close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందమా... అందుమా!

నసు సౌందర్య అన్వేషి. బుద్ధి సౌందర్య ఉపాసి. దేహం సౌందర్య పిపాసి. ‘అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా...’ అనుకొంటూ అనుక్షణం మనసు సౌందర్యాన్వేషణలో మునిగి తేలుతుంది. దశదిశలా దర్శించిన మహా సౌందర్య విభూతిని ఉపాసిస్తుంది- బుద్ధి. అందాన్ని సొంతం చేసుకొని బాహ్య ఇంద్రియాల అనుభవంలోకి తెచ్చుకోవాలనే పిపాస (తీరని దాహం) దేహానిది. దృక్కోణాలు వేరైనా అందమంటే అందరికీ ఆసక్తేనన్నది దీని సారాంశం. ఏం చేసినా ‘అందంగా’ చేయాలన్నది మనిషి భావన. ఏం రాసినా ‘అందంగా’ రాయాలని కవుల తపన. కంద పద్యాలో వంద రాయాలనిపించినప్పుడు  ‘అందంగా మధురస నిష్యందంగా’ అవి రూపొందాలని మహాకవి శ్రీశ్రీ ఆరాటపడ్డారు. ఎవరైనా బాగా మాట్లాడితే ‘అందంగా’ చెప్పారంటుంది లోకం. చివరకు ‘ఇందుగలదందు లేదను సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే గలదందము’ అనే భావం స్థిరపడింది. రుచిర చారు సుషమ శోభ కాంత మనోజ్ఞ మంజుల మోహన సోయగ లావణ్య... వంటి మాటలు ఎన్నింటినో అందానికి పర్యాయపదాలుగా అమర్చింది అలంకార శాస్త్రం. ‘సుందరస్య భావః సౌందర్యమ్‌’ అంటూ నిర్వచించింది. సౌందర్యానుభూతి అనిర్వచనీయమని తేల్చింది. మొత్తానికది లోకంలో ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అన్నట్లుగా స్థిరపడింది. సృష్టిలో అందాన్నంతటినీ పోగేసి ‘అహల్య’ను సృష్టించాడు బ్రహ్మదేవుడు. విశ్వనాథ మాటల్లో ‘పృతనాసాహుడు(దేవేంద్రుడు) వేయి యేడులుగ స్వామీ! నన్ను కాంక్షించెడున్‌’ అంటూ పొంగిపోయిన అహల్య సోయగానికి తక్కినవారెవరూ దాసోహమన్న దాఖలాలు కనపడవు. అప్సరసల అతిశయాన్ని దూరం చేయాలని విష్ణువు అనుకొన్నప్పుడు, ఆయన ఊరువుల(తొడల)నుంచి ఊడిపడిన మహా లావణ్యరాశి- ఊర్వశి. ఆమె అందం పురూరవుడి డెందాన్ని ఉర్రూతలూపిందే గాని, అర్జునుడి అనుగ్రహానికి నోచుకోనే లేదు. 

గొప్ప మేధావిగా పేరొందిన జార్జి బెర్నార్డ్‌షాకు పెద్దల విందులో అందమైన సినీనటి తారసపడింది. షాను చూడగానే ఆమెకు మెరుపులా ఓ ఆలోచన తోచింది. ‘మనం పెళ్ళాడితే మన పిల్లలకు మీ తెలివితేటలు, నా అందం జతపడతాయి. అది అద్భుతం కదా!’ అని ప్రతిపాదించింది- ఆ రెండూ  జన్యుపరమైనవి కాబట్టి!  అందుకే, షా నవ్వుతూ ‘మీ తెలివితేటలు, నా అందం వస్తే మరి వారి గతేమిటి?’ అని తనదైన శైలిలో చమత్కరించాడు. సహజసిద్ధంగా సంక్రమించే రూపురేఖలను జనం అంగీకరించలేకపోవడమే అసలైన సమస్య. ‘మనకు ఉన్నదాన్ని ఎదుటివారి కళ్లలోంచి చూడాలనుకోవడం మనిషి బలహీనత’ అన్నాడు షేక్‌స్పియర్‌. ఇంట్లో సాధారణంగా ఉండే మనం గడప దాటేటప్పుడల్లా మొహానికి అదనపు హంగులు అద్దుకోవడం కద్దు! ‘అందమంటే ఇదే’ అని తేల్చి చెప్పడం కుదరదు. బొత్తిగా నచ్చలేదంటూ మనం సంబంధాన్ని కాదనుకొంటామా, అదే పిల్ల మరో గుండెలో హాయిగా దీపం పెడుతుంది. ‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అనే లోకోక్తి అందుకే పుట్టుకొచ్చింది. కరోనా కాలంలో వర్చువల్‌ సమావేశాలు పెరిగాకా తమ అందం పట్ల ఆందోళనకు గురవుతున్న ఆడామగా గమనించవలసిన విషయాలివి. సహజంగా ఉండటమే నిజమైన అందమనే సత్యాన్ని మరిచిపోయి, చాలామంది ఆత్మన్యూనతకు లోనవుతున్నారని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ఈ సమస్యకు ‘జ్యూమ్‌ డిస్మార్ఫియా’ అని  పేరుపెట్టారు. ‘మందహాసమ్ములో మహనీయతను జూపె ముగ్ధమోహన మూర్తి మోనలీస!’ అనే వాక్యంలోని భావం బోధపడితే అందానికి అసలైన చిరునామా తెలుస్తుంది. ‘సౌందర్యానుభూతి పూర్తిగా మానసికం’ అని తేల్చిచెప్పిన ప్రముఖ ఆంగ్ల రచయిత క్రిస్టఫర్‌ కాడ్వెల్‌ పలుకులను గుర్తుచేసుకోవలసిన సందర్భమిది.

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.