close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాదక మహమ్మారి

కోట్లాది జీవితాల్ని, అసంఖ్యాక తల్లిదండ్రుల ఆశల్ని ఆకాంక్షల్ని కర్కశంగా చిదిమేస్తున్న మాదకద్రవ్య మహమ్మారి- కొవిడ్‌ పెను సంక్షోభం వేళ మరింతగా విజృంభిస్తోంది. కస్టమ్స్‌, డీఆర్‌ఐ (డైరెక్టొరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌) ముంబయిలో సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 190 కిలోలకు పైగా హెరాయిన్‌ తాజాగా పట్టుబడింది. ఆ సరకును అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా ముంబయి చేరవేయడంలో తీసుకున్న జాగ్రత్తలు నిఘా సిబ్బందినే నిర్ఘాంతపరచాయి. వెదురు బొంగుల్లా భ్రమింపజేస్తూ రంగులు వేసిన ప్లాస్టిక్‌ గొట్టాల లోపల దాచిపెట్టిన హెరాయిన్‌ విలువ అక్షరాలా వెయ్యికోట్ల రూపాయలు. ముంబయినుంచి ప్రధాన మెట్రో నగరాలకు గతంలోనూ ఇలాగే ఘరానా స్మగ్లింగ్‌ జరిగిందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయన్న కథనాలు- మరెంత భూరి పరిమాణంలో హెరాయిన్‌ నిర్దేశిత లక్ష్యాలకు చేరిపోయిందోనన్న భయానుమానాలు రేకెత్తిస్తున్నాయి. గత జనవరిలో అమృత్‌సర్‌ జిల్లాలో పెద్దయెత్తున మాదక ద్రవ్యాలు దొరికినప్పుడు ఒక అఫ్ఘాన్‌ జాతీయుడు, ఓ మహిళ సహా ఆరుగురు అరెస్టయ్యారు. సరికొత్త స్మగ్లింగ్‌ బాగోతంలోనూ బయటపడ్డ అఫ్ఘాన్‌ పౌరుల ప్రమేయం, పోనుపోను మాదక భూతం ఎంతగా జడలు విరబోసుకుంటున్నదీ కళ్లకు కడుతోంది. పాక్‌నుంచి డ్రోన్ల సాయంతో దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా ఉదంతాలు, బిట్‌కాయిన్లతో విదేశాలనుంచి కొరియర్ల ద్వారా పంపిణీ ఘటనలు- ఉత్పాత తీవ్రతను ధ్రువీకరిస్తున్నాయి. కరోనా వైరస్‌ రెచ్చిపోతున్న దశలో యంత్రాంగం దృష్టి తమమీద నుంచి పక్కకు మళ్ళిందన్న ధీమా మాఫియా ముఠాల్లో నెలకొన్నట్లు ఇటీవలి ఘటనలు చాటుతున్నాయి. కొత్తకొత్త మార్గాల్లో చాపకింద నీరులా విస్తరిస్తూ పోతున్న మాదక ముఠాలపై ప్రభుత్వాలు ఏ మాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా, జాతి భారీ మూల్యం చెల్లించక తప్పదు!

విద్యార్థి దశలోనే వ్యసనపరుడు పుడతాడన్నది మానసిక వైద్యులు (సైకియాట్రిస్టులు) తరచూ చెప్పే మాట. ప్రత్యక్ష లావాదేవీలు, సంకేతభాషతో పంపిణీల దశ దాటి డీప్‌వెబ్‌, డార్క్‌నెట్‌ వెబ్‌సైట్ల సాయంతో క్రయవిక్రయాలు పెచ్చరిల్లడం- పురాతన చట్టం అసమర్థతకు, నార్కోటిక్స్‌ నియంత్రణ వ్యవస్థ పరిమితులకు తిరుగులేని దాఖలా. ప్రధానంగా యువత, విద్యార్థులు మత్తుకు బానిసలై అక్రమ రవాణాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న వైనం దిగ్భ్రాంతపరుస్తోంది. పదేళ్ల వ్యవధిలో రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు ప్రభృత రాష్ట్రాల్లో 50 లక్షల కిలోలకుపైగా మాదకద్రవ్యాలు వశపరచుకున్నట్లు ఆమధ్య ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ తరవాతా ఉరవడి తగ్గలేదు. పట్టుబడుతున్నవి వాస్తవ సరఫరా పరిమాణంలో పిసరంతేనన్న విశ్లేషణలు ప్రమాద విస్తృతిని చాటేవే. ఇండియాలో 15 శాతం ప్రజలు లిక్కరు మత్తులో తూలుతుండగా, మాదకద్రవ్య వ్యసనపరుల సంఖ్య మూడుకోట్లకు పైబడిందని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 272 జిల్లాలు డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకున్నట్లు కేంద్రం చెబుతుండగా- సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేయాల్సిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీస్‌ విభాగాలమధ్య సమన్వయరాహిత్యం మాదకశక్తులకు అయాచితవరమవుతోంది. కాంబోడియా, వియత్నాం, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటివి మాదక పదార్థాల వినియోగం, ఉత్పత్తి, నిల్వ, వ్యాపారాలకు పాల్పడితే మరణదండన విధిస్తున్నాయి. దేశీయంగా మాదక నేరగాళ్లకు పదేళ్లదాకా జైలు, లక్ష రూపాయల వరకు జరిమానా, మళ్ళీ మళ్ళీ నేరాలకు తెగబడితే జీవిత ఖైదు విధించగల వీలున్నా- కొరమీనుల్లా తప్పించుకుపోతున్నవారి సంఖ్యే అధికం. ఒకర్ని హతమారిస్తేనే మరణశిక్ష విధించే దేశంలో, యువశక్తిని వ్యసనాలకు బలిచేస్తున్న మాదక ముఠాలను తేలిగ్గా ఉపేక్షించడమేమిటి? ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంఘటిత కృషికి నిబద్ధమైతేనే- ఈ సామాజిక ఆర్థిక సంక్షోభం తాలూకు దారుణ విషప్రభావం నుంచి ఎంతో కొంత ఉపశమనం దక్కేది!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.