Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. Lockdown: హైకోర్టు ఒత్తిడితోనే..: భట్టి

తెలంగాణ‌లోని ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా వైద్యానికి ధ‌ర‌లు నిర్ణ‌యించమ‌ని హైకోర్టు ఆదేశించినా ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సీఎం దీనిపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఆ టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుందో తెలియ‌డం లేద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. భట్టి విక్రమార్క జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వ‌హించారు. క‌రోనా ఉద్ధృతిపై సీఎస్‌కు ఫోన్ చేసి అప్ర‌మ‌త్తం చేయ‌మ‌ని చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌యోజనం లేద‌ని సీఎస్ అన్నార‌ని.. హైకోర్టు ఒత్తిడితోనే లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నార‌న్నారు. 

2. AP: ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించండి’

ఏపీలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్న దృష్ట్యా వారి ప్రాణాలు కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ను ఆర్టీసీ ఎన్‌ఎంయూ కోరింది. ఈ మేరకు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ సీఎంకు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి లేఖ రాశారు. ఇప్పటి వరకు 9,200 మంది ఆర్టీసీ కార్మికులు కరోనా బారిన పడ్డారని తెలిపారు. సంస్థలో ఉన్న సుమారు 51,500 కార్మికుల్లో 18 శాతం మంది వైరస్‌ బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌తో ఇప్పటి వరకు 240 మంది కార్మికులు చనిపోయినట్లు తెలిపారు. 

Black Fungus: ప్రకాశం జిల్లాలో వ్యక్తి మృతి

RUIA: ఘటనపై నివేదిక ఇవ్వండి:NHRC

3. TS: వైద్య విద్యార్థుల స్టయిఫండ్‌ పెంపు

హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్యులు, సూపర్‌ స్పెషాలిటీ విద్యార్థుల స్లయిఫండ్‌ను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు స్టయిఫండ్ పెంచుతూ వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ హౌస్ సర్జన్లు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్‌, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థి వైద్యులకు 2021 జనవరి 1 నుంచి స్టయిఫండ్‌పై 15శాతం పెంచుతున్నట్లు తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మెడికల్‌, డెంటల్‌ హౌస్‌ సర్జన్‌లకు ఇకపై నెలకు రూ.22,527 అందనుంది.

4. వ్యాక్సినేషన్‌ ఎక్కువ..ఆక్సిజన్‌ అవసరం తక్కువ

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో ఓ వైపు ఆక్సిజన్‌ లభించకపోవడం, మరోవైపు టీకాల కొరతతో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా స్క్రోల్‌ సంస్థ పరిశోధనలో వ్యాక్సిన్‌ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అవసరం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మణిపూర్‌, త్రిపుర రాష్ట్రాలను గమనిస్తే త్రిపుర కన్నా మణిపూర్‌ వాసులకు నాలుగురెట్లు అధిక ఆక్సిజన్‌ అవసరముందని తెలుస్తోంది.  దీనికి కారణం త్రిపురలో వ్యాక్సినేషన్‌ రేటు ఎక్కువగా ఉండటమే. రాష్ట్రాలు ఎంత ఆక్సిజన్‌ను కోరుతున్నాయన్న వివరాలను ఏప్రిల్‌ 28న కేంద్రం విడుదల చేసింది. 

5. Kerala Cabinet: అందరూ కొత్తవారే

కేరళ నూతన మంత్రివర్గం ఖరారైంది. 11 మందితో నూతన మంత్రివర్గాన్ని సీఎం పినరయి విజయన్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన పేర్లను ప్రకటించారు. గత ప్రభుత్వంలోని ఒక్కరికీ ఈసారి కేబినెట్‌లో అవకాశం కల్పించలేదు. అందర్నీ కొత్తవారినే తీసుకున్నారు. శాసనసభ స్పీకర్‌గా ఎం.బి.రాజేశ్‌, మంత్రులుగా ఎం.వి.గోవిందన్‌, కె.రాధాకృష్ణన్‌, కె.ఎన్‌.బాలగోపాల్‌, పి.రాజీవ్‌, వి.ఎన్‌.వాసన్‌, సౌజీ చెరియన్‌, శివన్‌కుట్టి, మహ్మద్‌ రియాజ్‌, డాక్టర్‌ ఆర్‌.బిందు, వీణా జార్జి, వి. అబ్దుల్‌ రెహ్మాన్‌ ఉన్నారు. 

6. మౌత్‌ వాష్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌ వచ్చింది

కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తువులు ఆర్డర్‌ చేసినపుడు అవి కాకుండా వేరే వస్తువులు రావడాన్ని మనం చూశాం. అలాగే ఫోన్‌, ల్యాప్‌టాప్‌లు ఆర్డర్‌ చేసినపుడు వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వినియోగదారులు సదరు సంస్థను లేదా పోలీసులను ఆశ్రయిస్తారు. తాజాగా ముంబయిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ ఇక్కడ వినియోగదారుడు నష్టపోవడం కాదు ప్యాకెట్‌లో వచ్చిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. అసలేం జరిగిందంటే..

7. America: ప్రపంచ దేశాలకు భారీ సాయం

ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకాలను అందిచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్ అండ్‌ జాన్సన్ టీకాలను వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ దేశాలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో ఈ మొత్తం 13 శాతం కాగా ఇప్పటివరకు రష్యా, చైనా.. ప్రపంచ దేశాలకు సరఫరా చేసినదానికంటే 5 రెట్లు ఎక్కువని బైడెన్‌ వెల్లడించారు. ప్రపంచమంతా మహమ్మారితో బాధపడుతుంటే అమెరికా సురక్షితంగా ఉండలేదని బైడెన్‌ పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్‌, మోడెర్నా,, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు.

8. Pfizer Vaccine: మరో సానుకూల కబురు

కరోనావైరస్‌ను అత్యంత సమర్థంగా అడ్డుకుంటున్న ఫైజర్‌ టీకాల విషయంలో మరో సానుకూల కబురును ఐరోపా మెడిసిన్‌ ఏజెన్సీ తెలిపింది. ఒక సారి అత్యంత శీతల వాతవారణం నుంచి బయటకు  తీసుకు వచ్చిన టీకాల వయల్స్‌ను వినియోగించకపోతే నెలరోజుల వరకు  ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి ఐదురోజుల వరకే ఉంది. ఈ నిర్ణయంతో ఐరోపా సంఘంలోని చాలా దేశాల్లో దీనికి అనుమతులు లభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఫైజర్‌ టీకాలను రవాణ చేయడానికి అత్యంత శీతల ఉష్ణోగ్రత అవసరం కావడం పెద్ద ఇబ్బందిగా మారింది. 

చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే..

9. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను  ముగించాయి. కొవిడ్‌ కేసులు మూడు లక్షల దిగువకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఆటోమొబైల్‌ స్టాక్స్ ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 612 పాయింట్లు పెరిగి 50,193 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు పెరిగి 15,108 వద్ద స్థిరపడ్డాయి.  గతి లిమిటెడ్‌, టీసీఐ ఎక్స్‌పోర్ట్స్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌ మెంట్‌, హింద్‌ కన్‌స్ట్రక్షన్‌ కో, హెస్టర్‌ బయోసైన్స్‌, కెనరా బ్యాంక్‌, బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. 

10. VIRUS RECOVERIES: దేశంలో ఇదే తొలిసారి!

కరోనా విజృంభణతో భారత్‌ సతమతమవుతోంది. నిత్యం లక్షలాది పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, గత వారం రోజులుగా కరోనా కేసుల విషయంలో స్థిరీకరణ కనిపిస్తోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో పెద్ద ఉపశమనమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో అత్యధికంగా 4లక్షలమందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. ఒక రోజులో ఈ స్థాయిలో కరోనా బాధితులు కోలుకోవడం దేశంలో ఇదే తొలిసారి. పాజిటివ్‌ కేసులతో పోలిస్తే అధికంగా 1.50లక్షలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని