close
Updated : 05/09/2021 05:40 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

వారు చూపిన వెలుగుదారిలో...

నేడు ఉపాధ్యాయ దినోత్సవం

అక్షరాలు దిద్దించే అమృతహస్తం ఉపాధ్యాయులది! అంతటితో తన పని అయిపోయిందనుకోరే గురువూ! శిష్యులకు బతుకుబాటని నిర్మించి... వెలుగుదారినీ చూపించాలనుకుంటారు. అలా వారు చూపిన దారిలో నడిచి... ఉన్నత స్థానాల్లో నిలిచిన కొందరు ప్రముఖులు తమకు జీవితాన్నిచ్చిన గురువులని ఇలా స్మరించుకుంటున్నారు...


అమ్మే గురువు  - అభిలాష బిష్త్‌,
అదనపు డీజీపీ, ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్స్‌, తెలంగాణ

నాలో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు, సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా చేయడంలో నా గురువు పాత్రే కీలకం. దేహ్రాదూన్‌లోని ప్రఖ్యాత వెల్హామ్‌ గర్ల్స్‌ స్కూల్‌లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన శశి బిష్త్‌ మా అమ్మ. ఆ పాఠశాలలో సీటు దక్కించుకోవడం చాలా కష్టం. అదృష్టం కొద్దీ నాకక్కడ సీటు దొరికింది. 8 నుంచి 12 తరగతుల వరకు ఆ పాఠశాలలో చదవడంతో అమ్మ చెప్పే పాఠాలు వినగలిగాను. ఏదైనా పొరపాటు దొర్లితే మిగతా విద్యార్థులకు 2 మార్కులు తగ్గిస్తే.. నాకు మాత్రం 5 మార్కులు తగ్గించేది. ఏ విషయంలోనైనా సత్ఫలితాలు సాధించాలంటే సాధన ఒక్కటే ధ్యేయమని ఆమె స్పష్టంగా చెప్పేది. పదేపదే సాధన చేయడమొక్కటే సరైన మార్గమని చెప్పేది. అలాంటి బోధనలే నేను సివిల్స్‌ సాధించే విషయంలో స్ఫూర్తి నింపాయి. వాస్తవానికి ఆమె గణిత ఉపాధ్యాయురాలే అయినా ఆర్థిక స్వావలంబన గురించి విద్యార్థులకు ఎక్కువగా నూరిపోసేది. ముఖ్యంగా మహిళలకు ఆత్మవిశ్వాసంతోపాటు ఆర్థిక స్వావలంబన తప్పనిసరి అనేది. ఆ మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. అదే స్ఫూర్తితో నేను కళాశాలలో చదివే రోజుల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) సాధించగలిగా. ఆ తర్వాత ఎప్పుడూ ఇంటి నుంచి డబ్బు తీసుకోలేదు.


జీవిత సత్యాలను నేర్పాయి

- డాక్టర్‌ జయంతీరెడ్డి, ప్రముఖ గైనకాలజిస్ట్‌, జేజే హాస్పిటల్‌, హైదరాబాదు

నేను సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్లో చదివా. అక్కడ సైన్స్‌ టీచర్లు నన్ను చాలా ప్రభావితం చేశారు. సిస్టర్‌ టెరిసీనా, సుధాచంద్రన్‌, థామస్‌.. ఈ ముగ్గురూ 8 నుంచి 10వ తరగతి వరకూ మా సైన్సు టీచర్లు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది వీరే. క్లాస్‌లో ఒక ప్రశ్న అడిగి అందరి నుంచీ సమాధానాలు రాబట్టేది సుధాచంద్రన్‌ టీచర్‌. నన్ను మాత్రం ఆఖర్న అడిగేది. నా వంతు కోసం టెన్షన్‌గా చూసేదాన్ని. సమాధానం సరైందే అయితే అభినందించేది. తప్పయితే... ఫర్వాలేదు నువ్వు చెప్పగలవు.. మరోసారి ప్రయత్నించమని వెన్నుతట్టేది. అప్పటి ప్రిన్సిపల్‌ సిస్టర్‌ జెమ్మాను ఇప్పటికీ కలుస్తూ ఉంటా. ఇక డాక్టర్‌గా నన్ను తీర్చిదిద్దిన గురువులూ ఉన్నారు. గాంధీ వైద్యకళాశాలలో చదువుతున్నప్పుడు జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బన్సీలాల్‌ విగ్‌ నేర్పిన పాఠాలు కొత్త జీవిత సత్యాలను బోధించాయి. ‘రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారిని స్పృశించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నప్పుడే నీకు నిజమైన వైద్య బోధన అందుతుంది’ అని ఆయన చెప్పేవారు. ఎక్కువమంది రోగులను కలిసేలా ప్రోత్సహించేవారు. అదే మమ్మల్ని ఉత్తమ వైద్యసేవలందించే దిశగా నడిపించిందని నమ్ముతాను. అప్పట్లో మా గైనకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాలాంబ. ఆమె వల్లనే నేను గైనకాలజీలో ఒక స్థాయి వరకూ చేరుకోగలిగాను. మరో ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ జహాన్‌ దగ్గరుండి సర్జరీల్లో ఓనమాలు దిద్దించి, నా ఎదుగుదలకు తోడ్పడ్డారు. నేను వైద్యవిద్య బోధకురాలిగా మారిన తర్వాత విద్యార్థులతో ఎలా ఉండాలనేది నా గురువులు నాకు ముందే మార్గనిర్దేశం చేసేశారు. ఇప్పటికీ వారు చూపిన బాటలోనే నడుస్తున్నాను.


వాళ్లిద్దరూ ప్రత్యేకం

- శ్రీ దేవసేన, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు, తెలంగాణ

నా గురువుల్లో ఇద్దరిది ప్రత్యేక స్థానం. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్‌ అంటే ఇష్టమున్నా.. కాన్సెప్టు అర్థం కాకపోతే మాత్రం భయమేసేది. మా నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఆయనతోపాటు రామాచారి అనే ఆయనా పనిచేసేవారు. లెక్కల్లో సందేహాలను ఆయన్ని అడిగేదాన్ని. ఆయన ఈ సబ్జెక్టుపై ఆసక్తిని కలిగించడమే కాకుండా నాలో ఆత్మవిశ్వాసాన్నీ నింపారు. అదే ఇంటర్‌లో నేను స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకులో నిలవడానికి కారణమైంది. నిజాం కళాశాలలో డిగ్రీ చేసినప్పుడూ మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఉండేది. అప్పుడు మొయినుద్దీన్‌ అనే ప్రొఫెసర్‌ బోధించారు. ఆయన దగ్గర చదువు కంటే కూడా వ్యక్తిత్వం ఎలా ఉండాలనేది నేర్చుకున్నా. ఎంత పరిజ్ఞానమున్నా చాలా సామాన్యంగా, ఒద్దికగా ఉండేవారు. నేను ఐఏఎస్‌ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఎన్నికల పర్యవేక్షణ పని పడింది. బ్యాలెట్‌ బాక్సులను సర్దడానికి సిబ్బంది లేరంటూ అధికారులు ఒక పక్క గొడవ చేస్తున్నారు. ఇంతలో ఒకాయన బ్యాలెట్‌ బాక్సును తల మీద మోసుకుంటూ వస్తున్నారు. తీరా చూస్తే మా ప్రొఫెసరే. నేను సాయం చేస్తానన్నా, పనివాళ్లని పిలుస్తానన్నా. కానీ ఆయన... ‘ఇదీ నా పనిలో భాగమే! ఫర్లేదు’ అని మోసుకుంటూ వెళ్లిపోయారు. ఆయన్ని చూసి ఏ హోదాలో ఉన్నా, ఏ పని చేస్తున్నా బాధ్యతగా చేయాలన్న విషయాన్ని నేర్చుకున్నా. ఆయన పాటిస్తూ నాకు నేర్పిన పాఠమది. అందుకే ఏది చేసినా దీన్ని తప్పక గుర్తుంచుకుంటా, పాటిస్తా.


ఆ బంధం బాగుండాలి

- జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి,

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

‘గురువుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.పర్వతరావు, ఆయన భార్య లక్షీకాంతం ప్రభావం నా జీవితంపై ఉంది. ఆయన నిజాయతీ, నిబద్ధత, కష్టించే తత్వం నాపై చాలా ప్రభావం చూపాయి. పాఠశాల స్థాయి నుంచే ఉపాధ్యాయులతో నాకు అనుబంధం ఎక్కువ. నిజానికి గురువులు, విద్యార్థుల మధ్య అనుబంధం చాలా ముఖ్యం. ఉపాధ్యాయులను గౌరవించేలా పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. వారి మధ్య అనుబంధం ఏర్పడితే గురువులు చెప్పే పాఠాలను పిల్లలు సులువుగా అర్థం చేసుకోగలరు. మొదట్లో గురువులకు, విద్యార్థుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. ఆత్మీయతగా ఉండే వారు. ప్రస్తుతం ఆ అనుబంధం తగ్గుతోందనిపిస్తోంది. చదువు చెప్పే గురువులను గౌరవించాలని, వారు చెప్పే బోధన, సలహాలతో జీవితాలు మారతాయని బాల్యం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఏ ఉద్యోగీ పిల్లల జీవితాన్ని మార్చలేరు. గురువులు మాత్రమే విద్యార్థుల జీవితాన్ని మార్చగలరు. ఉపాధ్యాయులు బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించిన రోజు దేశం అద్భుతాలు సృష్టిస్తుంది. అన్ని రంగాల్లో ముందుంటాం. గురువుల ప్రభావం నాపై ఎక్కువ. వారి ఆశీర్వాద బలంతోనే ఈ స్థాయికి వచ్చా’.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని