close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/07/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. భారత్: ఒక్కరోజే 32,695 కేసులు, 606 మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఊహించని రీతిలో విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 32,695 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా గడిచిన 24గంటల్లో 606 కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో గురువారం నాటికి దేశంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 9,68,876కు చేరగా వీరిలో ఇప్పటి వరకు 24,915 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అక్రమ సొమ్మును పట్టుకోవాలి?: లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడుకు రూ.5.27 కోట్లు తరలిస్తూ వాహనం పట్టుబడిన వ్యవహారంపై తెదేపా నేత నారా లోకేశ్‌ ట్విటర్‌లో స్పందించారు. వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏం రేంజ్‌లో ఉందో ఈ ఘటన చూస్తే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం జగన్‌ ..సాండ్‌, ల్యాండ్‌, వైన్‌ తమిళనాడులో దొరికిపోయింది. ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారులో రూ.5.27కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం పట్టుకుని గొప్పగా చెప్పుకోవడం కాదు..పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్మును పట్టుకోవాలి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్రపతిని కలిసిన తెదేపా ఎంపీల బృందం

తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌లో 13 నెలల కాలంలో  దాడులు పెరిగిపోయాయని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వైకాపా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీల బృందం గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిసి ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, కేశినేని, కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తిరుమలలో వైభవంగా ఆణివార ఆస్థానం

శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంను తితిదే వైభవంగా నిర్వహించింది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు. మందిరంలోని బంగారు వాకిలి వద్ద ఘంటా మండపంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామివారిని గరుత్మంతునికి అభిముఖంగా ఆశీనులు చేసి పాలు, తేనె, పచ్చ కర్పూరం, సుగంధమైన పరిమళాలతో అభిషేకాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. హోమ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లిన గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ హోమ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లాడు. బుధవారం సాయంత్రం అతడి సోదరుడు, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ స్నేహశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడమే ఇందుకు కారణం. అతడికి వైరస్‌ సోకిందని తెలియగానే బెల్లీ వ్యూ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా స్నేహశీష్‌ జ్వరంతో బాధపడుతున్నాడని, ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు బెంగాల్‌ క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గంగూలీ సైతం కొద్ది రోజులు గృహ నిర్బంధంలో ఉంటాడని అతడి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. న్యూయార్క్‌లో ఓ సీఈవో హత్య!

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ  వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. రవాణ, ఫుడ్‌ డెలివరీ సేవలు అందించే సంస్థ సహవ్యవస్థాపకుడు ఫాహిమ్‌ సలేహ్‌ను తన విలాసవంతమైన ఫ్లాట్‌లో గుర్తితెలియని వ్యక్తులు హత్య చేశారు.  ఆయన సోదరి అక్కడకు వచ్చే సరికి ఫాహిమ్‌ మృతదేహాన్ని దుండగులు ముక్కలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరు చూసి ఎవరో అనుభవం ఉన్న హంతకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫాహిమ్‌ సోదరి అక్కడకు వచ్చే వరకు హంతకుడు ఫ్లాట్‌లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒబామా, బిల్‌గేట్స్‌, బెజోస్‌..ట్విటర్‌ ఖాతాలు హ్యాక్‌!

సామాజిక మాధ్యమం ట్విటర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఈసారి అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా హ్యాకర్లు ట్విటర్‌ ఖాతాలపై దాడి చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌, ఎలాన్‌ ముస్క్‌తో పాటు మరికొందరి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు సమాచారం. వీరి అధికారిక ఖాతాలలో అనుమానాస్పద ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. వీటన్నింటిలోనూ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ స్కాం ముఠానే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మా కోసం ధోనీ అలా చేశాడు

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎంతో నమ్మకమైన వ్యక్తి అని, తాను టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉండేదని దక్షిణాఫ్రికా క్రికెటర్‌‌ గ్యారీ కిర్‌స్టెన్‌ చెప్పాడు. తాజాగా ‘ది ఆర్కే షో’లో మాట్లాడిన అతడు ధోనీ గురించి అలాగే 2011 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఓ సంఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను కలిసిన వాళ్లలో అతడే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అని, ఈ విషయం తాను ఎన్నోసార్లు చెప్పానన్నాడు. అలాగే ప్రజల దృష్టిలో మహీ గొప్ప సారథిగా నిలిచిపోయాడన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ట్విటర్ హ్యాక్‌: ఇదో కఠినమైన రోజు..సీఈవో

సైబర్‌ నేరగాళ్ల ధాటికి ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ‘ట్విటర్‌’ వణికిపోయింది. క్రిప్టోకరెన్సీ మోసాలకు పాల్పడే సైబర్‌ నేరగాళ్లు తాజాగా ప్రపంచ కుబేరులు, ప్రముఖులే లక్ష్యంగా వారి ట్విటర్‌ అధికారిక ఖాతాలపై దాడికి పాల్పడడంతో ట్విటర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హ్యాకర్ల దాడిపై తాజాగా కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే స్పందించారు. ‘ఈ ఊహించని ఘటనను భయానక దాడిగా భావిస్తున్నాం. ఇది మాకెంతో కఠినమైన రోజు. నిజంగా ఏం జరిగిందో అనే విషయంపై విశ్లేషిస్తున్నాం. మేము ధ్రువీకరించుకున్న వెంటనే మీతో ఆ సమాచారాన్ని పంచుకుంటాం’ అని కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే ట్విటర్‌లో‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆరోగ్య రంగంలో సమూల మార్పులు: జగన్‌

ఆరోగ్య రంగంలో పూర్తిగా మార్పులు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్‌ మాట్లాడుతూ... నేటి నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు అందించనున్నట్లు తెలిపారు. జాతీయ ప్రమాణాల దిశగా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెట్‌ వర్క్‌ ఆసుపత్రిని గ్రేడింగ్‌ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.