close

తాజా వార్తలు

మూగజీవాలకు దిక్కేది?

● పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు నిరుపయోగం

గిద్దలూరులో నిరుపయోగంగా ఉన్న పశువ్యాధి నిర్ధారణ కేంద్రం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: అసలే కరవు... పశువులకు కడుపు నిండా మేత... దాహార్తి తీర్చేలా నీరు అందించలేక పోషకులు సతమతమవుతున్నారు. మరోవైపు జీవాలకు సోకే వ్యాధులను నివారించలేక... పశువులను సాకలేక... అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా సహకారం అరకొరగానే ఆగిపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది.పశుపోషకులకు అందుబాటులో ఉండేలా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట నిర్మించ తలపెట్టిన పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు నామమాత్రంగా మారాయి. అప్పట్లో అన్ని నియోజకవర్గాలకు వీటిని మంజూరు చేసినా, కేవలం అయిదు నియోజకవర్గాల్లో మాత్రమే భవనాలు నిర్మించారు. ఒక్కో కేంద్రానికి రూ.15 లక్షల వంతున ఖర్చు చేశారు. తీరా నిర్మాణాలు పూర్తయినా, అందులో మౌలిక వసతులు, సిబ్బంది, పరికరాలను సమకూర్చలేదు. దీంతో గత నాలుగేళ్లుగా అవి ఎందుకూ కొరగానివయ్యాయి. పశువులకు సోకే వ్యాధుల నిర్ధారణ పరీక్షలకు ప్రస్తుతం ఒంగోలు మాత్రమే దిక్కు. ఆ నివేదిక వచ్చే వరకు పోషకులు వేచి ఉండాల్సి వస్తోంది. వేలకు వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులు వ్యాధులతో మృతి చెందడంతో పశుపోషకులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.

అయిదు నియోజకవర్గ కేంద్రాల్లో భవనాల నిర్మాణం

నాలుగేళ్ల కిందట గ్రామీణ సమగ్రాభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్లో పశువ్యాధి నిర్ధారణ కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌ పరికరాలు సమకూర్చలేదు. వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల నియామకం చేపట్టలేదు. దీంతో ఆయా భవనాలకు తాళాలు వేసి నిరుపయోగంగా ఉంచారు. పశువులకు థైలీరియా, ప్రోటోజోన్‌, డెబిసియా, అంత్రాక్స్‌, చొప్పువాపు, గొంతు వాపు తదితర వ్యాధులు వస్తున్నాయి. ఆయా వ్యాధుల తీవ్రతను బట్టి రక్త నమూనాలు సేకరించాల్సి వస్తోంది. పశువుల పేడ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం పశువులు వ్యాధులతో మృతి చెందితే వ్యాధి నిర్ధారణకు నమూనాలను ఒంగోలుకు పంపించాల్సి వస్తోంది. పరీక్షల ఫలితాలు అక్కడి నుంచి సకాలంలో రాకపోవడంతో పోషకుల వద్ద ఉన్న మిగతా పశువులకు కూడా వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నాయి. ఒంగోలులో అందుబాటులో లేని నిర్ధారణ పరీక్షలకు నమూనాలను హైదరాబాద్‌కు పంపుతుండడంతో ఫలితాలు వచ్చే సరికి నెలలు గడుస్తున్నాయి.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

జిల్లాలో నిర్మించిన పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆయా కేంద్రాల్లో సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పరికరాలకు నిధులు కేటాయించాలని నివేదించాం. నిధులు, సిబ్బంది కేటాయింపు వచ్చిన వెంటనే వాటిని వినియోగంలోకి తీసుకవచ్చేలా చర్యలు తీసుకుంటాం. -వి.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జిల్లా పశువర్ధక శాఖ సంచాలకులు


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.