టార్గెట్‌ 2153: 180 ఏళ్లు బతకాలని..!

తాజా వార్తలు

Published : 07/03/2021 11:14 IST

టార్గెట్‌ 2153: 180 ఏళ్లు బతకాలని..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఆధునిక జీవన విధానంలో మనిషి ఆయుష్షు నానాటికి తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నిండు నూరేళ్లు జీవించిన మనుషులు.. ఇప్పుడు 70 ఏళ్లు బతికితే అదే గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాంటిది.. అమెరికాకు చెందిన 48 ఏళ్ల డేవ్‌ ఆస్ప్రే అనే ఓ ధనవంతుడు ఏకంగా 180ఏళ్లు బతకాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో క్రైయోథెరపీ, ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ వంటి పద్ధతులను పాటిస్తున్నాడు. తన జీవగడియారాన్ని వెనక్కి తిప్పి తన శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగుపర్చుకుంటున్నాడు. దీన్నే ‘బయోహ్యాకింగ్‌’ అంటారని, దీని ద్వారా తాను కచ్చితంగా 2153 వరకు జీవించి ఉంటానని డేవ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఎముక మజ్జను తొలగించి..

ఎక్కువ కాలం జీవించి ఉండటం కోసం డేవ్‌ వైద్యపరంగా యాంటి ఏజింగ్‌ చికిత్సలు తీసుకోవడంతోపాటు.. తన అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకున్నాడు. మితంగా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం చేస్తున్నాడు. ఆహారం, నిద్రపై పూర్తి నియంత్రణ సాధించాడు. ఇటీవల తన ఎముక మజ్జను తొలగించి.. తన మూల కణాలను తిరిగి శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ‘బాల్యంలో శరీరంలో మూలకణాలు సమృద్ధిగా ఉంటాయి. అదే వయసు పెరిగేకొద్ది మూలకణాలు నశిస్తుంటాయి. అందుకే వీటిని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం ద్వారా ఆరోగ్యంగా.. నిత్యయవ్వనంగా ఉండొచ్చు’ అని డేవ్‌ వెల్లడించాడు. ఈ వైద్య చికిత్సల కోసం ఇప్పటి వరకు డేవ్‌ 10లక్షల డాలర్లు (దాదాపు రూ.7.28కోట్లు) వెచ్చించాడట.

ఈ పద్ధతులు పాటిస్తే..

క్రైయోథెరపీ లేదా కోల్డ్‌ థెరఫీలో అత్యల్ప ఉష్ణోగ్రతను ఉపయోగించి కణజాలాలకు అయ్యే గాయాల్ని తగ్గించొచ్చని డేవ్‌ అంటున్నాడు. అందుకే గత పదేళ్లుగా డేవ్‌ చల్లటి నీళ్లతోనే స్నానం చేస్తున్నాడట. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ను కూడా క్రమం తప్పకుండా పాటిస్తున్నాడు. అంటే కనీసం 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలి. ఆ తర్వాత ఆహారం తీసుకొని మరో 16 గంటలు ఏమీ తనకూడదు. ఈ ఫాస్టింగ్‌లో షెడ్యూల్స్‌ రకరకాలుగా ఉంటాయి. తినకుండా ఉండే సమయంలో శరీరంలో ఏవైనా లోపాలు, సమస్యలు ఉంటే శరీరం తనంతట తానే నయం చేసుకుంటుందని డేవ్‌ పేర్కొన్నాడు. తాను పాటిస్తున్న పద్ధతులను 40 ఏళ్లలోపు వారు పాటిస్తే.. వందేళ్లు వచ్చే వరకు సంతోషంగా, యాక్టివ్‌గా బతకగలరని తెలిపాడు. త్వరలో ఈ పద్ధతులన్నీ బాగా ప్రాచూర్యం పొందుతాయంటున్నాడు. మరి వీటిలో ఎంత వరకు నిజముందో వైద్యులే బయటపెట్టాలి.

ఇవీ చదవండి..

87 ఏళ్ల వైద్యుడు.. ఎందరికో ఆదర్శప్రాయుడు!

హస్తరేఖల్ని మార్చేస్తున్న థాయ్‌ కంపెనీ!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని