close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/06/2020 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: కళా

వైకాపా నేతలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పేదలకు ఇళ్ల స్థలాల పథకం వైకాపా నేతలకు ఆర్థిక ఫలాల పథకంగా మారిందని వ్యాఖ్యానించారు. దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారిని బెదిరించి ఏకపక్షంగా భూములు లాక్కుని ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పేరుతో రూ.లక్షలు విలువచేసే భూములను రూ.కోట్లు విలువ చేసే భూములుగా చూపించి దోచుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం సరికాదు: గుత్తా

రాజకీయలబ్ధికోసం కాంగ్రెస్‌ నాయకులు ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల పూర్తి కోసం తెరాస సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తూ .. నిర్మాణాలు కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణం 33 కిలోమీటర్ల మేర పూర్తయిందని, మిగతా పనులు కొనసాగుతున్నాయని గుత్తా వివరించారు. దిండి రిజర్వాయర్‌ 93 శాతం మేర పూర్తయిందని తెలిపారు. తెరాస అధికారం చేపట్టిన   తొలి ఏడాదిలోనే శ్రీశైలం సొరంగం పనులపై కేసీఆర్‌ సమీక్షించారని గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నా హత్యకు సుపారీ ఇచ్చారు: సుబ్బారెడ్డి

తనను హత్య చేయించేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చారని పోలీసులు చెప్పిన విషయాలు విని షాకయ్యానని తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో సుబ్బారెడ్డి మాట్లాడుతూ...‘‘ నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నాను. నాకు అఖిలప్రియ రాజకీయం నేర్పుతుందా?. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న. అఖిలప్రియపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా నన్ను ఆళ్లగడ్డ రమ్మంటోంది. నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే చెప్పాలి’’ అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జులైలో మరోసారి మిడతల దాడి

పంటలపై ముప్పేట దాడికి దిగి వివిధ రాష్ట్రాలను కలవరపెట్టిన మిడతల దండు జులైలో మరోసారి భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) అంచనా వేసింది. ఇప్పటికే పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈ మిడతల దండు తీవ్ర స్థాయిలో పంటనష్టానికి కారణమైన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌, జోధ్‌పూర్‌ సహా మధ్యప్రదేశ్‌లోని వింధ్య, బుందేల్‌ఖండ్‌, గ్వాలియన్‌-చంబల్‌ ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ మిడతల దాడి కొనసాగుతున్నట్లు జాతీయ మిడతల హెచ్చరిక కేంద్రం(ఎల్‌డబ్ల్యూఓ) తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్‌ కోర్టు నోటీసులు

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అక్కడి ఓ కోర్టు శనివారం నోటీసలు జారీ చేసింది. 2017లో నమోదైన ఓ పరువు నష్టం దావా కేసులో ఆయన నోటీసులు అందుకున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ అధ్యక్షుడు షహ్‌బాజ్‌ షరీఫ్‌ ఈ కేసు నమోదు చేశారు. ఇమ్రాన్‌ ఓ సభలో మాట్లాడుతూ.. పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్‌పై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కోరుతూ షహ్‌బాజ్‌ తనకు 61 మిలియన్‌ డాలర్లు ఇవ్వజూపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపిన షహ్‌బాజ్‌ కోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు వేలాది మంది అభిమానులు

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలలుగా అన్ని క్రీడలూ స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు లేకుండానే క్రీడలు ప్రారంభించాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న వియత్నాం.. శుక్రవారం ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ నిర్వహించింది. దీనికి సుమారు 30 వేల మంది అభిమానులు హాజరయ్యారు. వియత్నాం ప్రొఫెషనల్‌ లీగ్‌లో భాగంగా నామ్‌దిన్హ్‌ స్టేడియంలో నిర్వహించిన తొలి మ్యాచ్‌కు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. వారంతా సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారు. ఒకర్నొకరు తాకుకుంటూ మ్యాచ్‌ను ఆస్వాదించారు. కొద్ది మంది మాత్రమే ముఖానికి మాస్క్‌లు ధరించి కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నా వద్ద సమాధానం ఉండాలి.. అందుకే రాజీనామా!

 జాత్యహంకారానికి నిరసనగా ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియాన్ తన పదవి నుంచి వైదొలగారు. తన స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని ఆయన కోరారు. ఈ అమెరికన్‌ వ్యాపార దిగ్గజం, టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నల్లకలువ’ సెరీనా విలియమ్స్‌ భర్త అన్న సంగతి తెలిసిందే. ‘‘నా కుమార్తె పెరిగి పెద్దదై ‘నువ్వేం చేశావ్‌ నాన్నా?’ (జార్జి ఫ్లాయిడ్ మృతి ఘటన గురించి‌) అని అడిగితే.. నా వద్ద సమాధానం ఉండాలి. అందుకే రాజీనామా చేశా’ అని 37 సంవత్సరాల అలెక్సిస్‌ వివరించారు. పోలీసుల దౌర్జన్యం వల్ల ఆఫ్రో‌-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మే 25న మరణించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓటీటీలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’?

‘బాహుబలి’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తర్వాత శోభూ యార్లగడ్డ నిర్మించిన సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ‘యు’ సర్టిఫికెట్‌ లభించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. జూన్‌ చివర్లో లేదా జులై ఆరంభంలో ఇది ప్రసారం కాబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నరేష్‌, హరి చందన, జబర్దస్త్‌ రాంప్రసాద్‌, టీఎన్‌ఆర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్‌ సంగీతం అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆరుగురికి కరోనా..దిల్లీ ఈడీ ఆఫీస్‌ మూసివేత

దేశరాజధానిలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కొవిడ్‌ బారిన పడుతుండటంతో వాటిని మూసివేస్తున్నారు. తాజాగా‌ దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రధాన కార్యాలయానికి వైరస్‌ సెగ తాకింది. అందులో పనిచేసే ఆరుగురు అధికారులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో సన్నిహితంగా ఉన్న పది మందికిపైగా సిబ్బందిని క్వారంటైన్‌ చేశారు. శానిటైజేషన్‌ పనులు చేపట్టేందుకు ప్రధాన కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాన్ని అధికారులు వారానికి రెండు రోజులు శానిటైజేషన్‌‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 9న జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి  ఈనెల 9న సినీ ప్రముఖలతో సమావేశం కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు సీఎంతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించినట్లు చెప్పారు. పుట్టిన రోజు వేడుకల వల్ల హాజరు కాలేనని బాలకృష్ణ తెలిపారని సి.కల్యాణ్‌ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి గ్రూపులూ లేవని, అందరం కలిసికట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, చిత్రీకరణ అనుమతులపై చర్చిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.