కసరత్తు@ చీరకట్టు

తాజా వార్తలు

Published : 17/06/2021 21:25 IST

కసరత్తు@ చీరకట్టు


 చీరకట్టులో వైరల్‌ అవుతున్న వైద్యురాలి వ్యాయమాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చీర కట్టుకుని ఇంటి పనులు చకచకా చేసేస్తాం... ఇక బయటపనులు, ఫంక్షన్ల మాటకొస్తే చీర ధరించడానికే మగువలు మక్కువ  చూపిస్తారు. అదే చీరతో కసరత్తులు చేయమంటే మాత్రం వాటి స్థానంలో స్పోర్ట్స్‌ అవుట్‌ఫిట్‌పైపే మొగ్గు చూపుతుంటారు.. ఎందుకంటే వ్యాయామాలు, యోగాకి అనువుగా ఉంటుందన్నది వారి మాట. అయితే ఆమాటను తుడిచిపెట్టేస్తోంది పుణె నగరానికి చెందిన ఓ వైద్యురాలు.. ఆమే డాక్టర్‌ శర్వారీ ఇనామ్‌దార్.. చీరకట్టులో ఈమె చేసిన వ్యాయామాలు ఇప్పుడునెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. మరి మహిళలు శరీరాన్ని ఎందుకు ఫిట్‌గా ఉంచుకోవాలి? మీరోజూ వారీ జీవితంలో ఫిట్‌నెస్‌కు ఎందుకు సమయం ఇవ్వాలి, వ్యాయామాలు చేసేటప్పుడు చీర ఎందుకు ధరించాలనిపించింది అన్న ప్రశ్నలకు ఆమె ఏమని బదులిస్తారంటే.. 

అవరోధంగా భావించకూడదు..
గత ఐదేళ్లుగా నేను ఫిట్‌నెస్ ఫాలో అవుతూ వస్తున్నా. పుష్‌-అప్స్‌, పుల్‌-అప్స్‌, వెయిట్‌ ట్రెయినింగ్‌.. ఇలా.. ఇవన్నీ చీరలో చేస్తుంటా.  వాస్తవానికి ప్రతీరోజు మహిళలు చీర ధరించరు. అందరూ రోజూ ధరించాలన్నా.. అది అనువుగా ఉండదు కూడా. అలాగే ఏ స్ర్తీ అయినా చీరలో తనని తాను చూసుకోవటానికి అవరోధంగా భావించకూడదు. ఇక వ్యాయామాల విషయానికి వస్తే.. కండలు, ఎముకల దృఢత్వానికి వెయిట్‌ ట్రైనింగ్‌ అనేది ముఖ్యం. బరువులు ఎత్తే క్రమంలో మనం పౌష్టికాహారం తీసుకుంటాం. అదేవిధంగా శరీరంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం. కాబట్టి శారీరకంగా, మానసికంగానూ దృఢంగా, రోజంతా ఉల్లాసంగా ఉంటాం. ఆ ప్రభావంతో కుటుంబాన్ని చక్కగా చూసుకోగలం. ఆనందంగా సమయాన్ని గడపగలం.

వెయిట్‌ ట్రైనింగ్‌ కూడా అవసరమే..
చాలా మంది మహిళలు.. కేవలం యోగా, డ్యాన్స్‌ ఎక్సర్‌సైజెస్‌తో సరిపెట్టుకుంటారు. అలా కాకుండా బరువులు ఎత్తడం కూడా ఒక భాగవ్వాలి. ఇలా చేయడం ద్వారా యవ్వనంగా కనిపించడమే కాకుండా దృఢంగానూ ఉంటాం. అంతేకాదు.. ఇది మీ శరీరంలో నీరసానికి దారి తీయదన్న విషయాన్ని గుర్తించుకోవాలి.

ఆ సమయంలో ఈ అపోహలు వీడండి..
కండరాలు అనేవి మిమ్మల్ని చురుకుగా ఉంచుతాయి. బాడీబిల్డింగ్ లో భాగంగా మహిళలను వేదికపై చూసిన తర్వాత దురభిప్రాయం కలుగుతుంది చాలామందికి. అయితే అది కేవలం క్రీడగానే భావించాలి. బరువులు ఎత్తినంత మాత్రాన మీరు బాడీబిల్డర్ లాగా కనిపించరు. బరువులు ఎత్తితే కేవలం మీ శరీరం దృఢమవ్వడమే కాకుండా బిగువుగా, యవ్వనంగా కనిపిస్తారు. పుష్-అప్స్, పుల్-అప్స్ అనేవి పురుష వ్యాయామాలు. కాబట్టి ప్రధానంగా అవి చేసే ముందు నిపుణుల కచ్చితమైన పర్యవేక్షణ అనేది అవసరం. అలా సరైన మార్గదర్శకత్వంలో చేసినప్పుడే మీరు ఎదుగుతారు. మిమల్ని మీరు నిరూపించుకునే క్రమంలో వేటిని అవరోధాలుగా భావించకండి.

నా భర్తే స్ఫూర్తి..
ముఖ్యంగా ప్రతీ విషయంలో మద్దతిచ్చే కుటుంబమే నా బలం. నా భర్త సైతం నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. నాలో స్ఫూర్తిని రేకెత్తిస్తారు. పిల్లలు వారి పనులు వారు చేసుకోవడమే కాక.. వంటింట్లోనూ సాయపడతారు.. కుటుంబం ప్రోత్సాహమిస్తే.. ఏ స్ర్తీ అయినా తప్పక విజయం సాధించగలదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని