పేదరికం నుంచి పైపైకి
ఏడుగురు తోబుట్టువులు. తండ్రి దర్జీ. కుట్టుయంత్రం ఆడితేనే కూడు దొరికే నేపథ్యం. అయినా ఇవన్నీ కొడంగల్ కుర్రాడు ఆవుల సత్యకుమార్ ఎదుగుదలను ఆపలేకపోయాయి.

సత్యకుమార్ మొదట్నుంచీ చదువులో చురుకే. డిగ్రీకి వచ్చాక శాస్త్రవేత్త కావాలనే కల మొదలైంది. అందుకు లెక్చరర్ వీరయ్య మాటలే స్ఫూర్తినిచ్చాయి. పాటలు పాడినంత సులభంగా పాఠాలు బోధించే ఆయన, రసాయనశాస్త్రం ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. డిగ్రీ పూర్తయ్యాక పీజీ చేద్దామంటే ఇంట్లోంచి పైసా వచ్చే పరిస్థితి లేదు. స్కూళ్లొ పాఠాలు చెబుతూ, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ప్రవేశపరీక్ష రాశాడు. 49వ ర్యాంకుతో ఉస్మానియాలో కెమిస్ట్రీ సీటు సంపాదించాడు. ఆపై సీఎస్ఆర్ఐ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కి అర్హత సాధించి ఐఐసీటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నాడు. బిశ్వనాథ్దాస్ అనే ప్రొఫెసర్ పర్యవేక్షణలో యాంటీ క్యాన్సర్, యాంటీ మలేరియా ఔషధాలపై సింథసిస్ కెమిస్ట్రీలో పరిశోధనలు చేసి డాక్టరేట్ అందుకున్నాడు.
తర్వాత ప్రపంచంలోనే పురాతనమైన స్వీడన్‌లోని ఉప్సలా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసే అవకాశం వచ్చింది. అక్కడ యాంటీ హెచ్ఐవీ, యాంటీ టీబీ, యాంటీ క్యాన్సర్ ఔషధాలు మరింత సమర్థంగా పనిచేసే విధానంపై పరిశోధన చేశాడు. ఆ విశ్వవిద్యాలయం తరపున దక్షిణాఫ్రికాలో కొన్నాళ్లు పనిచేసి ఇండియా తిరిగొచ్చి ఓ ప్రైవేటు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. రెండేళ్లు పాఠాలు బోధించాక ఒమన్‌లోని మస్కట్ యూనివర్సిటీ ఆఫ్ నిజ్వాలో పరిశోధక శాస్త్రవేత్తగా చేరాడు. ప్రొఫెసర్ అల్ హరాసీ పర్యవేక్షణలో యాంటీ క్యాన్సర్ ఔషధాలపై, డ్రగ్ డిజైనింగ్, సింథసిస్ ఆఫ్ యాంటీ బయాటిక్ మాలిక్యుల్స్ మీద పరిశోధనలు చేస్తున్నాడు. ఒమన్‌లో పెరిగే ఒకరకమైన ఔషధ మొక్కల్లో ఫ్రాంకైటిస్ అనే జిగురు పదార్థం ఉంటుంది. కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా దీన్ని అభివృద్ధి పరిచి మొండి వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. పూట గడవడానికే కష్టమైన స్థితి నుంచి వచ్చి శాస్త్రవేత్తగా మారడం వెనక భార్య స్వాతి, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం ఉందని చెబుతున్నాడు.
|