మమతా బెనర్జీ వెడ్స్‌ సోషలిజం..!

తాజా వార్తలు

Published : 11/06/2021 06:02 IST

మమతా బెనర్జీ వెడ్స్‌ సోషలిజం..!

వైరల్‌గా మారిన తమిళ జంట పెళ్లి శుభలేఖ

చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ యువ జంట పెళ్లి శుభలేఖ తాజాగా నెట్టింట సంచలనంగా మారింది. వధూవరుల పేర్లు పి.మమతా బెనర్జీ, ఏఎం సోషలిజం కావడమే అందుకు కారణం.  అయితే ఈ శుభలేఖ నిజమైందేనా లేదా ఎవరైనా అలా సృష్టించారా.. అనే అంశంపై నెటిజన్లలో చర్చ మొదలైంది. అందులో వరుడి సోదరుల పేర్లు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం అని ఉండటం గమనార్హం. అయితే ఆ సందేహానికి తెర దించుతూ.. వరుడి తండ్రి లెనిన్‌ మోహన్‌ ఆ శుభలేఖ వాస్తవమేనని తేల్చారు. 

సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లెనిన్‌ మోహన్‌.. తన కుమారులు సహా వధువు పేర్ల వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. కమ్యూనిజంపై అభిమానంతోనే కుమారులకు అలాంటి పేర్లు పెట్టినట్టు ఆయన తెలిపారు. తన స్వగ్రామం కత్తూరులో ఎక్కువ మంది కమ్యూనిజాన్ని అభిమానిస్తారని.. అందుకే అక్కడ రష్యా, మాస్కో, జెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మణి లాంటి పేర్లు సాధారణంగా వినిపిస్తాయని వివరించారు.  వధువు కూడా తమ బంధువేనని, ఆమె తాతయ్య కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి అని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొంది అమె పేరునే మనవరాలికి పెట్టినట్టు పేర్కొన్నారు. తమ భావజాలాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడానికి తన మనవడికి మార్క్సిజం అని పేరు పెట్టినట్టు తెలిపారు. భవిష్యత్తులో తమ ఇంట్లో అమ్మాయి పుడితే ఆమెకు క్యుబాయిజం అని నామకరణం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. 

కొవిడ్‌ నేపథ్యంలో పెళ్లి శుభలేఖను సోమవారం దినపత్రికలో ప్రచురించడంతో అందరి దృష్టినీ అది ఆకర్షించిందని మోహన్‌ తెలిపారు. నిజమా.. కాదా అని నిర్ధారించుకునేందుకు మూడు రోజులుగా సన్నిహితులు, మీడియా నుంచి 300కి పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు చెప్పారు. విభిన్నమైన పేర్లు పెట్టుకున్నందుకు అందరూ అభినందిస్తుండటంతో తన కుమారులు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని