Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM

1. తెలంగాణలోనూ ఆయుష్మాన్‌ భారత్‌ అమలు

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. ఇకపై తెలంగాణలోనూ అమలు కానుంది. ఈ మేరకు నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. నిబంధనల మేరకు వైద్య సేవలు అందించాలని సీఏం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుష్మాన్‌ భారత్ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

2. రఘురామ వ్యాఖ్యల వెనక కుట్ర: సజ్జల

ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  రఘురామను తెదేపా పావుగా వాడుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రఘురామపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసిందన్నారు. ఆయన విషయంలో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై రాజద్రోహం కేసు పెట్టడం తానెప్పుడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను సజ్జల కొట్టిపడేశారు. 

3. TS Corona: రికవరీ రేటు 90.48%: డీహెచ్‌

రాష్ట్రంలో గత 2 వారాలుగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. పాజిటివిటీ రేటు కూడా అనూహ్యంగా తగ్గిందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కొవిడ్‌ కట్టడికి తెలంగాణ మార్గనిర్దేశంగా మారిందన్నారు. గ్రామాల్లోనూ కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని, ఇంటింటి సర్వేద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నామన్నారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.

TS: కొత్తగా 3,982 కరోనా కేసులు

4. AP Corona: ఆంధ్రలో 99 మంది మృతి

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేలపైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,253 నమూనాలను పరీక్షించగా 21,320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372 కి చేరింది. తాజాగా 99 మంది మహమ్మారి కారణంగా మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 9,580కి పెరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.  తాజాగా 21,274 మంది కరోనా నుంచి కోలుకున్నారని,  రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,81,40,307 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

5. Tauktae: గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ‘అల’జడి 

‘తౌక్టే’ తుపాను ధాటికి దేశ పశ్చిమ తీరం వణుకుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు పలు తీర రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. తౌక్టే ఉద్ధృతికి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ముంబయి తీరం వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసి గేట్‌వే ఆఫ్‌ ఇండియాను బలంగా ఢీకొట్టాయి. ఆ భయానక వీడియోలను కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. తౌక్టే తుపాను ముంబయి సమీపానికి వచ్చినప్పుడు గాలుల వేగం గంటలకు 114 కిలోమీటర్లుగా ఉంది. ఆ సమయంలో గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద అలలు పోటెత్తాయి.

6. Corona: అనాథలైన పిల్లలకు నెలకు ₹2500

కొవిడ్‌తో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారుల భవిష్యత్తు విషయంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలైన పిల్లలకు 25ఏళ్లు వచ్చేదాకా నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఉచిత విద్య అందిస్తామని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. అలాగే, కరోనా మహమ్మారితో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించడంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఉచిత రేషన్‌ అందజేస్తామన్నారు. దిల్లీలో 72లక్షల రేషన్‌కార్డు దారులకు ప్రతి నెల 5కిలోల రేషన్‌ బియ్యంఇస్తున్నప్పటికీ.. ఈ నెల మరో 5కేజీలు అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.

7. ‘కరోనా కథ అప్పుడే ముగియలేదు’ 

‘నేను కేకే అగర్వాల్‌ కాదు.. ఓ వైద్యుడిని.. మిమ్మల్ని రక్షించడమే నా కర్తవ్యం ’’.. ఇండియన్ మెడికల్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ కేకే అగర్వాల్‌ చెప్పిన మాటలివి. వైద్య రంగంలో విశేష సేవలందించిన ఆయన.. కొవిడ్‌తో సుదీర్ఘంగా పోరాడి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. వృత్తిరీత్యా హృద్రోగ నిపుణలైన ఆయన చివరి క్షణం వరకు రోగులకు సేవలందిస్తూనే ఉన్నారు. శరీరంలోకి వైరస్‌ ప్రవేశించి నిస్సత్తువ ఆవహించినా ఆక్సిజన్‌ పెట్టుకునే ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. కొవిడ్‌ బాధితుల సంరక్షణపై చివరినాళ్లలో ఆయన చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

8. Gold rate: పరుగులు పెడుతున్న పసిడి ధర

పసిడి ధర మళ్లీ పెరిగింది. సోమవారం పదిగ్రాములపై రూ.348 పెరిగిన బంగారం ధర మంగళవారం మరోసారి రూ.300లకు పైగా పెరగడం గమనార్హం. దేశరాజధాని దిల్లీలో పసిడి రూ.333 పెరగడంతో 10గ్రాములు రూ.47,833కు చేరింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ఏర్పడటంతో ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. ఇక వెండి అయితే భారీగా పెరిగింది రూ.2,021 పెరగడంతో కిలో రూ.73,122కు చేరింది. నిన్న కిలో రూ.71,101గా ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,869 డాలర్లు కాగా, వెండి ఔన్సు 28.48డాలర్లుగా నమోదైంది.

9. అక్టోబర్‌ వరకు టీకా ఎగుమతులు లేనట్లే..!

భారత్‌ నుంచి అక్టోబర్‌ వరకు కోవాక్స్‌ ప్రాజెక్టు టీకాలు ఎగుమతి చేసే అవకాశం లేదు. దేశీయంగా కొవిడ్‌ తీవ్రత పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో దేశంలో కేసులు పెరగడంతో టీకాల ఎగుమతలను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే భారత్‌ 66 మిలియన్ల డోసుల టీకాలను ఎగుమతి చేసింది. దీంతో బంగ్లాదేశ్‌, నేపాల్‌,శ్రీలంక సహా పలు ఆఫ్రికా దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్‌ బయట టీకాలను తయారు చేస్తున్న సంస్థలు కోవాక్స్ కార్యక్రమానికి సరఫరాలను పెంచాలని కోరింది. 

10. corona:‘మా కుటుంబం ముక్కలైంది’ 

కరోనా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఎప్పుడు ఏ మరణవార్త వినాల్సి వస్తుందోనని ఆత్మీయులు వణికిపోతున్నారు. ఇంట్లో పెద్దవారిని బలితీసుకొని..చిన్నారులను అనాథలను చేస్తోంది. కొన్ని చోట్ల యువత కూడా దీని కాటుకు గురవుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. కవల పిల్లల్ని కాటేసి కుటుంబాన్ని ముక్కలు చేసింది. ‘మా కుటుంబం ముక్కలైంది. ఇప్పుడు మేం ముగ్గురమే మిగిలాం. నా కుమారులు జోఫ్రెడ్, రాల్ఫ్రెడ్ కొవిడ్ కారణంగా మరణించారు’ అని ఆ కవల పిల్లల తండ్రి గ్రెగరీ రఫేల్ విలపించారు. 

108 రాలేదు.. గర్భిణి ప్రాణాలు నిలవలేదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని