Top 10 News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 11/06/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top 10 News @ 9 AM

1. వేగంగా వ్యాపించే వైరస్‌ రకాలు టీకాలను ఏమార్చొచ్చు

కరోనా వైరస్‌లో అత్యంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందే రకాలు వస్తే.. అవి టీకా ప్రభావం నుంచి తప్పించుకునే ప్రమాదం ఉందని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ)’ హెచ్చరించింది. కరోనా రెండో ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండగానే సర్వత్రా మూడో ఉద్ధృతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది అప్రమత్తత సంకేతాలను ఇచ్చింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కరోనా కట్టడి నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ ‘ఈటీవీ భారత్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రణాళికలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, పటిష్ఠ ప్రజారోగ్య చర్యలు, ప్రజల్లో అవగాహన కారణంగా కొవిడ్‌ తదుపరి ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

2. కాంగ్రెస్‌కు పెద్దాపరేషన్‌ అవసరం

కాంగ్రెస్‌కు తక్షణమే ‘పెద్దాపరేషన్‌’ చేయాల్సి ఉందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎం.వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. కేవలం వారసత్వంపైనే ఆధారపడలేమని చెప్పారు. రాహుల్‌ గాంధీ సన్నిహితుడు జితిన్‌ ప్రసాద పార్టీకి రాజీనామా చేసి, భాజపాలో చేరిన నేపథ్యంలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. జితిన్‌ రాజీనామా పార్టీ నాయకత్వానికి ఏమైనా హెచ్చరికను పంపించిందా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘‘కాంగ్రెస్‌ పార్టీ కేవలం వారసత్వం ఆధారంగా నడవలేదు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న పోటీతత్వ రాజకీయాలను ఎదుర్కోవాలంటే పార్టీలో తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పుడే ‘మేజర్‌ సర్జరీ’ చేయాల్సి ఉంటుంది. అది వెంటనే జరగాలి. రేపన్నది లేదు’’ అని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

3. అమెరికా వెళ్లేందుకు సన్నద్ధం కండి!

 అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. సోమవారం నుంచి విద్యార్థి వీసా ప్రక్రియను ప్రారంభించనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్‌ వ్యవహారాల మంత్రి డాన్‌ హెఫ్లిన్‌ తెలిపారు. ఈ విషయాన్ని గురువారం ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. పర్యాటక వీసాలైన బి1/బి2 కోసం ఎదురుచూస్తున్న వారు మరి కొంతకాలం వేచి ఉండకతప్పని పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

4. ఇక ఏ డీలర్‌ నుంచైనా గ్యాస్‌

కంపెనీని మార్చకుండా డీలరును ఎంచుకునే సౌలభ్యం వంట గ్యాస్‌ వినియోగదారులకు కలగనుంది. గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ పోర్టబిలిటీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వినియోగదారుడు ఏ డిస్ట్రిబ్యూటర్‌ దగ్గర గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకొని ఉంటే వారి దగ్గరే సిలిండర్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక ముందు వినియోగదారుడు తనకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి బుక్‌ చేసుకొనే వెసులుబాటును కేంద్ర పెట్రోలియం శాఖ అందుబాటులోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తొలుత చండీగఢ్‌, కోయంబత్తూరు, గురుగ్రాం, పుణే, రాంచీ నగరాల్లో అమలు చేయనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ఈ నూతన విధానం లక్ష్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

బంగారంలో మదుపు చేయాలంటే...yes

5. కొవిడ్‌ తగ్గిన వారికి ఒక్క డోసు చాలు

కొవిడ్‌ బారిన పడి తగ్గిన వారికి ఒక్క టీకా డోసే మంచి ఫలితమిస్తోంది. వైరస్‌ బారినపడిన నెల రోజుల తర్వాత ఒక డోసు పొందడం ద్వారా వీరిలో గణనీయంగా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. ఏకంగా మూడింతలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. అదే వైరస్‌ బారినపడని వ్యక్తుల్లో ఒక డోసు పొందిన తర్వాత యాంటీబాడీల వృద్ధి సాధారణంగాఉంది. ఈ అంశంపై హైదరాబాద్‌లోని ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’ వైద్య నిపుణులు పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన పత్రం తాజాగా ప్రఖ్యాత వైద్య పత్రిక ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’లో ప్రచురితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

6. మూడో ముప్పుపై.. ‘పరిశోధన’ వ్యూహం

కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తగ్గినా.. వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. భవిష్యత్తులో మరిన్ని దశలు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. అధిక వ్యాప్తికి కారణమయ్యే ఆందోళనకర వైరస్‌ రకాలను ముందే గుర్తించడానికి అవసరమైన వ్యూహాలు, సామర్థ్యాల అభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, పుణెలలోని పరిశోధన సంస్థలు నగరాల వారీగా క్లస్టర్లుగా ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణతో ఆరంభంలోనే కొత్త వైరస్‌ రకాలను కనుగొనడంతోపాటు, అధిక వ్యాప్తికి కారణమయ్యే వాటిని గుర్తించి ప్రభుత్వాలను అప్రమత్తం చేయనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

7. 3 రాజధానులకు సహకరించండి

‘అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతౌల్యంతో కూడిన అభివృద్ధికి మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చాం.. ఈ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం.. ఈ విషయంలో మాకు సహకరించండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని అమిత్‌ షా నివాసంలో గురువారం రాత్రి ఆయనను ముఖ్యమంత్రి కలుసుకున్నారు. రాత్రి 9.03 గంటలకు అమిత్‌ షా నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. 10.33 గంటలకు బయటకు వచ్చారు. వారి మధ్య సుమారు 90 నిమిషాలు భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారని ముఖ్యమంత్రి కార్యాలయం నోట్‌ విడుదల చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

8. అప్రతిహతంగా ఔషధరంగం

 తెలంగాణలో 2020-21లో ఔషధరంగం అత్యంత ప్రాధాన్యరంగంగా మారింది. కరోనా వేళ ఈ రంగం అప్రతిహత ప్రగతిని సాధించిందని, కరోనా నివారణలో కీలకపాత్ర పోషించిందని ప్రభుత్వ వార్షిక నివేదిక వెల్లడించింది. దీంతో పాటు వైమానిక, ఎలక్ట్రానిక్స్‌, జౌళి, ఆహారశుద్ధి తదితర రంగాల్లో సాధించిన ప్రగతిని వెల్లడించింది. ‘ఔషధరంగంలో తెలంగాణ జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతిని సాధించింది. ప్రాణాధార ఔషధాలైన రెమ్‌డెసివిర్‌, హైడ్రాక్సి క్లోరోక్విన్‌, ఫావిపిరవిర్‌ల ఉత్పత్తిని తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున పెంచి, దేశ, విదేశాలకు ఎగుమతి చేశాయి. హైదరాబాద్‌లో రూపొందించిన మొట్టమొదటి ఆర్‌టీపీసీఆర్‌ కిట్‌ను ఐసీఎంఆర్‌ ఆమోదించింది. ఆ తర్వాత చాలా సంస్థలు పీసీఆర్‌ కిట్లతో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను, ఇతర పరికరాలను ఉత్పత్తి చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

ఆటో ప్రయాణం... తగ్గేను... ప్రమాదం!yes

9. సర్జికల్‌ మాస్కులు మంచివే!

 కరోనా మహమ్మారి కట్టడిలో మాస్కుల సత్తా మరోసారి రుజువైంది. మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు ఒక వ్యక్తి నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లను అడ్డుకోవడంలో సర్జికల్‌ మాస్కులు సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మాస్కుల అంచుల వద్ద కొద్దిపాటి లీకేజీలు ఉన్నప్పటికీ మొత్తంమీద గాల్లోకి విడుదలయ్యే రేణువులు చాలా తక్కువగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి

10. 14న కమలం గూటికి ఈటల

రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాషాయం గూటికి చేరనున్నారు. ఈ నెల 14న ఆయన దిల్లీలో భాజపా సభ్యత్వం తీసుకుంటారని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ మరికొందరు నేతలు భాజపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనకు ముందే ఈటల రాజీనామా చేస్తారని సమాచారం. కొవిడ్‌ పరిస్థితులు, స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకని నేపథ్యంలో   ఈమెయిల్‌ ద్వారా రాజీనామా లేఖ పంపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈటల దిల్లీలో నేరుగా జేపీ నడ్డాను కలిసి కాషాయకండువా కప్పుకొంటారా? లేదా ముందు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుని, అనంతరం నడ్డాను కలుస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సిఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చయండి


 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని