కలవరపెడుతున్న ఏకశిలల రహస్యం

తాజా వార్తలు

Updated : 02/12/2020 05:23 IST

కలవరపెడుతున్న ఏకశిలల రహస్యం

మాయమై 24 గంటలు గడవకముందే మరో దేశంలో ప్రత్యక్షం

బుచారెస్ట్‌: జన సంచారంలేని ఓ ఎడారి ప్రాంతంలో స్టీలు స్తంభం పాతి ఉండటం.. కొద్దిరోజులకు అకస్మాత్తుగా అది మాయమవ్వడం.. 24 గంటలు గడవకముందే అదే తరహా స్తంభం మరో దేశంలో దర్శనమివ్వడం ప్రస్తుతం ప్రపంచ పరిశోధకులను కలవరపెడుతోంది. అసలు ఇది ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో తెలుసుకునేందుకు వారు పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికాలోని యుటాలో ఉన్న రెడ్‌ రాక్‌ ఎడారిలో పాతి ఉన్న స్టీల్‌ మాదిరి ఏకశిలను అక్కడి ప్రజా భద్రత విభాగం అధికారులు నవంబర్‌ 18న గుర్తించారు. అయితే కొద్దిరోజుల తర్వాత అది అకస్మాత్తుగా మాయమైంది. ఎవరో దాన్ని తవ్వి తీసుకొని వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే అలా జరిగి 24 గంటలు గడవకముందే యూరప్‌లోని రొమానియాలో ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రాంతంలో అదే తరహా ఏకశిల కనిపించడం విస్మయానికి గురిచేస్తోంది.

రొమేనియాలోని ప్రాచీన కట్టడం పెట్రోడోవా డేసియన్‌ కోట నుంచి కొన్ని మీటర్ల దూరంలో త్రిభుజాకార లోహ స్తంభాన్ని కనుగొన్నారు. అది అమెరికాలోని యుటాలో కనుగొన్న ఏకశిలను పోలి ఉండటం గమనార్హం. ఆకారంలో దానికీ, దీనికీ చిన్నపాటి తేడాలు మాత్రమే ఉన్నాయి. యుటాలో కనుగొన్న ఆకారం స్టెయిల్‌లెస్‌ స్టీల్‌తో రూపొందించినట్లుగా ఉంటే రొమేనియాలో కనుగొన్న ఏకశిల ప్రతిబింబించే ఉపరితలాన్ని కలిగి ఉంది. దానిపై అర్థం కాని రాతలు ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రసిద్ధ కట్టడాలు ఉన్న ఆ ప్రాంతంలో ఈ వింత ఆకారాన్ని గుర్తించిన కొందరు అధికారులకు తెలియజేశారు. ప్రస్తుతం ఆ ఆకారాన్ని పరిశీలిస్తున్నట్లుగా నీమ్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ అధికారి రోక్సానా జోసాను ఆంగ్ల వార్తా పత్రిక డైలీ మెయిల్‌కు తెలిపారు.

యుటాలోని రెడ్‌రాక్‌ ఎడారి ప్రాంతంలో గొర్రెలను లెక్కించేందుకు వన్యప్రాణి విభాగంవారు నవంబర్‌ 18న సర్వే నిర్వహిస్తూ ఎడారిలో పాతిఉన్న ఓ స్టీల్‌ స్తంభాన్ని కనుగొన్నారు. జనసంచారం లేని ఆ మారుమూల ప్రాంతంలో దాన్ని ఎవరు పాతిపెట్టారో అధికారులకు అంతుచిక్కలేదు. అది గ్రహాంతరవాసుల పనేనని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రొమేనియాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని