close
Updated : 22/09/2021 20:34 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

PCOS: తొలి సంకేతాలివే!

ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌, సంతానలేమి, మూడ్‌ స్వింగ్స్‌.. ఈ సమస్యలన్నింటికీ మూలకారణం ఒక్కటే.. అదే పీసీఓఎస్‌! నిజానికి ఇవన్నీ సాధారణ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది మహిళలు. మరికొంతమందేమో.. ఈ సమస్యను ఏదో కళంకంగా భావించి నలుగురితో పంచుకోవడానికి సిగ్గుపడుతుంటారు. మన దేశంలో సుమారు 65 శాతం మందికి అసలు పీసీఓఎస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలియదని తాజా సర్వే చెబుతోంది. ఈ అవగాహన లోపమే ఎంతోమంది పాలిట శాపంగా పరిణమిస్తోందంటున్నారు నిపుణులు. అందుకే ఆదిలోనే కొన్ని సంకేతాల ద్వారా పీసీఓఎస్‌ను గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు. మరి, పీసీఓఎస్‌ను మొదట్లోనే గుర్తించే ఆ తొలి సంకేతాలేంటి? రండి.. తెలుసుకుందాం..!

అసలేంటీ సర్వే!

సెప్టెంబర్‌ను ‘పీసీఓఎస్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న తరుణంలో ‘Oziva’ అనే పోషకాహార సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది స్త్రీపురుషుల దగ్గర్నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే..!

* సుమారు 35 శాతం మంది మహిళలు తమకున్న పీసీఓఎస్‌ సమస్య గురించి ఎవరితోనూ పంచుకోవట్లేదట!

* 15 శాతం మంది ఈ సమస్య గురించి ఇతరులతో మాట్లాడాలనుకోవట్లేదని, 4.5 శాతం మంది దీన్ని ఓ కళంకం (Taboo)గా భావిస్తున్నట్లు చెప్పారు.

* 48 శాతం మంది మహిళలు పీసీఓఎస్‌ గురించి తమ భర్తల దగ్గర మాట్లాడడానికి విముఖత చూపుతున్నారని, అదే సమయంలో చాలామంది తమ తల్లులతో సమస్యను పంచుకోవడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు.

* తమకు పీసీఓఎస్‌ ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని 65 శాతం మంది చెప్పారట! అదే సమయంలో ఈ సమస్య లక్షణాల గురించి తమకు సరైన అవగాహన లేదని వెల్లడించినట్లు సర్వేలో తేలింది.

* ఇక 60 శాతం మంది పురుషులు తమకు అసలు పీసీఓఎస్‌ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పారట!

ఇలా అయితే అనుమానించాల్సిందే!

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ఆదిలోనే పీసీఓఎస్‌ను గుర్తిస్తే.. త్వరగా చికిత్స తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో శరీరంలో వచ్చే కొన్ని మార్పుల్ని తప్పకుండా గమనించాలంటున్నారు.

* నెలసరి అదుపు తప్పిందని భావిస్తే.. కచ్చితంగా అది పీసీఓఎస్‌ ఉందనడానికి ఓ సంకేతమే! ఈ క్రమంలో మధ్య వయసున్న మహిళల్లో 21 రోజుల్లోపు, 35 రోజుల తర్వాత నెలసరి రావడం, యుక్తవయసున్న అమ్మాయిల్లో 45 రోజుల రుతుచక్రం ఉన్నట్లయితే దాన్ని పీసీఓస్‌గా పరిగణించి నిపుణులను సంప్రదించాలి.

* పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా గర్భం దాల్చలేకపోవడం.. ఇది కూడా పీసీఓఎస్‌ వల్లే కావచ్చు! కాబట్టి దీన్ని నిర్ధరించుకోవడానికి డాక్టర్‌ని సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి.

* ఉన్నట్లుండి చర్మం జిడ్డుగా మారడం, మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు దట్టంగా పెరగడం (ముఖ్యంగా ముఖం, ఛాతీ, వీపు.. వంటి భాగాలపై వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి. దీన్ని Hirsutism అంటారు..), జుట్టు రాలడం.. ఇలాంటి సమస్యలు కూడా పీసీఓఎస్‌కు సంకేతాలు కావచ్చు!

* పీసీఓఎస్‌ ఉన్న వారిలో టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ! కాబట్టి రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినట్లనిపించినా అనుమానించాల్సిందే!

* శరీరంలో కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగినా అది పీసీఓఎస్‌ వల్ల కావచ్చు. కాబట్టి అనుమానించి చికిత్స తీసుకోకపోతే అది స్థూలకాయం, గుండె జబ్బులకు దారితీస్తుంది.

* మూడ్‌ స్వింగ్స్‌, ఒత్తిడి, ఆందోళనలు.. దరిచేరినా పీసీఓఎస్‌గా అనుమానించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే ఇవి క్రమంగా మానసికంగా మరింత కుంగదీసే ప్రమాదం ఉంటుంది.

* శరీరంలో హార్మోన్ల అసమతుల్యత క్రమంగా పీసీఓఎస్‌కు దారితీసి.. తలనొప్పికి కారణమవుతుంది. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా సమస్య ఉందో, లేదో నిర్ధరించుకోవాలి.

* పీసీఓఎస్‌ ఉన్న వారి శరీరంలో ఇన్సులిన్‌ నిరోధకత పెరుగుతుంది. ఇది Acanthosis Nigricans అనే సమస్యకు దారితీస్తుంది. అంటే.. చంకలు, మడతల వద్ద చర్మం నలుపు రంగులోకి మారడం మనం గమనించచ్చు.

నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

పీసీఓఎస్‌ సంకేతాలు కనిపించినా.. సమస్యను నిర్ధారించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

* దీర్ఘకాలం పాటు నెలసరి క్రమం తప్పడం వల్ల (ముఖ్యంగా ఏడాదికి మూడునాలుగు సార్లు మాత్రమే పిరియడ్స్‌ రావడం) అది ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

* క్రమంగా బరువు పెరిగిపోయి కొన్నాళ్లకు స్థూలకాయం బారిన పడచ్చు. తద్వారా ఆయాసం, నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు.. వంటివి తలెత్తచ్చు.

* ఎక్కువ రోజుల పాటు పీసీఓఎస్‌ను నిర్లక్ష్యం చేస్తే అది ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. తద్వారా తల్లి కావాలన్న ఆశలకు గండి పడచ్చు.. ఒకవేళ గర్భం వచ్చినా నిలిచే అవకాశాలు చాలా తక్కువ.

* దీర్ఘకాలం పాటు వేధించే పీసీఓఎస్‌ వల్ల మెటబాలిక్‌ సిండ్రోమ్‌ తలెత్తచ్చు. అంటే శరీరంలోని జీవక్రియల పనితీరు దెబ్బతిని గుండె జబ్బులు, గుండెపోటు, టైప్‌-2 డయాబెటిస్‌.. వంటి ప్రమాదకర సమస్యలు తప్పవు!

ఈ మార్పులే దివ్యౌషధాలు!

* పీసీఓఎస్‌ శరీరంలో దీర్ఘకాలిక వాపుకి కారణమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి ఆలివ్‌ నూనె, టొమాటో, ఆకుకూరలు, చేపలు, నట్స్‌.. వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి.

* పీసీఓఎస్‌ కారణంగా కొంతమంది మహిళల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది. ఇది రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వారు పాలకూర, గుడ్లు, బ్రకలీ, ఖర్జూరం.. వంటి ఐరన్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. అలాగే అత్యవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌ సప్లిమెంట్స్‌ కూడా వేసుకోవచ్చు.

* ప్రొబయోటిక్స్‌ పీసీఓఎస్‌ను అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే ఆండ్రోజెన్‌, ఈస్ట్రోజెన్‌.. వంటి లైంగిక హార్మోన్లను అదుపు చేస్తాయి. కాబట్టి ఈ పోషకాలు అధికంగా ఉండే పెరుగు, పచ్చళ్లు, ఛీజ్.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే డాక్టర్‌ సలహా మేరకు ప్రొబయోటిక్‌ సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు.

* చక్కటి పోషకాహారం, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకోగలిగితే నెలసరి అదుపులోకొస్తుంది. తద్వారా పీసీఓఎస్‌ కూడా అదుపులో ఉంటుంది.

వీటితో పాటు ఏడెనిమిది గంటల సుఖనిద్ర, ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం.. వంటి చిన్న పాటి చిట్కాలు పీసీఓఎస్‌ను అదుపులో ఉంచుకోవడానికి సులువైన మార్గాలు! కాబట్టి శరీరంలో కనిపించే ఈ సంకేతాల్ని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా గుర్తిస్తే.. పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవచ్చు. దీని కారణంగా ఇతర అనారోగ్యాలు చుట్టుముట్టకుండా జాగ్రత్తపడచ్చు.

అలాగే ఈ విషయంలో ఎలాంటి సందేహాలున్నా నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవడానికి అస్సలు వెనకాడద్దు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని