Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 09:01 IST

Top Ten News @ 9 AM

1. పాఠశాలల్లో పిల్లలు జాగ్రత్త

క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలనూ అధ్యయనం చేయకుండా...మార్గదర్శకాలు రూపొందించకుండా పాఠశాలలను తెరుస్తున్నామని ఎందుకు ప్రకటించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హాజరును తప్పనిసరి చేస్తున్నారా? కొవిడ్‌ మార్గదర్శకాలను ఏవిధంగా అమలు చేస్తున్నారని అడిగింది. కరోనా చికిత్సలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పాఠశాలలను ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌నూ విచారించింది.

2. హడావుడిగా మూసేశారు

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన కొద్దికాలానికే 2016లో జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో పోలీసులు తక్కువ వ్యవధిలోనే 11 కేసుల్లో తుది నివేదికలను (ఫైనల్‌ రిపోర్ట్‌) దాఖలు చేశారని హైకోర్టు సుమోటోగా నమోదుచేసిన పిటిషన్లలో పేర్కొంది. తుది నివేదికలను మేజిస్ట్రేట్లు అనాలోచితంగా అంగీకరించి, కేసుల్ని హడావుడిగా మూసేశారని వెల్లడించింది. మేజిస్ట్రేట్లు ఫిర్యాదుదారుల నుంచి అఫిడవిట్లు తీసుకోలేదని, కేసుల మూసివేతకు కారణాలు పేర్కొనలేదని తెలిపింది. న్యాయవిచక్షణను వర్తింపజేయకుండా తుది నివేదికలను అంగీకరించారంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, సంబంధిత స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లు, ఫిర్యాదుదారులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్‌ఛానల్‌ ఎడిటర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొంది.

3. రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండి

సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదేశించింది. అంతవరకు పనులు ఆపాలని బోర్డు తరఫున సభ్యుడు హెచ్‌కే మీనా ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల కార్యదర్శికి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దని చెప్పిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. కృష్ణా బోర్డు నిపుణుల కమిటీ పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో? లేదా? నివేదించాలని ట్రైబ్యునల్‌ పేర్కొందని వివరించారు.

4. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షల నిర్వహణ

‘పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులకు మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తున్నాం. వివిధ పాఠశాలలు నిర్వహించే అంతర్గత పరీక్షలపై నిఘా పెట్టే అధికారం కానీ, వాటిని పర్యవేక్షించే సౌలభ్యం కానీ ఇంటర్మీడియట్‌ బోర్డుకు లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత పరీక్షల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో నిర్వహించే ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశపరీక్షల్లో 25% ఇంటర్‌ మార్కులకు వెయిటేజి ఉంటుంది. కొవిడ్‌ కేసులు మే 20న 22,610, 21న 20,937, 22న 19,981 రాగా.. జూన్‌ 20న 5,646, 21న 5,541, 22న 4,169 వచ్చాయని.. ఇలా కేసులు తగ్గుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించడమే విద్యార్థులకు ప్రయోజనకరమని అధికారులు భావించారు’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

5. శతాబ్దపు వితరణశీలి జమ్‌షడ్జీ టాటా

గత శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వశీలి భారత పారిశ్రామిక పితామహుడు జెమ్‌షెడ్జీ టాటాయేనని ఒక నివేదిక వెల్లడించింది. జెమ్‌షెడ్జీ మొత్తం 102 బిలియన్‌ డాలర్ల (ఇప్పటి మారకపు విలువ ప్రకారం రూ.7.65 లక్షల కోట్ల)ను వితరణ చేసినట్లు హూరన్‌, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌లు రూపొందించిన అగ్రగామి-50 మంది దాతల జాబితా చెబుతోంది. టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడైన జెమ్‌షెడ్జీ తర్వాత బిల్‌ గేట్స్‌ 74.6 బిలియన్‌ డాలర్ల వితరణతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. వారెన్‌ బఫెట్‌ (37.4 బి. డాలర్లు), జార్జ్‌ సోరోస్‌(34.8 బి. డాలర్లు), జాన్‌ డి రాక్‌ఫెల్లర్‌(26.8 బి. డాలర్లు)లు తరవాతి స్థానాల్లో ఉన్నారు.

6. దీపావళి వరకు ఉచిత రేషన్‌

వచ్చే దీపావళి వరకు పేదలకు ఉచితంగా తలసరి నెలకు 5 కేజీల తిండి గింజలు సరఫరా చేయాలని బుధవారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ ఈనెల 7న జాతినుద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ మేరకు ఇచ్చిన హామీని అమలు చేయనుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉచితంగా రేషన్‌ సరఫరా చేసింది. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో దాన్ని నవంబరు వరకు మరో అయిదు నెలలపాటు పొడిగించింది. 81.35 కోట్లమంది లబ్ధిదారులకు జాతీయ ఆహారభద్రత చట్టం కింద రేషన్‌ ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది.

7. ఐటీ కేంద్రంగా విశాఖ

రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు ఏటా ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నూతన ఐటీ విధానంపై మంత్రులు, ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘మన పిల్లలకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన లక్ష్యం కావాలి. ఉద్యోగ శిక్షణలో భాగంగా అత్యున్నత నైపుణ్యాలను నేర్పించే కంపెనీలు, సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రపంచ స్థాయిలో పోటీపడే అవకాశం వస్తుంది. మొదటి ఏడాది పూర్తయిన తర్వాత నుంచి ఆ కంపెనీకి ప్రోత్సాహకాల చెల్లింపు ప్రారంభమవుతుంది.

8. Corona: మెదడుపైనా కొవిడ్‌ ప్రభావం

కొవిడ్‌-19 మెదడుపై కూడా ప్రభావం చూపుతుందా... అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. తీవ్ర కరోనాతో చనిపోయిన వారిలో పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ మృతుల్లో కనిపించే రీతిలో మెదడులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌), నాడీ క్షీణత కనిపించిందని అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌, జర్మనీకి చెందిన సార్లాండ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘ కొవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నవారిలో ఈ వాపు ప్రక్రియ ప్రభావం తీవ్రంగా ఉందని వీరి పరిశోధనలో తేలింది. కొవిడ్‌-19తో ఆసుపత్రి పాలైన వారిలో మూడింట ఒక వంతు మందిలో అస్తవ్యస్త ఆలోచనలు, మతిమరుపు, ఏకాగ్రత లోపం, కుంగుబాటు కనిపించాయని స్టాన్‌ఫోర్ట్‌ ప్రొఫెసర్‌ టోనీ కోరే తెలిపారు.

9. WTC Final: వాళ్లకు గద.. మనకు వ్యథ

రెండేళ్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ప్రయాణంలో  భారత్‌కు సిరీస్‌ ఓటమి రుచి చూపిన ఏకైక జట్టు న్యూజిలాండ్‌. ఇప్పుడు ఆ జట్టే భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌ కాకుండా అడ్డుకుంది. రిజర్వ్‌ డే అయిన బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కోహ్లీసేనను ఓడించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. 8 వికెట్లు చేతిలో ఉండగా.. 32 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌.. రెండు సెషన్లు ఆడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంటుందనుకుంటే.. రెండో సెషన్‌ మధ్యలోనే ఇన్నింగ్స్‌ను ముగించేసింది. భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా (15), కోహ్లి (13) తీవ్ర నిరాశకు గురి చేశారు. రహానె (15) సైతం విఫలమయ్యాడు.

10. వెంకటేష్‌.. టీజర్‌ ట్రీట్‌?

వెంకటేష్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘నారప్ప’. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఈ చిత్ర టీజర్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీజర్‌ విడుదల సందర్భంగానే చిత్ర విడుదల తేదీపైనా ఓ స్పష్టత ఇచ్చే అవకాశముంది. తమిళంలో  విజయవంతమైన ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని