TS: మాస్క్‌ ధరించకపోతే జరిమానా

తాజా వార్తలు

Updated : 11/04/2021 18:26 IST

TS: మాస్క్‌ ధరించకపోతే జరిమానా

హైదరాబాద్‌: కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్‌ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రజా రవాణా, కార్యాలయాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

కరోనా నుంచి రక్షణ పొందేందుకు మాస్కులు పెట్టుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. యువత మాస్క్‌ లేకుండా తిరుగుతున్నారు. మాస్క్‌ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని.. అప్పటికీ వినిపించుకోకుంటే అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలన్నీ కాగితాలకే పరిమితం కావడంతో కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా జరిమానా విధించాలనే నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపిల్లలు, యువత తప్పనిసరి మాస్కు ధరించాలని, పదేళ్లలోపు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఏపీలోనూ జరిమానాలు

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. మాస్కులు తప్పని సరిగా ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ.. జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

కర్ణాటకలో రూ. 10 వేలు

కరోనా విస్తృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు వచ్చే వారికి అక్కడి ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పని సరి చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. ఏసీ హాళ్లు.. దుకాణాల్లో ఎడం అమలు చేయని నిర్వాహకుల నుంచి రూ.5 వేలు, పెద్ద స్థాయి సముదాయాలు, స్టార్‌ హోటళ్లు, 500 మందికి మించి హాజరయ్యే వివాహ మందిరాలు, బహిరంగ సభల నిర్వాహకుల నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నారు. మాస్కు లేకుండా బయటకు వస్తే నగరాల్లో రూ.250, గ్రామాల్లో రూ.100 జరిమానా విధిస్తున్నారు.

దిల్లీలో రూ.500 నుంచి రూ 2000

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతండటంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మాస్కు ధరించని వారికి గతంలో విధించిన రూ.500 జరిమానాను రూ. 2000లకు పెంచింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను పంపిణీ చేయాలని అన్ని రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్రలో రూ. 200

కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. కేసులు అత్యధికంగా నమోదవుతున్న బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిధిలో మాస్కులు ధరించకపోతే రూ.200 వరకు జరిమానా విధిస్తోంది.  స్థానిక బస్సులు, లోకల్‌ రైళ్లలో ప్రయాణించేవారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు వాడకాన్ని తప్పని సరి చేసే దిశగా అక్కడి  ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఒడిశాలో మూడోసారి తప్పు చేస్తే ఇక అంతే..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు కఠినమైన చర్యలకు దిగింది. మాస్క్‌ ధరించని వారిపై భారీగా జరిమానా విధిస్తోంది. తొలిసారి, రెండో సారి మాస్క్‌ ధరించకపోతే రూ.2వేలు, అదే తప్పు మళ్లీ చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరో వైపు ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి దేశంలోని ఎక్కడి నుంచైనా ఒడిశాకు వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న నివేదిక లేదా టీకా వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని