TS News: ‘దిశ’ నిందితుల ఎదురుకాల్పుల కేసు: విచారణ మరింత ఆలస్యం!

తాజా వార్తలు

Updated : 23/07/2021 10:31 IST

TS News: ‘దిశ’ నిందితుల ఎదురుకాల్పుల కేసు: విచారణ మరింత ఆలస్యం!

ముందుకు సాగని కమిషన్‌ కార్యకలాపాలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘దిశ’ హత్యాచార ఘటన నిందితులు ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్‌ నివేదిక మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ కరోనా కారణంగా విచారణకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 2019 నవంబరు 27న జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితులను గుర్తించారు. దర్యాప్తులో భాగంగా డిసెంబరు 6న వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లినప్పుడు జరిగిన కాల్పుల్లో మహ్మద్‌ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మరణించారు. ఆయుధాలు లాక్కొని కాల్పులకు యత్నించడంతో తాము జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితులు మరణించారని పోలీసులు వెల్లడించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, విచారణ జరిపించాలని పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు విచారణ కమిషన్‌ను నియమిస్తూ డిసెంబరు 12న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ వి.ఎస్‌.సిర్పూర్‌కర్, జస్టిస్‌ రేఖబల్దోత, సీబీఐ మాజీ సంచాలకులు బి.కార్తికేయన్‌లు కమిషన్‌లో సభ్యులు.

ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆవరణలో వీరికి ప్రత్యేక కార్యాలయమూ ఏర్పాటు చేశారు. 2020 ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వచ్చిన కమిషన్‌ సభ్యులు.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్, శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌ తదితరులను కలిశారు. సాక్షులు, కాల్పుల్లో చనిపోయిన నిందితుల కుటుంబ సభ్యులు, పోలీసులను విచారించి వాంగ్మూలం నమోదు చేయడంతోపాటు ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే, 2020 ఫిబ్రవరిలో విచారణ మొదలుపెట్టినప్పటికీ మార్చి నుంచి కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దాంతో విచారణ కూడా నెమ్మదించింది. ప్రస్తుతం మూడో వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని