చిప్‌ల కొరత.. యుద్ధం మొదలుకానుందా..!

తాజా వార్తలు

Updated : 29/03/2021 04:14 IST

చిప్‌ల కొరత.. యుద్ధం మొదలుకానుందా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ వస్తువులు ఏది తయారు చేయాలన్నా అందులో సెమీకండక్టర్లు లేదా ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌(చిప్‌) తప్పనిసరి. డివైజ్‌లకు మెదడులా పనిచేసే వీటిని ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారు చేసే సంస్థలు పెద్దసంఖ్యలో వినియోగిస్తుంటాయి. అయితే, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్‌ల కొరత విపరీతంగా పెరిగింది. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి, సరఫరా లేక ఎలక్ట్రానిక్‌ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు పెరుగుతున్నాయని వాణిజ్యరంగ నిపుణులు చెబుతున్నారు.

కొరత ఎందుకు?

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం ఇవ్వడంతో ల్యాప్‌టాప్‌, పీసీల కొనుగోళ్లు పెరిగాయి. అలాగే, విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు చెబుతుండటంతో స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్స్‌.. మరోవైపు టీవీలు, ఏసీలు, అప్‌డేటెడ్‌ మొబైళ్లు, గేమింగ్‌ డివైజ్‌లు ఇలా రకరకాల వస్తువులను భారీగా కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల నుంచి ఇంతలా కొనుగోళ్లు ఉంటాయని చిప్‌ తయారీ సంస్థలు ఊహించలేదు. మరోవైపు ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆర్డర్లు వస్తుండటంతో కంపెనీలన్నీ వాటిని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనా.. చిప్‌ కంపెనీలు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నాయి.

ప్రపంచంలో చిప్‌లను తయారు చేసే రెండు భారీ కంపెనీలు ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఒకటి తైవాన్‌ సెమీకండక్టర్‌ మ్యానుఫాక్చరింగ్‌ కో(టీఎస్‌ఎమ్‌సీ) కాగా.. రెండోది శాం‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కో. ఈ రెండు సంస్థలు కూడా లాక్‌డౌన్‌ సమయంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల డిమాండ్‌ను ఊహించలేకపోయాయి. ఫలితంగా ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారంలో ఈ ఏడాది 61బిలియన్‌ డాలర్లు (రూ.4.42లక్షల కోట్లు) వ్యాపారం దెబ్బతినే అవకాశముందని నిపుణులు అంచనా వేశారు. అలాగే లక్షలాది వాహనాల ఉత్పత్తి ఆలస్యమయ్యే అవకాశముందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత కొరత రావడం లేదా వస్తువుల ధరలు పెరగడం ఖాయమంటున్నారు.

ఏం చేయబోతున్నారు?

ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా చిప్‌లను తయారు చేసేందుకు టీఎస్‌ఎమ్‌సీ, శాంసంగ్‌ భారీగా ఖర్చు చేయబోతున్నాయి. టీఎస్‌ఎమ్‌సీ 2021లో 28 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయబోతుండగా.. పదేళ్ల ప్రాజెక్టులో భాగంగా శాం‌సంగ్‌ 116 బిలియన్‌ డాలర్లు వెచ్చించనుంది. అన్ని రకాల వస్తువులను తయారు చేసే చైనాను అమెరికా గత ప్రభుత్వం చిప్‌ల తయారీ విషయంలో పలు విధాలుగా అడ్డుకుంది. అయినా.. చైనా వాటి తయారీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల చైనాకు చెందిన సెమీకండక్టర్‌ మ్యాను‌ఫాక్చరింగ్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ 2.35 బిలియన్‌ డాలర్లతో ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. చిప్‌ల ఉత్పత్తి 2022లో మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు షెన్‌జెన్‌ నగర ప్రభుత్వం నిధులు సమకూర్చడం గమనార్హం. అమెరికా ప్రభుత్వం చిప్‌ల కొరతపై సమీక్ష నిర్వహించడంతోపాటు చిప్‌ల తయారీ సంస్థలను తమ దేశంలో ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఇప్పటికే టీఎస్‌ఎంసీ సంస్థ ఆరిజోనాలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేలా యూఎస్‌ ప్రభుత్వం 12 బిలియన్‌ డాలర్లతో ఒక ప్రాతిపాదన తీసుకొచ్చింది. అలాగే టెక్సాస్‌లో శాంసంగ్‌ కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే 17 బిలియన్‌ డాలర్ల పన్ను ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతోంది. ఇక యూరోపియన్‌ యూనియన్‌ ఏకంగా యూరప్‌లో ఒక సెమీకండక్టర్‌ తయారు చేసే ఫ్యాక్టరీని టీఎస్‌ఎంసీ, శాంసంగ్‌ సాయంతో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రపంచానికి అవసరమ్యే చిప్‌లను అందించే శక్తిని సంపాదించుకోవడం కోసం ఆయా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దీంతో చిప్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫ్యాక్టరీ పెట్టాలంటే భారీ ఖర్చు

చిప్‌ల తయారీ వ్యాపారం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే రూ. లక్షల కోట్లు ఖర్చవుతుంది. భారీ మొత్తంలో చిప్‌లను కచ్చితత్వంతో ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి మొత్తం తిరిగి రావాలన్నా.. మార్కెట్‌లో సరిపడా సరఫరా జరగాలన్నా చిప్‌లను విరామం లేకుండా 24/7 తయారు చేయాల్సి ఉంటుంది. తయారీలో పొరపాటు జరిగితే.. లక్షల చిప్‌లు వృథా అవడమే కాదు.. భారీగా నష్టం వాటిల్లుతుంది. అలాగే వీటిని తయారు చేయాలంటే నీరు, విద్యుత్‌ నిరంతరం సరఫరా కావాలి. ఇందుకోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే, చిప్‌ తయారీ సంస్థల ఏర్పాటు చేయడానికి సంస్థలు వెనకడుగు వేస్తుంటాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని