తలుపుతట్టి.. మహమ్మారిని తరిమికొట్టి
close

తాజా వార్తలు

Updated : 08/07/2021 18:51 IST

తలుపుతట్టి.. మహమ్మారిని తరిమికొట్టి

ఫలించిన ఇంటింటి జ్వరం సర్వే

మందుల పంపిణీతో అడ్డుకట్ట

నెలలో 45శాతం తగ్గిన బాధితుల సంఖ్య

"ఇంటింటి జ్వరంసర్వే, దాని అనుబంధ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. గ్రేటర్‌లో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జ్వరం సర్వే, స్థానిక దవాఖానాల్లో నిత్యం చేపడుతోన్న పరీక్షలతో బాధితుల సంఖ్య నెల రోజుల్లో 45శాతం పడిపోయింది. అధికారుల కట్టడి చర్యలతో మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సైతం మెరుగైన ఫలితమిచ్చింది. మొదటి, రెండో విడత జ్వరం సర్వేల్లో నమోదైన గణాంకాలే అందుకు నిదర్శనం. మరో రెండు వారాల్లో కొవిడ్‌ కేసులు మరింత తగ్గుముఖం పడతాయని జీహెచ్‌ఎంసీ అంచనా వేస్తోంది."
హైదరాబాద్‌ మహానగరంలో ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కొవిడ్‌ మహమ్మారి విజృంభించింది. రోజూ వందలాది మంది ఆస్పత్రుల ఎదుట పడకల కోసం అంబులెన్సుల్లో గంటల తరబడి నిరీక్షించారు. దీంతో మే మొదటి వారం వరకు నగరంలో భయానక వాతావరణం నెలకొంది. సరిగ్గా.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఇంటింటి జ్వరం సర్వే చేపట్టాయి. సమాంతరంగా నగరవ్యాప్తంగా బస్తీదవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి 320 ప్రాంతాల్లో రోజూ స్థానికులకు జ్వరం పరీక్షలు నిర్వహించారు. రెండు కార్యక్రమాల ద్వారా.. గుర్తించిన జ్వరం బాధితులకు నర్సులు కొవిడ్‌ మందుల కిట్లు పంపిణీ చేశారు.

అందరికీ వైరస్‌ సోకినట్లు కాదు..

జ్వరం బాధితులంతా కొవిడ్‌ బాధితులైనట్లు కాదని జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు. వాళ్లలో తమకు కొవిడ్‌ సోకిందనే భయం ఉన్నందున.. ముందు జాగ్రత్తగా అందరికీ కొవిడ్‌ కిట్లు అందించామన్నారు. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్‌ గోలీలు వాడాలని సూచించామన్నారు. అవసరమైతే స్థానిక వైద్యుల సూచన తీసుకుని ఇతర ఔషధాలు ఉపయోగించాలని నర్సులు బాధితులకు చెబుతూ వచ్చారని, ఫలితంగా బాధితులు ఇంటి దగ్గరే ధైర్యంగా కోలుకున్నారని ఆయన గుర్తుచేశారు. దాని వల్ల ఆస్పత్రులకు పరుగులు తీసే వారి సంఖ్యను తగ్గించగలిగామన్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర కొవిడ్‌ లక్షణాలు పెరిగిన వాళ్ల గురించి నర్సులు క్రమం తప్పకుండా ఆరాతీశారని, అవసరమైన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారన్నారు. సర్వే ప్రారంభంలో ఎక్కువ శాతం చిన్నారులు జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని, అనంతరం సంఖ్య బాగా తగ్గిందని అధికారులు తెలిపారు. వలస కార్మికులు, బస్తీలు, అపార్ట్‌మెంట్లలో లెక్కకు మించి కొవిడ్‌ లక్షణాలున్నవారిని గుర్తించామన్నారు. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కట్టడి చర్యలు కఠినంగా అమలవ్వాల్సిన అవసరాన్ని సర్వే స్పష్టం చేస్తుందని గుర్తుచేశారు. మొదటి విడత సర్వేలో 73,094 మందికి, రెండో విడత సర్వేలో 40,163 మందికి కొవిడ్‌ కిట్లు అందజేశామన్నారు.- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని