ఏపీలో మరోసారి ‘తెలుగు’ వివాదం

తాజా వార్తలు

Published : 10/07/2021 19:24 IST

ఏపీలో మరోసారి ‘తెలుగు’ వివాదం

అమరావతి: తెలుగు అకాడమి పేరులో మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భాషాభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గతంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా.. తెలుగు అకాడమీని.. తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మారుస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు మరోసారి స్పందించాయి.

పేరు మార్చి ఏం సాధిస్తారు : పవన్‌

రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమి పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. తెలుగు భాష అభివృద్ధి, వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడమి అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారని ఓ ప్రకటనలో ఆరోపించారు. తెలుగు- సంస్కృత అకాడమి అని ఎందుకింత హడావుడిగా పేరు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడమి బాధ్యులు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేరు మార్చడం ద్వారా సాధించే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు తెలుగు అకాడమి పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటూ వచ్చాయని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సైతం ఈ పుస్తకాలనే ఎంచుకొంటారన్నారు. తెలుగు భాషకు సంబంధించి పలు నిఘంటువులు, వృత్తి పదకోశాలు ఈ అకాడమి ద్వారా వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అకాడమి ద్వారా భాషాభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సింది పోయి పేరు మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా? అని నిలదీశారు.

తెలుగు అకాడమికి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడంతో అక్కడి కార్యకలాపాలు కొంతకాలం నుంచి నిస్తేజంగా ఉన్నాయని విమర్శించారు. సంస్కృత భాష అభివృద్ధి కోసమే పేరు మార్పు అనుకొంటే ప్రత్యేకంగా సంస్కృత అకాడమి ఏర్పాటు చేయవచ్చని సూచించారు. దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్కృత అకాడమి లాంటిది ఇక్కడ కూడా ప్రారంభించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాడమి పేరు మార్పు నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు. తెలుగు అకాడమి అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలుగు భాషాభిమానులు, భాషా శాస్త్రవేత్తలు ముందుకు రావాలని పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు.

తెలుగును అంతం చేయడానికే పుట్టారా?: మండలి

తెలుగు అకాడమి పేరు మార్చడం విచారకరమని మాజీ ఉప సభాపతి, తెదేపా నేత మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు అకాడమికి రావాల్సిన నిధులు రప్పించలేకపోయారని, అకాడమి ఏర్పాటు చేసినా... ఏ పనులు చేయలేదని విమర్శించారు.

జగన్‌ ఇప్పటికే తెలుగు మాధ్యమానికి మంగళం పాడారని, తెలుగు అకాడమిలో సంస్కృతాన్ని కలపడం భావ్యం కాదన్నారు. కావాలంటే సంస్కృతానికి ప్రత్యేక అకాడమి ఏర్పాటు చేయాలన్నారు. సీఎం జగన్‌ తెలుగు అకాడమి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిది కాదని, మాతృభాషను గౌరవించుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. తెలుగును అంతం చేయడానికే పుట్టినట్టు వ్యవహరించడం విచారకరమని వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని