ఉత్తర కొరియాకు వస్తువులు పంపి జైలుపాలయ్యాడు!

తాజా వార్తలు

Published : 04/11/2020 11:27 IST

ఉత్తర కొరియాకు వస్తువులు పంపి జైలుపాలయ్యాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలనలో నలిగిపోతున్న దేశం ఉత్తరకొరియా. ఆయన పాలన, విదేశాలతో వ్యవహరించే తీరు దారుణంగా ఉంటుంది. అందుకే ప్రపంచదేశాలతో ఉత్తరకొరియాకు సంబంధాలు ఉండవు. ఈ క్రమంలోనే పలు దేశాలు ఉత్తర కొరియాకు వస్తువుల ఎగుమతులను నిషేధించాయి. అయితే, కొన్నేళ్ల కిందట సింగపూర్‌కి చెందిన ఓ వ్యక్తి ఉత్తరకొరియాకు రూ.కోట్లు విలువ చేసే లగ్జరీ వస్తువులు ఎగుమతి చేయడంతో.. ఆ నేరం తాజాగా నిరూపితమైంది. దీంతో కోర్టు అతడి సంస్థలకు జరిమానా, అతడికి జైలు శిక్ష విధించింది. సింగపూర్‌లోని సీఎస్‌ఎన్‌ సింగపూర్‌, బీఎస్‌ఎస్‌ గ్లోబల్‌(సిండొక్‌ ట్రేడింగ్‌), గున్నర్‌ సింగపూర్‌(లూరిచ్‌ ఇంటర్నేషనల్‌) అనే మూడు కంపెనీలకు చాంగ్‌ హాక్‌ యెన్‌ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉంటున్నారు. ఆయన తన కంపెనీల ద్వారా పర్‌ఫ్యూమ్స్‌, కాస్మొటిక్స్‌, ఖరీదైన గడియారాలను ఉత్తర కొరియాకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు కోర్టు తాజాగా నిర్థారించింది.

2010 నుంచి 2016 మధ్య మొత్తం 5,80,000 సింగపూర్‌ డాలర్ల (దాదాపు రూ. 3.12కోట్లు) విలువ చేసే వస్తువులను సరఫరా చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. 2017లో ఈ అక్రమ వస్తువుల ఎగుమతి గురించి సింగపూర్‌ ప్రభుత్వానికి తెలిసింది. దీంతో దర్యాప్తు చేసి.. చాంగ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. సీఎస్‌ఎన్‌ కంపెనీకి 1,20,000 సింగపూర్‌ డాలర్లు, సిండొక్‌, లూరిచ్‌ కంపెనీలకు 10వేల సింగపూర్‌ డాలర్ల చొప్పున జరిమానా విధించింది. చాంగ్‌ హాక్‌కు మూడు వారాల జైలు శిక్ష విధించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షల ప్రకారం.. సింగపూర్‌ నుంచి ఉత్తర కొరియాకు వస్తువులు ఎగుమతి చేయడం అక్రమమని కోర్టు పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని