close

సంపాదకీయం

మార్గ నిర్దేశకులు

అధికారం అహంకారానికి తల్లిపేగు. అహంకారం మనిషికి పతనహేతువు. మదం అనే మాటకు అహంకారమనే అర్థం ఉంది. ‘ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ చూచి...’ దుర్యోధనుడు తలపెట్టిన దురాగతానికి మొత్తం వంశమే తుడిచిపెట్టుకుపోయింది- అది మహాభారతంలో! ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆరణాల కూలీపట్ల ప్రదర్శించిన దురహంకారం ఓ పార్టీ చిరునామానే గల్లంతు చేసింది- ఇది మన భారతంలో! కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. సత్యహరిశ్చంద్ర నాటకంలో ‘కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగన్‌’ అని బలిజేపల్లి లక్ష్మీకాంతకవి చెప్పిందే నిత్యసత్యం. నడమంత్రపు అధికార సిరి నగుబాటుకు కారణం కాకూడదనుకొంటే, ఆ సత్యం గుండెల్లో లోతుగా నాటుకోవాలి. నడమంత్రపు సిరి, నరాలమీద కురుపు మనిషిని కుదురుగా ఉండనీయవన్నారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. అహంకారం బుర్రకెక్కి విర్రవీగినవారి చరిత్రలు కాలగతిలో కరిగిపోతాయి. జాతి జ్ఞాపకాల్లోంచి చెరిగిపోతాయి. ‘అధికారాంతమునందు చూడవలెగా ఆ అయ్య సౌభాగ్యముల్‌’ అన్న కవివాక్కు- వారి విషయంలో నిజం అవుతుంది. దీన్ని ఎరిగినవారు వివేకవంతులు. ‘మీ గుర్తింపు చిహ్నం ఏది’ అని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్ గుమ్మంలో నిలదీస్తే ‘నేనెవరో తెలుసా’ అనలేదు నెహ్రూ.  ‘ఆమె ఎవరో తెలుసుకోండి’ అన్నారు మెచ్చుకోలుగా! డ్రైవర్‌ కారు తలుపుతీసి పట్టుకొంటే ‘నేనిప్పుడు రైల్వేమంత్రిని కాను’ అనేసి నింపాదిగా ఇంటికి నడిచి వెళ్లిపోయారు లాల్‌ బహదూర్‌ శాస్త్రి. చీరాలలో సమావేశానికి సమయం మించిపోతోందని కంగారు పెడుతుంటే ‘ఉండండ్రా... ఇంకో రెండుకుట్లు ఉండిపోయాయి’ అంటూ చిరిగిన చొక్కాను కుట్టుకుంటూ బయటికొచ్చారు- అప్పట్లోనే దేశానికి కోట్లు ధారపోసిన ప్రకాశం పంతులు.
పుచ్చలపల్లి సుందరయ్యనో, వావిలాల గోపాలకృష్ణయ్యనో, టంగుటూరి ప్రకాశాన్నో తెలుగుజాతి ఎప్పటికీ ఎందుకు స్మరిస్తుందంటే- వారు పాలకులుగాకాక ప్రజాసేవకులుగా, నిరాడంబరంగా జీవించారు కాబట్టే! ప్రకాశం పంతులు గతించి ఇన్నేళ్లయినా, మొన్నటికి మొన్న 20వ తేదీన ‘సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమునందు హోమమ్మొనర్చిన సోమయాజి’ అంటూ జాతి నివాళులు అర్పించడాన్ని చూస్తే ‘కీర్తిశేషులు’ అనే మాటకు అర్థం ఏమిటో తెలిసొస్తుంది. ‘పావనమయ్యె జీవనము...’ అన్న పద్యానికి తాత్పర్యం బోధపడుతుంది. ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌ బారినపడిన బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు మృత్యుస్పర్శ అనుభవానికి వచ్చింది. ఒకవేళ మరణిస్తే ఆ వార్తను ఎలా ప్రకటించాలో కసరత్తు కూడా జరిగిందని ఆయనే వెల్లడించారు. వైద్యుల నైపుణ్యం కారణంగా చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్రాణదాతలను నిత్యం స్మరించేలా- అదే సమయంలో పుట్టిన తనబిడ్డకు వారి పేర్లు పెట్టుకొన్నారు. ఆ కృతజ్ఞతా భావాన్ని ప్రపంచం హర్షించింది. మనజాతి ఆలోచనా రీతి అంతకన్నా సలక్షణమైనది. దేశానికి స్వరాజ్యం సిద్ధించిన కొత్తల్లో పుట్టిన పిల్లలకు చాలామంది గాంధీ, జవహర్‌, ప్రకాశం వంటి పేర్లు పెట్టి గర్వపడ్డారు. ‘కాలంబెంత గతించిపోయినను కానీ...’ ఆ పేర్లు నిత్యం స్మరించుకొనేలా చూశారు. తమ పిల్లలు ఆ నాయకులంతటివారు కావాలన్న ఆశయంతో, ఆశాభావంతో కృతజ్ఞతాపూర్వకంగా చేసిన పని అది. ఇప్పటి నేతాగణం నేర్చుకోవలసిందదే. ఆ నాయకుల కథలు ఉపన్యసించడం కోసం కాదు- ఉపాసించడం కోసం; వారి చైతన్యాన్ని ఆవాహన చేసుకోవడం కోసం! ‘పూని ఏదైనాను ఒక మేల్‌, కూర్చి జనులకు చూపవోయ్‌’ అన్న మహాకవి సందేశాన్ని నేతలు ఆకళించుకోవాలి. ఆ త్యాగధనుల జీవకళను ఇంకించుకోవాలి. అప్పుడే అహంకారం మనిషికి అలంకారం కానేకాదని తెలుస్తుంది. భావితరాలకు తమ జీవితం ఆదర్శంగా నిలుస్తుంది.

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.