TS Corona: రికవరీ రేటు 90.48%: డీహెచ్‌
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS Corona: రికవరీ రేటు 90.48%: డీహెచ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో గత 2 వారాలుగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. పాజిటివిటీ రేటు కూడా అనూహ్యంగా తగ్గిందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కొవిడ్‌ కట్టడికి తెలంగాణ మార్గనిర్దేశంగా మారిందన్నారు. గ్రామాల్లోనూ కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని, ఇంటింటి సర్వేద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నామన్నారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.

‘‘ రెండో దశలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.37 లక్షల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,92 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.56శాతంగా ఉంది’’ అని శ్రీనివాసరావు వివరించారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం వల్లనే సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సరిపడా పడకలు ఉన్నాయని చెప్పారు. 40 శాతానికిపైగా పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండాయని, రాష్ట్రంలో 33 శాతం ఆక్సిజన్‌ పడకలు, 493 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. కొవిడ్‌ చికిత్స కోసం 53,756 పడకలు కేటాయించినట్లు చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా 1,265 ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. మే 1 నాటికి కరోనా నుంచి 81 శాతం మంది కోలుకున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 90.48 గా ఉందన్నారు.

వ్యాక్సినేషన్‌ మళ్లీ ప్రారంభమయ్య తేదీలు త్వరలోనే ప్రకటిస్తాం

హైదరాబాద్‌లో మూడు ఆస్పత్రులకు షోకాజ్‌నోటీసులు ఇచ్చినట్టు డీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఒక ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స అనుమతి రద్దుచేసినట్టు వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ మళ్లీ ప్రారంభమయ్యే తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. టీకాల కొరత వల్ల వ్యాక్సినేషన్‌ను తరచూ ఆపాల్సి వస్తోందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ను మధ్యలో ఆపకూడదని భావిస్తున్నామని.. ఎక్కువటీకాలు రాగానే వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. బ్లాక్‌ఫంగస్‌ అనేది అంటువ్యాధికాదని డీహెచ్‌ స్పష్టం చేశారు. కొవిడ్ బారిన పడిన తర్వాత వచ్చే సమస్యల్లో బ్లాక్‌ ఫంగస్‌ ఒకటన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఏర్పాట్లు చేశాం: డీఎంఈ

రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్‌ ప్రకటించారని డీఎంఈ రమేశ్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడివారికైనా అందుబాటులో పెద్ద ఆస్పత్రులు ఉన్నాయన్నారు. అవసరమైతే గంటలోపే చేరుకొనేలా పెద్ద ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు కూడా చికిత్స ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన మందులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. కొవిడ్‌ తగ్గిన వారిలో దవడ నొప్పులు, కళ్లు వెనక నొప్పి వస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని కోరారు. గాంధీ, ఈఎన్‌టీ ఆస్పత్రులతోపాటు మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు చికిత్స అందిస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని