close

సంపాదకీయం

కర్ణాటకం కొత్త సవాళ్లు!

‘నాటకేషు కర్ణాటకం కడు రమ్యం’ అని రుజువు చేస్తూ రోజుల తరబడి సాగిన రాజకీయ డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. బలాబలాల తరాజు మొగ్గు ఎటువైపు ఉందో స్పష్టంగా తెలిసినా విశ్వాస పరీక్షకే సిద్ధపడిన కుమారస్వామి సర్కారు ఆరు ఓట్ల తేడాతో కుప్పకూలింది! ఏదైనా అద్భుతం జరిగి జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజా గండం గడిచి గట్టెక్కకపోతుందా అన్న ఆశ అధికార పక్షంలో మంగళవారం మధ్యాహ్నం దాకా మిణుకు మిణుకుమన్నా- రెండు వైపుల నుంచి ధాటిగా దూసుకొచ్చిన సమాచారంతో అది కాస్తా కొండెక్కింది. రాజీనామాలు సమర్పించి ముంబయిలో మకాం పెట్టిన అసంతృప్త ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం తనను కలవాలంటూ స్పీకర్‌ పంపిన సందేశాన్ని బేఖాతరు చేసి- ఫిరాయింపు ఫిర్యాదులపై తమ వకీలును సంప్రతించడానికి నాలుగు నెలల గడువు కోరడంతో ‘రాజీ’కీయానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షకు నిర్దిష్ట కాలపరిమితుల్ని నిర్ధారిస్తూ రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ఒలకపోసిన అత్యుత్సాహాన్ని ఏ మాత్రం లక్ష్యపెట్టని పాలకపక్షం- ఈ నెల 17న సర్వోన్నత న్యాయపాలిక ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పునస్సమీక్ష జరిగితే, నయానో భయానో అసంతుష్ట ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడం సాధ్యపడగలదనుకొంది. కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) విడివిడిగా దాఖలు చేసిన న్యాయ సంకటాలపై సమాధానాన్ని వాయిదా వేసిన సుప్రీంకోర్టు జరుగుతున్న విశ్వాస పరీక్షపైనే దృష్టి సారించడంతో- విధిలేని పరిస్థితుల్లో అంతిమ యుద్ధానికి పాలక కూటమి సిద్ధపడింది. అధికార పక్షం నుంచి రాజీనామాల్ని ప్రోత్సహించి, ప్రభుత్వాన్ని కూల్చడంలో సఫలమైన కమలం పార్టీ- అసలు సిసలు జాతీయపక్షంగా దేశ ప్రజాస్వామ్య సంస్కృతిని పరిరక్షించే పద్ధతి ఇదేనా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి!

ఎవరి కంపు వారికి ఇంపు అన్నట్లుగా ఫిరాయింపుల రొంపి నుంచి రాజకీయ ప్రయోజనాలు నొల్లుకోవడంలో అన్ని పార్టీలదీ తిలాపాపం తలా పిడికెడు. నిరుడు మే నెలనాటి ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి తొమ్మిది సీట్లు కొరతపడినా, ఏకైక పెద్దపార్టీగా భాజపాయే ఆవిర్భవించిన సంగతి విస్మరించకూడదు. కమలం పార్టీకంటే 1.8 శాతం ఓట్లు అధికంగా పోలైనా, 78 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌- వ్యూహాత్మకంగా జేడీ (ఎస్‌)కు స్నేహ హస్తం సాచి, పట్టుమని 37 స్థానాలకే పరిమితమైనా కుమారస్వామికే ముఖ్యమంత్రిత్వం ఇవ్వడానికి మొగ్గుచూపింది. చేతికి అందింది నోటికి అందకుండా పోతోందన్న అక్కసుతో తమవాడైన గవర్నర్‌ తోడ్పాటుతో ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసేసిన యెడ్యూరప్ప- విశ్వాస పరీక్షకూ నిలవలేక వైదొలగడం తెలిసిందే. భాజపాకు అధికారం దక్కనివ్వరాదన్న ఒకే ఒక అంశంలోతప్ప- పరస్పరం పొసగని రాజకీయ శక్తులుగా జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌ల కలహాల కాపురంపై ఎంతచెప్పినా తక్కువే! ఆపరేషన్‌ కమలకు పోటీగా ఆపరేషన్‌ హస్త చేపట్టాలన్న చర్చలు కాంగ్రెస్‌ భేటీలో సాగినా, అక్కడే నివురుగప్పిన అసమ్మతి నిప్పు కమలనాథులకు కోరని వరమైంది. ఈ నెల ఆరున మొదలైన రాజీనామాల పరంపర పదమూడు మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీ(ఎస్‌), ఇద్దరు స్వతంత్రుల వేర్పాటుకు, సర్కారు మెజారిటీ నిలువునా కోసుకుపోవడానికి కారణమైంది. 2008లో భాజపా తొలిసారి కర్ణాటక పీఠాన్ని సొంతంగా అధిష్ఠించినప్పుడూ కనీస మెజారిటీకి కొద్దిపాటి తరుగుపడితే, విపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి దరిమిలా తన పక్షాన నెగ్గించి అయిదేళ్లూ నెగ్గుకు రాగలిగింది. అదే ఎత్తుగడను నేడు సామూహికంగా అమలుచేసి, ఫిరాయింపుల్లో ప్రమాదకర కొత్త కోణాన్ని ఆవిష్కరించిన భాజపా తెంపరితనం- ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని క్రూరంగా అపహసిస్తోంది!

అధికార పక్షంతో బొడ్డుపేగు బంధాన్ని తెంచుకోని సభాపతులు, ఫిరాయించిన ఎమ్మెల్యేల అర్హతానర్హతల నిర్ధారణపై ఏ విధంగా వక్ర రాజకీయాలకు పాల్పడుతున్నదీ నడుస్తున్న చరిత్రే చాటుతోంది. కేంద్రంలోని అధికార పక్షానికి తాబేదారులుగా భ్రష్టుపట్టిన రాజ్‌భవన్ల వల్లా రాజ్యాంగ స్ఫూర్తి నిలువునా నీరోడుతోంది. ఈ మలిన వాతావరణంలో తమ రాజీనామాల్ని సభాపతి సత్వరం ఆమోదించేలా ఆదేశించాలని కోరుతూ అసంతుష్ట ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వ్యాజ్యం వెయ్యడమే కర్ణాటక వైచిత్రి. వేర్పాటు ఎమ్మెల్యేలు స్పీకరును కలిసి రాజీనామాలు ఇవ్వాలని, వాటిపై అదే రోజు సభాపతి నిర్ణయం ప్రకటించాలనీ న్యాయపాలిక తొలి ఆదేశాలివ్వడం వివాదాస్పదం అయింది. మరో దఫా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు- విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీలు జారీచేసే ‘విప్‌’ ఔచిత్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. ఈ కేసులో ‘రాజ్యాంగ సమతూకాన్ని’ పాటించాల్సి ఉందంటూ- రాజీనామాలపై సభాపతి నిర్ణయానికి కాలావధి నిర్ణయించలేమన్న సుప్రీంకోర్టు, సభకు హాజరు కావాల్సిందిగా అసంతృప్త ఎమ్మెల్యేలను బలవంత పెట్టలేరని స్పష్టీకరించింది. నడుస్తున్న సభా కార్యక్రమాల్లో పాల్గొనాలో వద్దో అసంతృప్త ఎమ్మెల్యేల ఇష్టానికే వదిలేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం రాజ్యాంగం పదో షెడ్యూలులోని క్లాజ్‌ 2 (బి)ని కొరగానిదిగా మార్చేస్తోందని న్యాయనిపుణులు మొత్తుకొన్నారు. పార్టీలు జారీచేసే ‘విప్‌’నకు ఆయా సభ్యులంతా కట్టుబడాల్సి ఉండగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దక్కిన మినహాయింపు- ప్రమాదకర ఉదాహరణగా మిగులుతుందనీ వాపోతున్నారు. ఆ ఆదేశంపై కోరిన పునస్సమీక్ష విచారణను కోర్టు వాయిదా వెయ్యడం, తిరుగుబాటుదారులు మొహం చాటెయ్యడంతో- తమ పట్ల జరిగిన అన్యాయంపై ఎంత బలంగా అధికార కూటమి గొంతు చించుకొన్నా విశ్వాస పరీక్షలో బేలగా మొహం వేలాడేసింది. కన్నడ రాజకీయం విసరిన కొత్త సవాళ్లకు సరైన సమాధానాలు అన్వేషించకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా ధనస్వామ్య దాదాగిరీకే అధికారం పాదాక్రాంతమవుతుంది!

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.