కొవిడ్‌తో ఫైట్‌.. ఇవే మన ఆయుధాలు!

తాజా వార్తలు

Published : 13/05/2021 01:42 IST

కొవిడ్‌తో ఫైట్‌.. ఇవే మన ఆయుధాలు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అన్నిచోట్లా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎందుకింతగా ఉందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే వైరస్ నియంత్రణకు విధాన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి..? ఎలాంటి జాగ్రత్తలతో వైరస్‌పై విజయం సాధించగలం..? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు పలు విభాగాలకు చెందిన నిపుణులు. ఎబోలా కట్టడిలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ రణు ధిల్లన్, పేషెంట్ నో హౌ డాట్‌కామ్‌ వ్యవస్థాపకుడు దేవభక్తుని శ్రీకృష్ణ, మధ్యప్రదేశ్‌లోని గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యరంగ సేవలు అందిస్తున్న అదృశ్ భద్ర ‘ఈటీవీ’ నిర్వహించిన ప్రత్యేక చర్చలో పాల్గొని కరోనా కట్టడి చర్యల నుంచి మాస్క్‌ల వినియోగం వరకు పలు విషయాలను పంచుకున్నారు.

కరోనాతో పోరాడుతున్న భారత ప్రభుత్వానికి మీరిచ్చే సలహా ఏంటి?

డా.రణు ధిల్లన్‌: భారత్‌లో కరోనా వ్యాప్తి మహా విపత్తుగా మారింది. కుటుంబాల్లో ఒకరికి కరోనా సోకితే మిగిలిన వారికీ అంటుకుంటోంది. ఈ తరుణంలో ప్రభుత్వం వైద్య సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. వైరస్‌ వ్యాప్తిని తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. ర్యాపిడ్‌ టెస్టులు పెంచాలి. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వాళ్లకు వైద్య సదుపాయాలు అందించాలి.

ప్రస్తుతం భారత్‌లో వేరు వేరు రాష్ట్రాల మధ్య పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే ఏం చేయాలి?

డా.రణు ధిల్లన్‌: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. స్థానిక వ్యాప్తిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే జన సమూహాల్లో ఉన్నపుడు మాస్క్‌ ధరిచడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్టు చేయించుకోవాలి. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఐసోలేషన్‌లో ఉండాలి. క్షేత్రస్థాయిలో ఈ పద్ధతులు పాటించేలా ప్రభుత్వం చూసుకోవాలి.

మధ్య ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

అదృశ్ భద్ర: కరోనా సెకండ్‌ వేవ్‌లో గ్రామాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రతి మూడు ఇళ్లల్లో రెండు ఇళ్ల్లలోని వాళ్లు కరోనాతో బాధపడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థలు పటిష్ఠంగా లేకపోవడం వల్ల పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. దాంతో గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు నామమాత్రంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎన్నికల ర్యాలీలు జరగడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిపోయింది. పల్లెల్లో ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవడటానికి ఆసక్తి చూపడం లేదు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆసుపత్రికి వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రజల్లో ఆ ఆపోహను తొలగించాలి. కరోనా టెస్టుల సంఖ్య పెంచి, ఇంటింటికీ వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి. 

హైఫై మాస్క్‌ అంటే ఏంటి? దాని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి?

దేవభక్తుని శ్రీకృష్ణ: హై ఫిల్టరేషన్‌, హైఫిట్‌ మాస్క్‌లను హైఫై మాస్కులు అని పిలుస్తారు. కరోనా గాలి ద్వారా ప్రయాణిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో కన్నా ఇండోర్‌లలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హై ఫిల్టరేషన్‌, హైఫిట్‌ మాస్క్‌లను వాడటం వల్ల వైరస్‌ సోకకుండా ఉంటుంది. ఎన్‌95, కొరియా మాస్క్‌ కేఎఫ్‌ 94, ఐరోపా మాస్క్‌ ఎఫ్‌ఎఫ్‌పి-2 వంటి మాస్క్‌లు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఏ మాస్క్‌ ఎక్కువ రక్షణ ఇస్తుంది...?

దేవభక్తుని శ్రీకృష్ణ: ఎన్‌95 మాస్క్‌ ఎక్కువ రక్షణ ఇస్తుంది. ఎన్‌95 మాస్కులు అమెరికా సీడీసీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషన్‌ సేఫ్టీ ప్రమాణాలతో తయారు చేశారు. వాటి నమూనా, తయారీ, నాణ్యతా ప్రమాణాల తనఖీ అంతా పక్కాగా ఉంటుంది. ఎన్‌95 మాస్క్‌ 95 శాతం గాలిని శుద్ధి చేసేలా తయారు చేశారు. బట్ట మాస్క్‌లో 20-50 శాతం మాత్రమే గాలి శుద్ధి జరుగుతుంది.

డబుల్ మాస్క్‌ ధరిచండం సురక్షితమేనా?

దేవభక్తుని శ్రీకృష్ణ: ఎన్‌95 అందుబాటులో లేనప్పుడు డబుల్‌ మాస్క్‌ పెట్టుకోవాలి. డబుల్‌ మాస్కులు ధరిస్తే 75 శాతం మాత్రమే వైరస్‌ నుంచి రక్షణ ఉంటుంది. సర్జికల్‌ మాస్క్‌ మీద క్లాత్‌ మాస్క్‌ పెట్టుకుంటే శ్వాశ తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఎన్‌95 మాస్క్‌ పెట్టుకోవడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎన్‌95 మాస్క్‌తో పోలిస్తే డబుల్ మాస్క్‌ రక్షణ తక్కువే.

భారత్‌లో కరోనా పరీక్షల గురించి మీరిచ్చే సలహా ఏంటి?

డా.రణు ధిల్లన్‌: కరోనా పరీక్షలకు కొన్ని విధానాలున్నాయి. ప్రతి పరీక్షా విధానంలోనూ సమస్యలు వస్తుంటాయి. కరోనా లక్షణాలు గుర్తించడంలో ఆర్‌టీపీసీఆర్‌ బాగా పనిచేస్తోంది. అందుకే ఆ విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు. ప్రస్తుతం కొందరిలో కరోనా సోకినా ఆ లక్షణాలు కనిపించడం లేదు. దాని వల్ల వైరస్‌ ఇతరలకు వ్యాప్తి చెందుతోంది. రాపిడ్‌ టెస్టుల ద్వారా వేగంగా ఫలితాలను తెలుసుకోవచ్చు. వైరస్‌ లోడ్‌ తక్కువగా ఉంటే ర్యాపిడ్‌ టెస్టుల్లో ఫాల్స్‌ నెగిటివ్‌ వస్తోంది. రెండు మూడు రోజులు గడిచిన తర్వాత మళ్లీ టెస్టు చేస్తే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. క్షేత్ర స్థాయిలో ఆశావర్కర్లు, స్వచ్చంధ సంస్థలు, స్థానిక యంత్రాంగాలు ర్యాపిడ్‌ టెస్టులు చేసేలా శిక్షణ ఇవ్వాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని