close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డిజిటల్‌ వేదికపై ఎన్నికల ప్రచారం

భారతావనిలో ఎన్నికలంటే, ప్రధానిగా వాజ్‌పేయీ చెప్పినట్లు- జనస్వామ్య కుంభమేళా! జన సమూహాలపై కర్కశంగా విరుచుకుపడే కరోనా మహమ్మారి భయానకంగా కోరచాస్తున్న వేళ- ఏ స్థాయి ఎన్నికల నిర్వహణ అయినా కత్తిమీద సామే కదా! దాదాపు 10,600 కేసులు, 220 మరణాలతో వాతావరణం భయోద్విగ్న భరితంగా ఉన్న ఏప్రిల్‌ నెలలో దక్షిణ కొరియా సార్వత్రిక ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించింది. దాన్ని ఆదర్శంగా తీసుకున్న భారత ఎన్నికల సంఘం వచ్చే అక్టోబర్‌-నవంబర్‌ నాటి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు పూర్వరంగం సిద్ధం చేస్తోంది. ఓటర్లు భౌతిక దూరం నిబంధనల్ని పాటించగలిగేలా పోలింగ్‌ కేంద్రాల సంఖ్య రెట్టింపు చెయ్యడం, 65 ఏళ్లు దాటినవారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగ సదుపాయం వంటి సంస్కరణల్ని ఈసీ చేపట్టడానికి పొంచి ఉన్న కొవిడ్‌ ముప్పే కారణం. అననుకూల వాతావరణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఆధునిక సాంకేతికతను ఆశ్రయిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. సాధారణ పరిస్థితుల్లో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలంటూ లక్షల మంది జన సమీకరణతో మింటినీమంటినీ ఏకం చేసే పార్టీలు- డిజిటల్‌ సాంకేతికత దన్నుతో వర్చువల్‌ వేదికల్ని ఆశ్రయిస్తున్నాయి. బిహార్లోని 243 నియోజక వర్గాల్లోనూ వర్చువల్‌ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వచ్చే నెల తొలివారంలో అదే తరహాలో పది లక్షలమందికి తన సందేశం అందేలా ర్యాలీ నిర్వహించనున్నారు. ‘కరోనాపై పౌరసమాజం ఉమ్మడి పోరు’ను లక్షించి భాజపా తలపెట్టిన 75 వర్చువల్‌ ర్యాలీల్లో మొట్టమొదటిది బిహార్లో కమలనాథుల ప్రచార సరళికి నెల రోజులనాడే అద్దం పట్టింది. ఓటుకోసం కాలం చెల్లిన మోటు పద్ధతుల్నే పట్టుకు పాకులాడుతున్న పార్టీలన్నీ నాగరిక ప్రచార పంథాకు మళ్లాల్సిన అవసరాన్ని కరోనా కల్పించింది!

ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల సాంకేతికత భారతదేశంలో ఎన్నికల రూపురేఖల్ని గణనీయంగా మార్చేసింది. పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ వంటి అక్రమాలకు దానితో తెరపడగా, సుగమ్‌ పోర్టల్‌ ద్వారా రాజకీయ పార్టీలకు అవసరమైన అనుమతులు, సమాధాన్‌ పోర్టల్‌ వినియోగంతో ఫిర్యాదుల పరిశీలనలను ఈసీ సులభతరం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, ‘సీ విజిల్‌’ యాప్‌ ద్వారా పౌర ఫిర్యాదుల స్వీకరణలతో నిర్వాచన్‌ సదన్‌ ముందంజ వేస్తోంది. భారత ప్రజాస్వామ్యానికి మాతృకగా భావించే యూకేలో 2015, 2017 ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ట్విటర్‌ వినియోగానికి పెద్దపీట వేశాయి. అరవయ్యో దశకం నుంచి టీవీల్ని ప్రభావాన్విత మాధ్యమంగా వినియోగించుకొంటూ అమెరికా పురోగమిస్తోంది. అదే ఇండియాలో- దుమ్ము రేపే ప్రచారార్భాటమే లక్ష్యంగా కోట్లు వెదజల్లి లక్షల్లో జనాన్ని సమీకరించే పార్టీలు భారీ సభలకు వారిని తరలించే క్రమంలో చేసే వీరంగాలకు హద్దూఆపూ ఉండదు. బిర్యానీ పొట్లాలు, మందు బాటిళ్లు, డబ్బులు ముట్టజెప్పి అట్టహాసంగా జనశ్రేణుల్ని తరలించినా- నేతల ప్రసంగాల్ని వారు ఆలకిస్తారనిగాని, ఎన్నికల్లో ఓటేస్తారనిగాని ఏ పార్టీకీ భరోసా లేదు. అలాంటప్పుడు స్వయంగా వ్యయప్రయాసల కోర్చి, సాధారణ పౌరజీవనాన్నీ తీవ్రంగా ఇబ్బందుల పాలుచేసే బూటకపు బలనిరూపణలు ఎవర్ని ఉద్ధరించడానికి? దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య 50 కోట్లు దాటిపోయింది. టీవీలు, సామాజిక మాధ్యమాల విస్తృతి సంగతి చెప్పేదేముంది? ఈ నేపథ్యంలో ఆటవిక ప్రచార పంథాలకు పార్టీలన్నీ చెల్లుకొట్టి, డిజిటల్‌ ప్రసార మాధ్యమాలే వేదికగా ఓటర్లను ఆకట్టుకొనే వ్యూహాలకు సానపట్టాలి. ప్రసార సాధనాలే రాజకీయ ప్రయోజన సాధకాలన్న ప్రాప్తకాలజ్ఞత పార్టీల్లో మొగ్గతొడగాలి!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.