close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విలువల పొదరిల్లు

పురుషుడు తన జీవితకాలంలో కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించవలసి ఉంటుంది. స్త్రీ పాత్ర పోషణ మరింత సునిశితమైనది, సున్నితమైనది. ఆమెది ఒకరకంగా అ(క)ష్టావధానమే. ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక’ అని పోతనకవి చెప్పినట్లు ఒకే మనిషి నుంచి వివిధ చుట్టరికాల్లో రకరకాల వ్యక్తిత్వాలు, ఎన్నో రకాల ప్రవర్తనలు తొంగి చూస్తాయి. కాబట్టే సామాజిక శాస్త్రవేత్తలను అడిగితే జీవితం అంటే- బాంధవ్యాలు అని చెబుతారు. విభిన్న బాంధవ్యాల మధ్య మసలిన వ్యక్తిత్వం మనిషి నాణ్యతను నిర్ణయిస్తుంది. మాన్యతను ఆపాదిస్తుంది. ధన్యతను చేకూరుస్తుంది. రాముడు అరణ్యాలకు వెళ్లిపోయాక భరతుడు నేరుగా అయోధ్యకు రాజయితే అందులో తప్పుపట్టేదేమీ లేదు. పైగా మంత్రిమండలి అతడి చుట్టూ చేరి ‘రమ్ము దయసేయుమయ్య! ధరా ప్రజాళి పడవవలె రేవునం గట్ట బడియె, రమ్ము నీవు చుక్కాని పూనుము’ అని ఆహ్వానించారు. భరతుడు తిరస్కరించాడు. ‘రాజ్యంబు అఖిలంబు రామునిది, జ్యేష్ఠా పత్యమా స్వామి, ఈ అవనీ రాజ్యము దొంగిలింపుమని...’ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు- అని అడిగాడు. ధర్మరాజు జూదవ్యసనం కారణంగా పాండవులు అడవుల పాలయ్యారు. తమ్ముళ్లు తిరగబడలేదు, విడిచిపోలేదు. సరికదా- ‘ధర్మమయ క్రియా తత్పరత్వంబును, కీర్తి, ధనార్జన క్రీడనంబు’తో అలరారే అన్నగారు అజ్ఞాతవాసం ఎలా పూర్తిచేయగలడని చింతాక్రాంతులైనట్లు విరాటపర్వం చెబుతోంది. ఎప్పుడు లంకనుంచి తిరిగొస్తాడా, ఎప్పుడు రాజ్యం అప్పగిద్దామా అని రాముడికోసం భరతుడు ఎదురుచూశాడు. ‘ధర్మతరువు’ లాంటి తమ అన్నగారిని రాజును చేసి ఆయనను సేవించుకొందామని తమ్ముళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. రామాయణ భారతాలు ఏం నేర్పుతున్నాయి ఈ జాతికి- వంచనా, సోదర ప్రేమా?

నడవలేని స్థితిలోని అమ్మానాన్నలను కావడి గంపలో కూర్చోబెట్టి తీర్థయాత్రలకు తిప్పిన శ్రావణకుమారుణ్ని రామాయణం పరిచయం చేసింది. అమ్మకోసం ప్రాణాలకు తెగించి అమృతాన్ని సాధించిన గరుత్మంతుణ్ని భారతం చిత్రించింది. ‘లోకానికంతటికీ బ్రహ్మవిద్యను బోధిస్తున్నావు, నాకూ జ్ఞానభిక్ష పెట్టరా’ అని అడిగిన తల్లి దేవహూతికి తానే గురువై సాంఖ్యయోగాన్ని సాకల్యంగా బోధించిన కపిలుడి కథను భాగవతం చెప్పింది. తల్లికి ఇచ్చిన మాట కోసం సన్యాస ఆశ్రమ స్థాయినుంచి దిగివచ్చి శంకరభగవత్పాదులు తానే స్వయంగా ఆర్యాంబకు అంత్యక్రియలు నిర్వహించారు. ‘ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కల్గినన్‌’ అని విశ్వనాథ చెప్పినట్లు అమ్మానాన్నలను పార్వతీపరమేశ్వరులుగా పూజించిన ఆ సుపుత్రుల గాథలను బాల్యంలోనే నేర్పిస్తే లోకంలో ఇన్ని అనాథాశ్రమాల అవసరం ఉండేదా? ‘తల్లితండ్రిమీద దయలేని పుత్రుండు పుట్టనేల’ అని వేమన చేత చీవాట్లు తినే దుస్థితి దాపురించేదా? కుటుంబంతో అనుబంధం సామాజిక విలువలకు పాదు చేస్తుంది. మనిషి మానవీయుడిగా, మహనీయుడిగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ‘సీత శ్రీరామచంద్రుని చిత్తపదము రామచంద్రుడు జానకీ ప్రాణప్రదము’ అన్నారు కల్పవృక్షకవి. ‘సీతనెరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా’ అంటూ దాంపత్య అద్వైత స్థితిని, సంసార రసయోగాన్ని లోకానికి నూరిపోశారు. హోమగుండంలోంచి ఆవిర్భవించింది ద్రౌపది. ‘వరమున పుట్టితిన్‌, భరతవంశము చొచ్చితి’ అనే ఆభిజాత్యం ఆమెది. ‘పంకజనాభ అట్టి నన్ను’ అంటూ రెండక్షరాల్లో తన స్వాభిమానాన్ని పలికించిన ధీరవనిత- తన భర్తల గురించి ఎంత ఆప్యాయంగా గొప్పగా పలికింది అరణ్యపర్వంలో! ఆ దాంపత్య సౌభాగ్యాలు ఏ స్థాయివి... ఆ బాంధవ్యాలు ఎంత గాఢమైనవి, ఎంత గొప్పవి!

అనుబంధాలు, ఆత్మీయతలు లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. మనిషి జీవితంలోని అన్ని దశల్లోనూ వాటి స్వరూపాన్ని, ఆవశ్యకతను గ్రంథస్తం చేశారు మన రుషులు. ఆచార వ్యవహారాల్లో అందంగా వాటిని పొందుపరచారు పెద్దలు. పాశ్చాత్య అనుకరణలో పడి చాలా దూరం వచ్చేశాం మనం వాటినుంచి. ‘దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటగు’ అన్న భారతం ఉద్యోగపర్వంలోని హితవచనాన్ని శిరసా వహించి ప్రవచనకర్తలు ‘సారపు ధర్మాన్ని’ పదేపదే వివరిస్తూనే ఉన్నారు. ‘అంటే ఆరళ్లంటారు, అనకపోతే అలుసు అవుతారు’ అని సామెత. ‘విపులాచ పృథ్వీ...’ అని భవభూతి చెప్పినట్లుగా ఎవరో ఎప్పుడో వినకుండా పోతారా అనే ఆశాభావంతో చెప్పేవారు చెబుతూనే ఉంటారు. ఇంత సాహిత్యం... ఇన్ని హితవచనాలు... ఇంటింటా ప్రవచనాలు హోరెత్తిపోతూనే ఉన్నాయి, అటు జరగరాని అకృత్యాలెన్నో జరిగిపోతూనే ఉన్నాయి. ‘చీకటికి చురక పెడుతుందిలే చిన్ని మిణుగురు పురుగు, మొండి వానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు’ అని సినారె ఆశపడ్డారు. విరుచుకుపడిన నిరసనలు, కఠినతరమైన చట్టాలు, చర్యలు- ఇకనైనా రాక్షస ప్రవృత్తిని వణికించగలిగితే బాగుండును. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ, దాని చుట్టూ అల్లుకొన్న రకరకాల అనుబంధాల గురించి ఆలోచించాలంటున్నారు అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఐరోపా, అమెరికా వంటి దేశాల సంస్కృతిలో ప్రబలుతున్న వ్యక్తి వ్యవస్థకన్నా భారత్‌, చైనా, కొరియా వంటి దేశాల్లో వ్యాప్తి చెందిన కుటుంబ వ్యవస్థల్లోని సభ్యులు ఎక్కువ ఆనందంగా ఉన్నారని, నాణ్యమైన జీవితం(క్వాలిటీ లైఫ్‌) గడుపుతున్నారని ఆ పరిశోధనల్లో తేలింది. ఈ ఉద్రిక్తతల నడుమ వీటి సారాంశం మనకేదో సందేశాన్ని అందిస్తున్నట్లుంది కదూ!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.