కొవిడ్‌ నివారణ ఒకే చోట... ‘కరోనా మాల్‌’

తాజా వార్తలు

Published : 13/06/2020 02:23 IST

కొవిడ్‌ నివారణ ఒకే చోట... ‘కరోనా మాల్‌’

వారణాసి: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చికిత్సే లేని ఈ వ్యాధి రాకుండా నిరోధించటమే తరుణోపాయం. ఇందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌ తదితర వస్తువులను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో వీటికి డిమాండ్‌ వివరీతంగా పెరిగిపోయింది. ఇవి మార్కెట్‌లో లభించడమే కష్టంగా ఉంది. అంతేకాకుండా వీటిలో ఒక్కో వస్తువు ఒక్కో చోట లభించటంతో పలుచోట్లకు తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఒకే చోట లభిస్తే బాగుంటుందనే విభిన్న ఆలోచనకు రూపమే ‘కరోనా మాల్‌’!

ఉత్తర్‌ ప్రదేశ్‌ వారణాసిలోని సిగ్రా ప్రాంతంలోఉన్న ఈ కరోనా మాల్‌లో కొవిడ్‌-19 నివారణకు అవసరమయ్యే ప్రతి వస్తువు దొరుకుతుందట. ‘‘ మాస్కులు, స్కార్ఫ్‌లు, సబ్బులు, శానిటైజర్ల కోసం వినియోగదారులు ఎన్నో దుకాణాలకు తిరగాల్సి వస్తోంది. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు మేము ‘కరోనా మాల్‌’ను ఏర్పాటు చేశాం. ప్రజల్లో కరోనా పట్ల ఉన్న భయాన్ని తగ్గించేందుకు అన్ని రకాల వస్తువులను మా దగ్గర అందుబాటులో ఉంచుతున్నాము.’’ అని యజమాని అశోక్‌ సింగ్‌ తెలిపారు.

వారం రోజుల క్రితం ప్రారంభించిన ఈ దుకాణానికి వినియోగదారులు వెల్లువెత్తుతున్నారట. వ్యక్తిగతంగా వాడే వస్తువులే కాకుండా...టన్నెల్‌ యంత్రం, ఆటోమేటిక్‌ శానిటైజర్‌ యంత్రం, థర్మల్‌ స్కానర్‌ వంటి అనేక భారీ, అత్యాధునిక యంత్రసామగ్రి కూడా తమ వద్ద లభ్యమవుతాయని అశోక్‌ సింగ్‌ వివరించారు. చిన్నపిల్లలను ఆకట్టుకునే ప్రత్యేక మాస్కులు కూడా ఇక్కడ లభిస్తాయి. విభిన్నమైన దీని పేరు కూడా ఇక్కడి ప్రజల్లో విపరీతమైన ప్రాచుర్యం పొందుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని