ఏం జరుగుతోంది?.. మళ్లీ మాయమైన ఏకశిల

తాజా వార్తలు

Published : 03/12/2020 00:57 IST

ఏం జరుగుతోంది?.. మళ్లీ మాయమైన ఏకశిల

గ్రహాంతరవాసుల పనేనని పలువురి అనుమానం

బుచారెస్ట్‌: ఏకశిలల రహస్యం పరిశోధకులకు ప్రశ్నలు సంధిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతుందో.. మళ్లీ ఎప్పుడు మాయమైపోతుందో అంతుచిక్కడం లేదు. మొదట అమెరికాలోని ఓ ఎడారిలో కనిపించిన ఏకశిల అనంతరం అక్కడినుంచి మాయమైంది. రోజు గడవకముందే అదే తరహా స్తంభం రొమానియాలో దర్శనమిచ్చింది. మళ్లీ కొద్దిరోజులు గడవకముందే అక్కడి నుంచి మాయమైంది. కాగా ఈ పని ఎవరు ఎందుకు చేస్తున్నారో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు.

నవంబర్‌ 18న అమెరికాలోని యుటాలో ఉన్న రెడ్‌కార్‌ ఎడారిలో వన్యప్రాణి విభాగ సిబ్బంది ఓ ఏకశిలను గుర్తించారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేసినట్లు ఉన్న ఆ నిర్మాణం త్రిభుజాకారంలో మెరుస్తూ కనిపించింది. జనసంచారంలేని ఆ ప్రాంతంలో దాన్ని ఎవరు పాతిపెట్టారో అధికారులకు అర్థం కావడం లేదు. అయితే ఆ శిల అకస్మాత్తుగా మాయమైంది. అది అదృశ్యమై 24 గంటలు గడవకముందే యూరోప్‌లోని రొమానియాలో అదే తరహా శిలను కొందరు గుర్తించారు. పెట్రోడోవా డేసియన్‌ కోట లాంటి ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రాంతంలో ఓ శిల పాతిపెట్టి ఉండటాన్ని గుర్తించి అధికారులకు తెలిపారు. ఆ స్తంభంపై అర్థం కాని రాతలు కూడా కనిపించాయి. అది కనగొనబడిన ప్రదేశంలో ఏ పనిచేయాలన్నా అధికారుల అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ అధికారులకు తెలియకుండానే ఆ శిలను ఎవరో పాతిపెట్టడం గమనార్హం.

అయితే కొద్దిరోజులు గడవకముందే ఆ శిల కూడా కనిపించకుండా పోయింది. ఎవరో దాన్ని తవ్వి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఆ వింత శిలను చూసేందుకు వెళ్లిన స్థానికులకు అక్కడ ఎలాంటి నిర్మాణం కనిపించలేదు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఇది గ్రహాంతరవాసుల పనేనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని