పే..ద్ద ఎలుగుబంటితో ఎన్నికల ప్రచారం!

తాజా వార్తలు

Published : 07/05/2021 01:50 IST

పే..ద్ద ఎలుగుబంటితో ఎన్నికల ప్రచారం!

కాలిఫోర్నియా: ‘నేను సింహం లాంటోడిని.. నా ముందు మీ ఆటలు సాగవ్‌’.. ‘నేను పెద్దపులిని.. నాతో పెట్టుకోవద్దు’ వంటి సినిమా డైలాగులు మన రాజకీయ నేతలు తరచూ వాడేవే. తమను తాము పులితోనో, సింహంతోనో పోల్చుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకోవడం ఎప్పుడూ జరిగేదే. కానీ, ఇక్కడ కనిపిస్తున్న ఈయనగారి వరుసే వేరు! తనను తాను ‘బీస్ట్‌’గా అభివర్ణించుకోవడమే కాదు.. ఏకంగా ప్రచారానికి ఓ పే..ద్ద ఎలుగుబంటినే రంగంలోకి దించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్‌ పదవికి పోటీపడుతున్నారు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అభ్యర్థి జాన్‌ కాక్స్‌. తనను తాను బీస్ట్‌గా పేర్కొంటు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. అందుకోసం ఓ బస్‌ యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా ఇటీవల కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో నిర్వహించిన ఓ విలేకర్ల సమావేశంలో ఏకంగా తన వెంట ఓ ఎలుగుబంటిని తీసుకొచ్చారు. సుమారు 500 కేజీల బరువుండే ఈ ఎలుగు ప్రెస్‌మీట్‌ జరుగుతున్నంతసేపూ అక్కడే తిరుగుతూ తెగ సందడి చేసింది. పలు హాలీవుడ్‌ సినిమాలు, టీవీ సిరీసుల్లో కనిపించిన ఈ ఎలుగుకు తర్ఫీదు ఇచ్చిన వ్యక్తి కూడా అక్కడే ఉండడంతో అది ఎలాంటి హాని తలపెట్టలేదు. ప్రచారం సందర్భంగా ట్యాక్సులు తగ్గిస్తా, కాలిఫోర్నియాను అభివృద్ధి చేస్తా అంటూ కాక్స్‌ ఎన్ని హామీలు ఇచ్చినా ఈ ఎలుగుబంటి గురించే ప్రధానంగా అన్ని పత్రికలు వార్తలు ఇవ్వడం గమనార్హం. అనుకున్నదానికంటే ప్రచారం బాగానే లభించినా.. పెటా వంటి సంస్థల నుంచి మాత్రం కాక్స్‌కు విమర్శలు తప్పలేదు. జంతువులను  రాజకీయాలకు వాడుకోవడమేంటంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్న గవిన్‌ న్యూసమ్‌ను రీకాల్‌ చేసి, కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతకుముందే ఎన్నికకు సంబంధించి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనున్నారు. అందులో ఆయన ప్రజల విశ్వాసం కోల్పోతే ఈ ఎన్నికలు జరగనున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని