,569 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 86,507 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో గురువారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 57,32,518కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 46లక్షల 74వేల మంది కోలుకోగా, మరో 9లక్షల 66వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న మరో 86వేల మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న మరో 1129 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జోరుమీదో జట్టు.. కసితో మరొకటి

పరాజయాల పరంపరకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈసారి తానూ టైటిల్‌ రేసులో ఉన్నానని ప్రత్యర్థులకు సంకేతాలు పంపించింది బెంగళూరు. తొలి మ్యాచ్‌లో విజయంతో కోహ్లీ సేన మంచి ఊపు మీద కనిపిస్తోంది. మరోవైపు.. తొలి మ్యాచ్‌లో విజయపుటంచుల వరకూ వచ్చి సూపర్‌ ఓవర్‌ రూపంలో ఓడిన పంజాబ్‌. అంపైర్‌ తప్పిదంతోనే మ్యాచ్‌ కోల్పోయామని భావిస్తున్న ఆ జట్టు కసితో రగిలిపోతోంది. ఈ రెండు జట్ల మధ్య నేటి సాయంత్రం ఉత్కంఠ పోరు సాగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.