కొబ్బరికాయలు.. ఆకులే కాలేజీ ఫీజులు! 

తాజా వార్తలు

Updated : 16/11/2020 01:18 IST

కొబ్బరికాయలు.. ఆకులే కాలేజీ ఫీజులు! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పూర్వం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు పండ్లు, ఫలహారాలు, ఇతర వస్తువులను గురుదక్షిణగా ఇచ్చేవారు. ఆ కాలంలో నగదు లావాదేవీలు లేవు కావు కాబట్టి.. విద్యార్థులు తమకు తోచిన వస్తువుల్ని గురుభక్తితో సమర్పించే వారు. కానీ ఇప్పటి పాఠశాలలు, కళాశాలలు రూ.లక్షలు ఫీజుగా తీసుకుంటున్నాయి. కరోనా కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా.. ఫీజు కడితేనే పాఠాలు చెబుతామని తెగేసి చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కానీ, ఇండోనేషియాలోని ఓ కాలేజీ మాత్రం మాకు డబ్బులొద్దు.. కొబ్బరికాయలు, చెట్ల ఆకుల్నే ఫీజుగా ఇవ్వండి చాలు అంటోంది. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే వివరంగా చదవండి. 

బాలిలోని ‘వీనస్‌ వన్‌ టూరిజం అకాడమీ’ పర్యటకరంగానికి సంబంధించిన కోర్సును అందిస్తోంది. ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలో పర్యటకరంగానిది ముఖ్య పాత్ర. అందుకే ఈ రంగంలో ఉద్యోగాల కోసం చాలా మంది ఈ కోర్సులు చేస్తుంటారు. అయితే, కరోనా కారణంగా ఇటీవల ఆ దేశంలోని ప్రజలు ఆర్థిక కష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కుటుంబాలు ఆదాయం కోల్పోయి.. తమ పిల్లల చదువుల నిమిత్తం ఫీజు కట్టలేని పరిస్థితులకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను గమనించిన వీనస్‌ వన్‌ కాలేజీ.. వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థులు బోధన ఫీజు కింద కొబ్బరికాయలు, ఆయుర్వేదంలో ఉపయోగపడే గోటు కొలా, మొరింగా చెట్ల ఆకులను తెచ్చివ్వాలని కోరింది. నిజానికి కొబ్బరికాయల్ని గత మార్చి నుంచే స్వీకరిస్తోంది. కానీ, తాజాగా కొబ్బరికాయలతోపాటు ఆకుల్నీ ఫీజుగా తీసుకోవడం విశేషం. 

వీనస్‌ వన్‌ ఇటీవల కాలేజీ ప్రాంగణంలోనే వర్జిన్‌ కొకొనట్‌ ఆయిల్‌ (వీసీఓ)ను ఉత్పత్తి చేయడం కోసం ఓ పరిశ్రమని ఏర్పాటు చేసింది. ఈ ఆయుర్వేద నూనెతో పాటూ సబ్బుల వంటివీ తయారు చేస్తోంది. వీటిని తయారు చేయాలంటే కొబ్బరికాయలు, ఔషధ చెట్ల ఆకులు కావాలి. అందుకే వీటినే విద్యార్థులతో తెప్పించుకుంటూ ఫీజు కింద జమ చేసుకుంటోంది. కాలేజీ ఉత్పత్తి చేసిన వస్తువుల్ని విద్యార్థులతోనే విక్రయించి వారిలోని వ్యాపార నైపుణ్యాల్ని వెలికితీసే ప్రయత్నం చేస్తామని యాజమాన్యం అంటోంది. అంతేకాదు, ఈ పద్ధతి ద్వారా విద్యార్థులకు తమ చుట్టూ ఉండే సహజ వనరులను ఎలా వినియోగించుకోవచ్చో తెలుస్తుందని చెబుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని