భగవద్రామానుజుల విగ్రహావిష్కరణ.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చినజీయర్‌ ఆహ్వానాలు

తాజా వార్తలు

Updated : 17/09/2021 12:51 IST

భగవద్రామానుజుల విగ్రహావిష్కరణ.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చినజీయర్‌ ఆహ్వానాలు

దిల్లీ: హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగర్‌లో ఉన్న త్రిదండి చినజీయర్‌స్వామి ఆశ్రమంలో వచ్చే ఏడాది కొలువుదీరనున్న సమతా మూర్తి భగవద్రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖులు విచ్చేయనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకతో పాటు 200 ఎకరాల్లో వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించిన 216 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రులను త్రిదండి చినజీయర్‌ స్వామీజీ, మైహోమ్‌ గ్రూప్స్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, సంస్థ డైరెక్టర్లు రంజిత్‌రావు, రామూరావు స్వయంగా ఆహ్వానిస్తున్నారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తొలుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మంగళవారం ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను స్వయంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను, ఏర్పాటుకు గల కారణాలను చిన జీయర్‌ వివరించారు. ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా చినజీయర్‌ ఆహ్వానించారు. సమాజంలో అంటరానితనం, వివక్షను రూపుమాపి సమానత్వ సాధనకోసం కృషిచేసిన భగవద్రామానుజులవారు ఆధ్యాత్మిక వేత్తగానేకాక, సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి కొనియాడారు. 

కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని బుధవారం కలిసి కార్యక్రమానికి విచ్చేయాలని చిన జీయర్‌ కోరారు. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డిని కూడా దివ్యసాకేతానికి ఆహ్వానించారు. వీరితో పాటు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజేకు కూడా ఆహ్వాన పత్రికలను అందజేశారు. గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి భగవత్‌ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు రావాలని చినజీయర్‌ సాదరంగా ఆహ్వానం పలికారు. రామానుజాచార్యుల వారి జీవిత విశేషాలు.. ఆయన చేసిన మహత్కార్యాలను అమిత్‌ షాకు కూలంకషంగా వివరించారు. ముచ్చింతల్‌లో చేపట్టిన రామానుజ ప్రాజెక్ట్‌ వివరాలను, కార్యక్రమ విశిష్టతను గంట పాటు అమిత్‌ షాకు వివరించారు. విగ్రహావిష్కరణ మహోత్సవానికి తప్పకుండా వస్తానని చినజీయర్‌ స్వామికి అమిత్‌ షా హామీ ఇచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. చినజీయర్‌ చేపట్టిన ఈ మహా యజ్ఞాన్ని మోహన్‌ భాగవత్‌ ఈ సందర్భంగా అభినందించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని