మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

తాజా వార్తలు

Updated : 12/04/2021 03:11 IST

మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

ఈజిప్టులో బయటపడ్డ అతిపెద్ద పురాతన నగరం

కైరో: ఈజిప్టు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పే పురాతన నగరం మరొకటి బయటపడింది. ఇసుక కింద సమాధి అయిన మూడు వేల ఏళ్ల క్రితం నాటి బంగారు నగరాన్ని పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. లగ్జోర్‌లో గుర్తించిన ఈ నగరంలోని అద్భుతమైన, అరుదైన కట్టడాలను చూసి ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఈజిప్టులో ఇప్పటివరకు కనుగొన్న పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దదని వెల్లడించారు. ఈజిప్టును పాలించిన ఫారో స్వర్ణయుగంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ బంగారు నగరం నాటి ఈజిప్టు ఘన చరిత్రను మరోసారి కళ్లకు కట్టింది.  

‘లాస్ట్‌ గోల్డెన్‌ సిటీ’గా పిలిచే ఈ పట్టణం పేరు ఏథెన్‌ అని.. క్రీస్తుపూర్వం 1391 నుంచి 1353 మధ్య కాలంలో ఈ నగరం మనుగడలో ఉందని పురాతత్వ పరిశోధకులు పేర్కొన్నారు. ఈజిప్టును పాలించిన 18వ రాజవంశానికి చెందిన 9వ రాజు కింగ్‌ ఎమెన్‌ హొటెప్‌-3 ఈ నగరాన్ని నిర్మించినట్లు చరిత్ర వెల్లడిస్తోందని పరిశోధకుల బృందం తెలిపింది. ఈ నగరం ఎమెన్‌ హొటెప్‌-3 కాలం నుంచి ఆయన కుమారుడు ఎమెన్‌ హొటెప్‌-4 వరకు ఉన్నత స్థితిలో ఉందని చరిత్ర వెల్లడిస్తున్నట్లు పురాతత్వ పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన జాహీ హవాస్‌ పేర్కొన్నారు. ఈ పురాతన నగరం వీధులు ఇళ్లతో అనుసంధానం చేసి ఉన్నాయని, కొన్ని గోడలు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయని తెలిపారు. కింగ్‌ ఎమెన్‌ హొటెప్‌-3 ముద్రలు ఉన్న నాణేలు, ఉంగరాలు, కుండలు, మట్టి ఇటుకలు లభించాయన్నారు. ఒక ప్రవేశద్వారం మాత్రమే ఉన్న అతిపెద్ద గోడను కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఈ గోడ భద్రత కల్పించడానికి నిర్మించినదిగా పరిశోధకులు భావిస్తున్నారు.

ఆలయం, సమాధులతోపాటు.. తాయెత్తులు, ఆభరణాలను తయారుచేసేందుకు ఉపయోగించే క్యాస్టింగ్‌ అచ్చులను కూడా  ఇక్కడ దొరికిన వస్తువులపై ఉన్న చిత్ర లిపి శాసనాల ద్వారా బృందం కనుగొంది. నేత పరిశ్రమలు వాడే అనేక సాధనాలను కూడా గుర్తించింది. ఒక గదిలో రెండు ఆవులు, లేదా ఎద్దుల సమాధులను కనుగొన్నారు. మరో ప్రాంతంలో ఓ వ్యక్తి అవశేషాలు గుర్తించారు. నగరానికి ఉత్తరాన పెద్ద శ్మశానవాటిక బయటపడింది. ఈ తవ్వకాల్లో భారీ బంగారు చేప ప్రతిమను కూడా పరిశోధకులు గుర్తించారు. 

ఈ పురాతన నగరంలో మూడు ప్రధాన విభాగాలను గుర్తించామని జాహీ హవాస్‌ పేర్కొన్నారు. ఒకటి పరిపాలన కోసం, ఇంకొకటి కార్మికులు నిద్రించడానికి, మరొకటి పరిశ్రమల కోసమని ఆయన వెల్లడించారు. ఈ నగరం అతిపెద్ద పరిపాలనా, పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్ర వెల్లడిస్తోందని హవాస్‌ వివరించారు. ఈ నగరం పురాతన ఈజిప్టియన్ల జీవితానికి సంబంధించిన అరుదైన సమాచారమిస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి, ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు, రాజకీయ అస్థిరత వల్ల కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈజిప్టు పర్యాటక రంగానికి ఈ చారిత్రక నగర ఆవిష్కరణ పూర్వవైభవం తెస్తుందని ఆ దేశ ప్రభుత్వం ఆశిస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని