close
Updated : 09/07/2021 19:31 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఈ చిన్నారి పాటకో ‘తాలియా’!

Photo: Instagram

మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ అందించగల శక్తి ఒక్క సంగీతానికే ఉందనడం అతిశయోక్తి కాదు. మరి అంతటి మహత్తు కలిగిన పాటలు రాయడమంటే మాటలు కాదు. ‘పాటలు రాయడం కూడా ఓ ప్రసవ వేదన లాంటిదే’.. అని ఓ సినీ కవి చెప్పినట్లు పదిమందిని మెప్పించే పాటలు రాయాలంటే భాషపై పట్టుతో పాటు మంచి సృజనాత్మకత, పాండిత్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇదే విషయం నిరూపిస్తోంది బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి. పాటలు రాస్తూ, వాటికి స్వయంగా ట్యూన్స్‌ కట్టడమే కాదు.. వినసొంపుగా పాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మూడో తరగతి చదువుతూ!

‘హెడ్‌ హెల్డ్‌ హై’ పేరుతో ఇటీవల పలు ఆన్‌లైన్‌ సంగీత వేదికల్లో విడుదలైన ఓ ఇంగ్లిష్‌ పాట సంగీత ప్రియుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ యాప్‌ ‘స్పాటిఫై’లో వెయ్యి మందికి పైగానే ఈ పాట విన్నారు. వెయ్యి మందే కదా అందులో గొప్పేముంది అని మీరు అనుకోవచ్చు.. కానీ ఈ పాట రాసింది, దానికి సంగీతం కట్టింది, పాడింది ఎనిమిదేళ్ల తాలియా జోస్‌. మరి, ఇంత చిన్న వయసులోనే తన ప్రతిభతో అంతమందిని ఆకట్టుకుందంటే విశేషమే కదా! చిన్నప్పుడు తల్లి సహాయంతో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు తన బహుముఖ ప్రజ్ఞతో పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం తాలియా మూడో తరగతి చదువుతోంది.

గర్భంలో ఉన్నప్పుడే!

తాలియా తల్లి అంజు చెరియన్‌ గర్భంతో ఉన్నప్పుడు పియానో వాయించడంతో పాటు పాటలు పాడడం సాధన చేసేదట. అలా అమ్మ కడుపులో ఉండగానే సంగీతంతో అనుబంధం ఏర్పరచుకున్న ఈ చిన్నారి రెండేళ్లు రాగానే పాటలు పాడడం ప్రారంభించింది. తనలోని సంగీత ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఐదేళ్ల వయసు రాగానే ఆ చిన్నారికి సంగీతంతో పాటు పియానో పాఠాలు కూడా నేర్పించారు. అలా సంగీతంపై పట్టు సాధించిన తాలియా కొన్ని రోజుల క్రితం స్వయంగా ఓ పాట రాసింది. దానికి చక్కటి సంగీతాన్ని జోడించి తన పియానో గురువుకు అందజేసింది. చిన్నారి సంగీత ప్రతిభకు ముగ్ధుడైన ఆయన ఆ పాటను రికార్డ్‌ చేసి ఈ ఏడాది జూన్‌లో విడుదల చేశారు. పలు సంగీత వేదికల్లో విడుదలైన ఈ పాట సంగీత ప్రియుల్ని తెగ ఆకట్టుకుంది. ఈ పాటకు మంచి స్పందన రావడంతో త్వరలోనే దీనికి సంబంధించిన మ్యూజిక్‌ వీడియోను విడుదల చేయాలనుకుంటోంది తాలియా కుటుంబం.

కరోనాతో ఆలస్యమైంది!

‘కరోనా వ్యాప్తి ప్రారంభం కాకముందే నా కూతురు ఈ పాట రాసింది. అయితే స్టూడియోలో రికార్డ్‌ చేస్తే బాగుంటుందని భావించాం. కానీ కరోనా మా ప్రణాళికలకు అడ్డుపడింది. చివరకు కొన్ని గ్యాడ్జెట్స్‌ సహాయంతో ఇంట్లోనే రికార్డ్‌ చేశాం. తాలియా పియానో గురువు ఈ పాటకు మరికొన్ని హంగులద్ది ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రకృతితో తనకున్న అనుబంధం, అనుభవాల సారమే ఈ పాట. ఇక మా అమ్మాయి పాడిన పాటలతో పాటు; తన అభిప్రాయాలు, ఆలోచనలను ఎప్పటికప్పుడు నా ఫోన్‌/ఐ ప్యాడ్‌లో రికార్డ్‌ చేస్తుంటాను. సంగీతంలోనే కాదు డ్యాన్స్‌, పుస్తక పఠనం, క్రీడలు, కుకింగ్‌, స్కేటింగ్‌, పెయింటింగ్‌లోనూ నా కూతురికి మంచి ప్రావీణ్యముంది..’ అంటూ తన చిన్నారి గురించి చెబుతూ మురిసిపోతోందా తల్లి.

ఆ పాటంటే ఇష్టం!

ఇక తన పాటకు వస్తోన్న స్పందనపై తాలియా మాట్లాడుతూ ‘నా మనసులో మెదిలిన ఆలోచనలన్నింటికీ అక్షర రూపమిస్తుంటాను. ఆ తర్వాత వాటికి చక్కటి సంగీతాన్ని జత చేస్తుంటాను. ఇక అమ్మానాన్నలిద్దరికీ సంగీతమంటే ఎంతో ఆసక్తి. దీంతో ఇంట్లో నిత్యం ఏదో ఒక పాట వింటూనే ఉంటాను. డిస్నీ క్లాసిక్స్‌తో పాటు ‘ఫ్రోజెన్’ సినిమాలోని ‘లెట్‌ ఇట్‌ గో’ నాకు బాగా ఇష్టమైన పాటలు. అయితే రోజురోజుకీ ఈ జాబితా పెరిగిపోతోంది. ‘ది గ్రేటెస్ట్‌ షో మ్యాన్‌’, ‘ఫ్రోజెన్‌-2’, ‘డిసెండంట్స్‌’ సినిమాల్లోని పాటలతో పాటు గ్రేస్‌ వాండర్‌ వాల్‌, ఏంజెలికా హేల్‌, అన్నే-మేరీ, అడెలె, టేలర్‌ స్విఫ్ట్‌, కేటీ పెర్రీ పాటలను కూడా బాగా వింటుంటాను’ అని చెప్పుకొచ్చిందీ మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్‌.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని