close
Updated : 08/07/2021 18:21 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఓ పక్క బాంబులు పేలుతుంటే అక్కడే ఈత కొట్టేది!

Photo: Instagram

చిన్నతనంలోనే ఈత కొలనులోకి దిగిన ఆమెకు ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది కల. దాన్ని సాకారం చేసుకొనే ప్రయత్నంలో ఆమె నిమగ్నమై ఉంది. అయితే అనుకోకుండా తమ దేశంలో పెచ్చరిల్లిన హింస.. బాంబుల చప్పుళ్లు.. తుపాకీ మోతలతో కాలం గడపాల్సిన పరిస్థితుల్లో తన లక్ష్యానికి దూరమైంది. బతుకంటేనే పోరాటం. ఆ పోరాటంలో గెలవాలంటే బతికుండాలి కదా.. అందుకే తమ వూరు విడిచిపెట్టి.. ప్రాణాలరచేత పట్టుకొని వేరే దేశానికి వలస వెళ్లిపోయింది. ఈ ప్రయాణంలో ఆమె చూపించిన తెగువ దాదాపు 20 మంది ప్రాణాలు కాపాడింది. ఇక తన ఒలింపిక్స్ కల నెరవేరదనే నిస్పృహలో ఉన్న ఆమెకు అనుకోకుండా ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆమే సిరియా నుంచి జర్మనీకి వలస వచ్చిన శరణార్థి యుస్రా మర్దిని.

శరణార్థుల ఆశలకు ప్రతీకగా!

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ ఈ క్రీడాకారిణి 2016 ఒలింపిక్స్‌లో తొలి శరణార్థుల జట్టు తరఫున స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగింది. పతకం గెల్చుకోకపోయినా తన పోరాట పటిమతో పలువురి ప్రశంసలు అందుకుంది. ఈక్రమంలో తనలాగే ప్రాణాలరచేత పట్టుకొని వలస వచ్చిన ఎంతోమంది శరణార్థుల ఆశలకు ప్రతీకగా నిలిచిందీ యువ స్విమ్మర్‌. ఇప్పుడు మళ్లీ టోక్యో వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌లో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతోంది. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లెన్నో..!

ప్రాణాలు దక్కించుకోవడానికి..

సిరియాలోని డమాస్కస్‌లో పుట్టి పెరిగిన యుస్రా మర్దిని మూడేళ్ల వయసు నుంచే ఈత కొట్టడం ప్రారంభించింది. ఆమె తండ్రి స్మిమ్మింగ్ కోచ్ కావడంతో ఆయన శిక్షణలోనే ఆరితేరింది. మర్దినితో పాటు ఆమె చెల్లి సారా కూడా ఈతలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. జాతీయ స్థాయి పోటీల్లో రాణించడం ఆరంభించిన మర్దిని.. 2012లో సిరియాలో జరిగిన ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో సైతం పాల్గొంది. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని, పతకం సాధించాలని ఆశయంగా పెట్టుకుందామె. అయితే ఇంతలోనే సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. ఐసిస్‌ ఉగ్రవాదుల కారణంగా సిరియాలో ఎంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఇక్కడి అంతర్యుద్ధం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. యుస్రా మర్దిని కుటుంబం కూడా అంతే..! బాంబుదాడిలో సర్వస్వం కోల్పోయిన యుస్రా తన చెల్లి సారాతో కలిసి ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రీసు బయలుదేరింది.

18 మందిని కాపాడడం కోసం!

యుస్రా, సారాతో పాటు మరో ఇరవై మంది కూడా గ్రీసుకి బయలుదేరారు. తమ ఊరి నుంచి లెబనాన్, ఆ తర్వాత టర్కీ చేరుకున్నారు. టర్కీ నుంచి గ్రీసుకి పడవలో బయలుదేరారు. ఆ పడవ సామర్థ్యం 20 మంది కానీ 22 మంది అందులో ఎక్కారు. అధిక భారం వల్ల అది ఏక్షణంలోనైనా మునిగిపోయేలా కనిపిస్తోంది. దీనికి తోడు తీవ్ర గాలులు, రాకాసి అలలు సవాలుగా మారాయి.. దీంతో పడవలోకి నీళ్లు రావడం ప్రారంభమైంది. అయితే ఈత వచ్చిన యుస్రా.. తన చెల్లి సారాతో పాటు ఈత వచ్చిన మరొక వ్యక్తి సముద్రంలోకి దూకారు. ఈతకొలనులో ఈత కొట్టడానికి సముద్రంలో ఈత కొట్టడానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇతరుల ప్రాణాలు దక్కించడానికి వారలా చేశారు. ఉప్పు నీటికి కళ్లు మండుతున్నా.. శరీరం నీరసించిపోతున్నా.. పడవను మాత్రం ఒడ్డుకి చేర్చేంతవరకు ఈత కొడుతూనే ఉన్నారు. ఆ తర్వాత గ్రీసు నుంచి 1000 మైళ్ల దూరం ప్రయాణించి జర్మనీలోని బెర్లిన్ చేరుకున్నారు. వారు నడక, బస్సు, రైలు ద్వారా అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రయాణం పూర్తవడానికి పట్టిన సమయం సుమారు 25 రోజులు.

ఆశలు ఆవిరైన వేళ..

బెర్లిన్‌లోని శరణార్థుల శిబిరంలో తలదాచుకున్న యుస్రాకి తన కుటుంబానికి దూరమయ్యానన్న బాధతో పాటు ఆమె ఒలింపిక్స్ కల ఎప్పటికీ నెరవేరదనే దిగులు కూడా ఎక్కువైంది. అయితే అక్కడి ఓ స్థానికుడు మర్దిని గురించి తెలుసుకొని ఆమెను స్థానిక కోచ్‌కి పరిచయం చేశాడు. అలా ఆమె తిరిగి స్విమ్మింగ్‌పూల్‌లో అడుగుపెట్టింది. అక్కడ ఆమె ప్రతిభను చూసిన కోచ్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 2012 తర్వాత మర్దిని ఈత కొట్టింది లేదు. దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి ఈత కొడుతున్నా.. ఆమె డైవింగ్, స్విమ్మింగ్‌లో నైపుణ్యాన్ని గమనించిన ఆయన మర్దినిని అందులో మరింత నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దారు.

శరణార్థుల జట్టులో..

తనకు ఇల్లు, దేశం.. రెండూ లేవు కాబట్టి ఇక ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యమని భావించింది మర్దిని. అయితే కాంగో, సూడాన్, సిరియా వంటి కల్లోలిత ప్రాంతాల నుంచి ప్రాణాలరచేత పట్టుకొచ్చిన వారిలో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులుండటం గమనించింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ). శరణార్థుల ఆశలకు వారు ప్రతినిధులుగా నిలబడాలనే ఉద్దేశంతో ఐఓసీ.. 2016 రియో ఒలింపిక్స్‌లో శరణార్థుల కోసం ప్రత్యేక జట్టుని ఏర్పాటు చేసింది. దీంతో యుస్రాలో ఒలింపిక్ ఆశలు మళ్లీ చిగురించాయి. స్విమ్మింగ్‌లో తనదైన రీతిలో రాణించిన ఆమె.. ఒలింపిక్ కమిటీ ప్రాథమికంగా ఎంపిక చేసిన నలభైమందిలో చోటు దక్కించుకుంది. అప్పటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే!

పతకం గెలవకపోయినా!

గత ఒలింపిక్స్‌లోనే ప్రపంచంలోనే మేటి అనిపించుకున్న స్విమ్మర్లతో పోటీపడింది యుస్రా మర్దిని. సెమీస్‌కు ముందే తన పోరాటపటిమను ముగించినా విలేకరులు, ఫొటోగ్రాఫర్లు అందరూ ఆమె ఫొటోల కోసం ఎగబడ్డారంటే అందుకు ఆమెలో ఉన్న పోటీతత్వమే కారణం! అంతేకాదు.. పడవ మునిగిపోతుంటే సముద్రంలోకి దూకి 20 మందిని కాపాడిన ధీర ఆమె.

‘మా దేశంలో ఈతకొలనులో సాధన చేస్తున్నప్పుడు ఒక్కోసారి అనుకోకుండా బాంబు వచ్చి కొలనులో పడేది. అది ఎక్కడ పేలుతుందోనని ప్రాణభీతితో భయపడి పరిగెత్తేదాన్ని. ఇలా ఒక్కసారి కాదు.. నాలుగైదు సార్లు జరిగింది.. అదో భయంకరమైన అనుభవం. ఇక గత ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకోకపోయినా అందులో పాల్గొనడమే నాకు బంగారు పతకం సాధించినంత ఆనందాన్నిచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం కచ్చితంగా మెడల్‌ సాధిస్తానన్న గట్టి నమ్మకం ఉంది..’ అంటోంది యుస్రా. ఇలా తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు మళ్లీ పూల్‌లోకి దిగనుంది.

వెండితెరపై ఆవిష్కరించేందుకు!

తన పట్టుదలకు గుర్తింపుగా 2016లో టైమ్స్‌ పత్రిక ప్రకటించిన అత్యంత ప్రతిభావంతులైన 30 మంది టీనేజర్లలో ఒకరిగా స్థానం సంపాదించింది యుస్రా. అదేవిధంగా వివిధ దేశాల్లో శరణార్థులైన వారి సంరక్షణ, భద్రత కోసం ఏర్పాటైన సంస్థ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్‌(యూఎన్‌హెచ్‌సీఆర్‌)కు 2017లో గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపికైందీ యంగ్‌ సెన్సేషన్‌. తద్వారా అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది. ఈక్రమంలో యూఎన్‌హెచ్‌సీఆర్‌ తరఫున ‘Google Zeitgeist’, ‘WE Day’, ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’ వంటి ప్రతిష్ఠాత్మక సదస్సుల్లో తన గళాన్ని వినిపించిందీ యువ స్విమ్మర్‌.

ఇక యుస్రా స్ఫూర్తిదాయక జీవితానికి అక్షరరూపమిస్తూ ‘Butterfly: From Refugee To Olympian- My Story Of Rescue, Hope and Triumph’ అనే పేరుతో 2018లో ఓ పుస్తకం కూడా విడుదలైంది. ప్రస్తుతం ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని