విహారానికి సిద్ధమంటున్నారు

తాజా వార్తలు

Updated : 22/09/2020 21:41 IST

విహారానికి సిద్ధమంటున్నారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఉన్న ఊరిలో కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేకుండాపోయాయి. ఇక ఊరు దాటి వెళ్లడంపై దాదాపు నిషేధమే ఉండేది. ప్రస్తుతం ప్రయాణాల్లో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు విహారయాత్రలకు వెళ్లాలని తెగ ఆరాటపడుతున్నారట. ఈ విషయాన్ని గూగుల్‌ సంస్థ వెల్లడించింది. 

కొవిడ్‌ కారణంగా ఇంటి గడప దాటని ప్రజలు ఇప్పుడు పర్యటక ప్రాంతాలను సందర్శించాలని భావిస్తున్నట్లు గూగుల్‌, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఇటీవల గూగుల్‌లో నెటిజన్లు శోధించిన టాప్‌ 100 ప్రశ్నల్లో 45 శాతం పర్యటనలకు సంబంధించినవే ఉన్నాయట. నెటిజన్లు అడిగిన ప్రశ్నలు, ట్రెండ్స్‌ ఆధారంగా గూగుల్‌ నివేదిక రూపొందించింది. ఇందులో 31 శాతం మంది కరోనా సోకదు అనే నమ్మకం కలిగిన వెంటనే బ్యాగు సర్దేసుకొని విహారయాత్రకు వెళ్లాలని ఫిక్సాయ్యారట.

జూన్‌ నెలలో నెటిజన్లు గూగుల్‌ను ‘మళ్లీ మేం ఎప్పుడు పర్యటనలు చేయొచ్చు?’, ‘అంతర్జాతీయ పర్యటనలు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయి?’, ‘మళ్లీ సురక్షితంగా పర్యటన ఎప్పుడు చేయగలుగుతాం?’వంటి ప్రశ్నలు అడిగారట. ఆగస్టులో అయితే ఏకంగా ‘ఇప్పుడు ఏయే పర్యటక ప్రాంతాలకు వెళ్లొచ్చు? ఎప్పుడు వెళ్లొచ్చు? అని గూగుల్‌లో వెతికారట. ఎక్కువగా బీచ్‌లు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారని, ఇటలీ.. నెదర్లాండ్‌లో పర్యటన చేయాలని అత్యధిక మంది భావిస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. 

ప్రజలకు విహార యాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు రావడంతో టూరిజం రంగానికి పునర్‌వైభవం తెచ్చేందుకు గూగుల్‌ తన వంతు కృషి చేయనుంది. ఈ రంగంలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించే విధంగా యూరప్‌, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రభుత్వాలతో, వ్యాపారవేత్తలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని