కరోనా సోకిందని అనుమాన పడటం మంచిదే

తాజా వార్తలు

Published : 28/04/2021 19:37 IST

కరోనా సోకిందని అనుమాన పడటం మంచిదే

కరోనా విజృంభిస్తున్న వేళ డాక్టర్‌ జయచంద్ర కీలక సూచనలు

హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా మారింది. మునుపటికన్నా ఎక్కుమంది కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన రోగుల్లో ఎక్కువ మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్నాయి. ఈ తరుణంలో కరోనా సోకిన వారు ముఖ్యంగా హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర ఆంశాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్‌ జయచంద్రను ఇంటర్య్వూ చేయగా ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు.

ఎటువంటి లక్షణాలు ఉన్నవాళ్లు ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడానికి హాస్పటల్‌కి వస్తున్నారు?

గతంలో పోలిస్తే ఇప్పుడు కరోనా సోకిన వాళ్ల తాకిడి ఎక్కువైంది. ఫ్యామిలీలో నలుగురైదుగురు ఒకేసారి వస్తున్నారు. యుక్త వయసులో ఉన్నవారు ఎక్కువగా వస్తున్నారు. వాళ్లలో 80-85 శాతం మందికి సాధారణ వైద్యం అందిస్తే కోలుకుంటున్నారు. మిగతా 10శాతం మందికి ఆక్సిజన్‌ అందించి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తే నయమవుతుంది. 5 శాతం మందిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

కరోనా సోకిన వారికి ఆక్సిజన్‌ లెవెల్స్ పడిపోతున్నాయి. వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అందరికీ ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోవు. 80-85 శాతం పేషెంట్లకి ఆక్సిజన్‌ లెవెల్స్ సాధారణంగానే ఉంటాయి. వాళ్లు రోజువారీగా ప్రాణాయామం చేస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆక్సిజన్‌ సప్లిమెంట్‌ అందించాల్సిన అవసరం ఉండదు. 93 శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ లెవెల్స్‌ ఉన్నవాళ్లకు మాత్రం వైద్యం చేయాల్సి ఉంటుంది.

కరోనా సోకిన వాళ్లలో ఆస్తమా ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లకు ఎలాంటి వైద్యం చేస్తున్నారు?

కరోనా సోకినా, సోకక పోయినా ఆస్తమా ఉన్న వాళ్లను ఎప్పటికప్పడు పరిశీలిస్తాం. తగిన మందులులిచ్చి ఆస్తమా కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నిస్తాం. 

కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు 14 రోజుల వరకూ ఎవ్వరినీ కలవకూడదు. ఎవరైనా దగ్గరకు వస్తే ఆరు అడుగుల దూరం పాటించాలి. చేతికి గ్లౌజస్‌ తొడుక్కోవాలి. మాస్క్‌ పెట్టుకోవాలి. వాళ్లు వాడిన బట్టలు వేరుగా ఉంచాలి.

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వాళ్లకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ తరుణంలో ఇంట్లో వాళ్లతో ఏవిధంగా మసలుకోవాలి?

ఇంట్లో ఐదుగురు కన్నా ఎక్కు మంది ఉంటే అందరూ ఐసోలేషన్‌లో ఉండటం కష్టం. ఇలాంటి సందర్భాల్లో బంధువుల ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండాలి. అలా కుదరని పక్షంలో ఇంట్లో అందరూ మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి. ఒకరు వాడిన వస్తువు మరొకరు వాడకుండా జాగ్రత్త పడాలి. కరోనా సోకిన వారు అందరూ హాస్పటల్‌కి వెళ్లాల్సిన పనిలేదు. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన వాళ్లు హాస్పటల్‌కి రావడం వల్ల బెడ్ల కొరత ఏర్పతుంది. 90 శాతం మందికి ఇంట్లోనే నయం అవుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న పాటి లక్షణం కనిపించినా కరోనా సోకిందేమోనని అనుకుంటున్నారు. అలా అనుకోవడం మంచిదేనా?

అలా అనుమానపడటం ఒకరకంగా మంచిదే. ఎందుకంటే అలా అనుకోవడం వల్ల కరోనా టెస్టు చేయించుకుంటారు. దాని వల్ల త్వరగా పేషెంట్‌ను గుర్తించి ఐసోలేట్‌ చేయొచ్చు. జలుబే కదా అని ఊరుకుని అందరి మధ్య తిరిగితే చాలా ప్రమాదం. ఒకవేళ అతనికి వైరస్‌ సోకితే అతని నుంచి ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. ఏ కొద్ది లక్షణాలు ఉన్నా సరే టెస్టు చేయించుకోవాలి. ఫలితం ఏదైనా కానీ మాస్క్‌ ధరించడం మానకూడదు.

వ్యాక్సిన్‌ వేసుకున్నవాళ్లకు కరోనా సోకే అవకాశం ఉందా?

వ్యాక్సిన్‌ వేసుకున్నంత మాత్రాన వైరస్‌ సోకదు అని ఎవ్వరూ నిర్ధారించలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లకు 80 శాతం వరకూ వైరస్‌ సోకకుండా ఉంటుంది. ఒక వేళ సోకినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ప్రాణాపాయం మాత్రం ఉండదు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకుంటే, అందరిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో వైరస్‌ వ్యాప్తి తగ్గుతుంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని